close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాగును లాభదాయకంగా మార్చాలి

గ్రామీణ డిమాండ్‌ తగ్గటమే వ్యవసాయ సంక్షోభానికి మూలం
నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలి
గ్రామీణులందరికీ పీఎం కిసాన్‌ పథకాన్ని అమలుచేసుంటే బావుండేది
గ్రామీణాభివృద్ధిశాఖకు బాధ్యతలు బదలాయించాలి
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రణాళికాసంఘం, 14వ ఆర్థికసంఘం సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌
ఈనాడు - దిల్లీ

గ్రామీణ డిమాండ్‌ తగ్గడమే ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి కారణమని  ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ పేర్కొన్నారు. ప్రణాళికసంఘం సభ్యుడిగా, 14వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కీలకభూమిక పోషించిన ఆయన ప్రస్తుతం దేశంలో నెలకొన్న రైతాంగ, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తులో ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలపై ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతులంతా ధరల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈనామ్‌ పథకం దాన్ని పరిష్కరించడంలేదని పేర్కొన్నారు. కనీస ఆదాయం కల్పించేందుకు పీఎం కిసాన్‌ పథకాన్ని కేవలం రైతులకే కాకుండా గ్రామీణప్రాంతాల్లో నివసించేవారందరికీ అమలుచేసి ఉంటే బాగుండేదన్నారు.పనిచేసేవారికి గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి కార్యక్రమాల ద్వారా కనీస ఆదాయం కల్పించి, పనిచేయలేని వారికి పింఛన్లు ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థికసంఘం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. జనాభా విషయంలో ఎలాంటి పంథా అనుసరించాలన్న విచక్షణను 15వ ఆర్థికసంఘానికే వదిలేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయాలిలా ఉన్నాయి.

ప్రశ్న: దేశంలో ప్రస్తుతం రైతుల స్థితిగతులెలా ఉన్నాయి?
జవాబు: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ తగ్గడమే సమస్యలకు మూలకారణమవుతోంది. వ్యవసాయం దెబ్బతినడంవల్లే అక్కడ డిమాండ్‌ తక్కువగా ఉంటోంది. జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దుకారణంగా అసంఘటిత రంగం తీవ్రంగా ప్రభావితమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర వృత్తులు బాగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు గ్రామీణ డిమాండే ఆయువుపట్టు అయినా, అక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో ధరలు తగ్గిపోతున్నాయి.

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలంటే రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలి?
వ్యవసాయం లాభదాయకంగా మారకపోవడానికి గ్రామీణ డిమాండ్‌ తక్కువగా ఉండటమే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెంచగలిగితే ధరల పెరుగుదల మొదలవుతుంది. ఒకవైపు డిమాండ్‌ను పెంచి రైతులకు లాభదాయక ధరలు వచ్చేలా చేయాలి. ఒకవేళ డిమాండు లేకపోయినా మార్కెట్లు సరిగా పనిచేసేలా సంస్కరణలు తీసుకురావాలి.

గ్రామీణ డిమాండ్‌ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ముఖ్యంగా నిర్మాణరంగాన్ని ప్రోత్సాహించాలి.యూపీయే సమయంలో వేతనాలు పెరగడానికి నిర్మాణరంగం జోరు కొనసాగడమే కారణం తప్ప ఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కాదు. అప్పట్లో గ్రామీణ ప్రాంత ప్రజలు నిర్మాణరంగంలో ఉపాధి పొందారు. ఇప్పుడు మళ్లీ ఆ రంగంలోకి పెట్టుబడులు వచ్చే వాతావరణం కల్పిస్తే   డిమాండ్‌ పెరగడం ప్రారంభం అవుతుంది. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై ఎక్కువ ఖర్చు చేయగలిగితే ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. ఆ మొత్తాన్ని వారు ఇతర అంశాలపై ఖర్చుపెట్టడానికి వెసులుబాటు లభిస్తుంది.

తమ హయాంలో ద్రవ్యోల్బణం చాలా అదుపులో ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇది  ఎంతవరకు దేశానికి మేలుచేస్తుంది?
ఏ వస్తువుకైనా ఎక్కువ ధర లభిస్తే ఉత్పత్తిదారుడికి మేలుచేస్తుంది. వినియోగదారుడికి భారంగా మారుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గితే రైతుకు నష్టం చేకూరుతుంది. వినియోగదారుడికి మేలు జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో డిమాండ్‌ తగ్గిపోవడం వల్లే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటోంది.

గత యూపీయే హయాం నాటి పరిస్థితులకు, నేటి ఎన్డీయే ప్రభుత్వ విధానాలతో పోలిస్తే రైతులు, చిన్న, సన్నకారు వ్యాపారులు, అసంఘటితరంగంపై ఏది ఎక్కువ  ప్రభావం చూపాయి?
ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే యూపీయే ప్రభుత్వంలోని పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. అప్పట్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండేది. ఆహారద్రవ్యోల్బణం కొన్నిసార్లు 10%కూడా దాటింది. సగటున ద్రవ్యోల్బణం 7-8%మేర ఉండేది.  మరోవైపు యూపీయే హయాంలో పంట ఉత్పత్తుల వృద్ధిరేటు 3.5% నుంచి 4%వరకు ఉండేది. ఇప్పుడు అది ఒకశాతంలోపే ఉంది. యూపీయే హయాంలో  పంట ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండటంవల్ల రైతులు ఎక్కువ ఉత్పత్తిచేసేవారు. ఇప్పుడు డిమాండ్‌ లేకపోవడంవల్ల తక్కువ పండిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో విధానాల్లో చాలా మార్పులు చేశారు. అందులో ప్రధానమైంది 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెంచారు. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం చాలా రంగాల ఖర్చుల్లో కోతపెట్టింది. దీని వల్ల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.

నేడు రైతు రుణమాఫీ అంశం ఎన్నికల నినాదంగా మారింది. 2014 నుంచి ఎన్నోరాష్ట్రాలు దాన్ని అమలుచేశాయి. ఇప్పుడు కేంద్రం కూడా కొత్తగా పీఎంకిసాన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు మేలుచేస్తుందా?
మాఫీలు సమస్యలకు పరిష్కారం కాదు. దేశ చరిత్రను పరిశీలిస్తే ప్రతి పదేళ్లకోసారి రైతులకు రుణమాఫీలాంటి పథకాలు అమలుచేసిన ఉదంతాలున్నాయి. తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకిది  ఉపశమనం అనొచ్చు. ఇలాంటి ఉపశమన చర్యలవల్ల వ్యవసాయ ఉత్పాదకతపై తక్షణ మంచి ఫలితాలు చూపిన సందర్భాలున్నాయి. రైతుల అప్పులు భారీస్థాయిలో పేరుకుపోతే బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వడానికి ముందుకురావు. ఫలితంగా ఆర్థిక వనరులు అందుబాటులో లేక రైతుల ఉత్పాదకశక్తి తగ్గిపోతుంది. రుణమాఫీలాంటి పథకాలవల్ల బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు ప్రక్షాళన అవుతాయి కాబట్టి అవి మళ్లీ రైతులకు కొత్తగా రుణాలు ఇస్తాయి. మరోవైపు దీని దుష్పరిణామాలుకూడా ఉన్నాయి. ఒకసారి రైతులకు మీరు తీసుకున్న అప్పు కట్టాల్సిన అవసరంలేదన్న సంకేతం ఇస్తే వాళ్లు చెల్లించరు.

చాలా ఏళ్లుగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దానిపై మీరేమంటారు?
ఆ పథకం కింద చేపట్టే 70% పనులు భూమి, నీటికి సంబంధించినవే కాబట్టి ఉపాధి హామీ పథకం ఇప్పటికే వ్యవసాయంతో అనుసంధానమై ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు రైతులు చెల్లించే కూలీ ఖర్చుల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నారు. దానికోసమే వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నారు. అలాచేస్తే రుణమాఫీ అమల్లో వచ్చే సమస్యలే వస్తాయి. పెద్దఎత్తున మోసం జరిగే ప్రమాదం ఉంటుంది. 2007లో ఈ పథకం ప్రారంభమైంది. దానివల్ల వ్యవసాయ వృద్ధిరేటుపై ఎలాంటిప్రభావం పడలేదు. వ్యవసాయకూలీ ఖర్చులను ఈ పథకం ద్వారా చెల్లించాలని కోరుకోవడం సరికాదు.

గిట్టుబాటు ధరలందక  రైతులు ఎప్పుడూ అయిన కాడికి ఉత్పత్తులను అమ్ముకుని నష్టపోతూంటారు.      పెట్టుబడి వెనక్కి రాని పరిస్థితి ఉంటోంది. ఆ నష్టాన్ని ఎలా భర్తీచేయాలి?
ఈసారి కేంద్ర వ్యవసాయ బడ్జెట్‌చూస్తే దాదాపు రూ.1.20 లక్షల కోట్లు ఉంది. అందులో పీఎంకిసాన్‌ పథకానికే రూ.75వేల కోట్లు కేటాయించారు. మిగతా వ్యవసాయానికంతటికీ కలిపి రూ.50వేల కోట్లలోపే పెట్టారు. అందులోనూ ఫసల్‌బీమా యోజన, వడ్డీరాయితీ, పప్పుధాన్యాలకు ఇస్తున్న మద్దతు ధరలకోసం మరో రూ.30వేల కోట్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయ బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.లక్షకోట్లు తీసేస్తే వ్యవసాయ ప్రధాన కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేసే అసలు ఖర్చు 2014లో కంటే తగ్గింది. దీన్నిబట్టిచూస్తే వ్యవసాయ రంగంలో ప్రాథమిక మార్పులకోసం పనిచేయకుండా రైతులకు కేవలం డబ్బు అందించడానికే పరిమితమవుతోంది. దీనివల్ల సమస్యలు వస్తాయి. రైతులకు డబ్బు ఇచ్చే పాత్రను గ్రామీణాభివృద్ధిశాఖ పోషించాలి తప్పితే వ్యవసాయశాఖ కాదు.

తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలుచేస్తామని రాహుల్‌గాంధీ చెబుతున్నారుకదా? అది ఎంతవరకు మేలుచేస్తుందంటారు?
దేశంలోని ప్రజలకు కనీస ఆదాయం కల్పించాలన్నదే ఆ పథకం ఉద్దేశం కావొచ్చు. కాబట్టి పనిచేయలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, ఇతరులకు పింఛనురూపంలో ఆదాయం కల్పించాలి. పనిచేయగలిగే స్థితిలో ఉన్న వారికి ఆదాయం కల్పించడానికి గ్రామీణ ఉపాధి హామీ లాంటి పథకాన్ని విజయవంతంగా నిర్వహించాలి.

15వ ఆర్థికసంఘం విధివిధానాల కారణంగా జనాభా నియంత్రణ పాటించిన తాము నష్టపోవాల్సి వస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దానిపై మీరేమంటారు?
ఒక రకంగా చెప్పాలంటే 14వ ఆర్థికసంఘం 1971 జనాభా ప్రాతిపదికన 2011నాటి లెక్కలను తీసుకొని హైబ్రీడ్‌ఫార్ములా అనుసరించింది. కానీ 15వ ఆర్థికసంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం వెళ్లాలని నిర్దేశించారు. అలా చెప్పకుండా వదిలేసి ఉంటే 15వ ఆర్థికసంఘం అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ఉండేది. ఇప్పుడు కొత్త విధానం వల్ల జనాభా వృద్ధిరేటు తక్కువ ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఎక్కువ ఉన్న రాష్ట్రాలు లాభపడతాయి.ఏ ప్రాతిపదికన  వెళ్లాలన్న విచక్షణాధికారాన్ని ఆర్థికసంఘానికే వదిలిపెట్టి ఉంటే బాగుండేది.


విభజనతో తెలంగాణకు ఎక్కువ ప్రయోజనం

విభజన తర్వాత తెలుగురాష్ట్రాలను మీరు గమనించారా? అవి ఎలా పనిచేస్తున్నాయి?
విభజన కారణంగా తెలంగాణ లాభపడుతుంది, ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతుందన్న భావన ఉండేది. అనుకున్నట్లుగానే తెలంగాణ ఎక్కువ ప్రయోజనం పొందింది. ఆంధ్రప్రదేశ్‌ కొంతవరకు నష్టపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ భారీగా నష్టపోతుందన్న భయం ఉండేది. అది నిజం  కాదనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాగా ఖర్చు చేస్తోంది. ఖర్చుల నాణ్యత బాగుంది. తెలంగాణ ఎక్కువగా ప్రజాకర్షక పథకాలపై ఖర్చు చేసింది.

14వ ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయామని కేంద్రం చెబుతోంది కదా? ఆర్థికసంఘం సభ్యుడిగా దీనిపై మీరేమంటారు?
అది నిజంకాదు. ఆర్థిక సంఘం తన నివేదికలో ఎక్కడా ప్రత్యేకహోదా గురించి చెప్పలేదు. ఇకమీదట ప్రత్యేకహోదా రాష్ట్రాలు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు.గ్రాంట్ల కేటాయింపు విషయంలో పాత ఆర్థికసంఘాలు ప్రత్యేకహోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య కొంత ప్రత్యేక కసరత్తుచేసేవి. మా కమిషన్‌ అలాంటిది చేయలేదు. తమకు నిర్దేశించిన విధి విధానాల్లో  ప్రత్యేకహోదా రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చూడాలని ఎక్కడా చెప్పలేదు. అందువల్ల వల్ల మా సిఫార్సుల సమయంలో ఆ అంశాన్ని పట్టించుకోలేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.