close

ప్ర‌త్యేక క‌థ‌నం

భవిత మీట నొక్కండిలా

పోలింగ్‌ కేంద్రంలో ఏం చేయాలంటే..

భారత ప్రజాస్వామ్యం మరో అడుగు ముందుకు వేసేందుకు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సప్తపదిలో (ఏడు దశల పోలింగ్‌) తొలి అడుగుకు సమయం ఆసన్నమైంది. తొలిదశలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు సహా దేశంలోని 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాలకు గురువారం (ఈ నెల 11న) పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా శాసనసభలో 28 స్థానాలకు తొలిదశలో పోలింగ్‌ జరగనుంది.

మీరు, మీ కుటుంబంలో ఓటు ఉన్న వారి ఓటరు చీటీలు, గుర్తింపు కార్డులు సిద్ధం చేసుకోండి. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో సరిచూసుకోండి. దానివల్ల మీకు చివరి నిమిషంలో హడావుడి తప్పుతుంది.

ప్రవేశం
11వ తేదీన మీ ఓటరు చీటి, ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒక దానిని తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లండి. వరుసలో వేచి ఉండి మీ వంతు వచ్చేవరకు ఓపికగా ఉండండి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు సహకరించండి. ఓటరు కార్డ్‌ లేకున్నా.. ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా దగ్గర ఉంచుకుంటే మీరు ఓటు వేయవచ్చు.

1 తనిఖీ
పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లాక.. మొదటి ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్లండి. ఓటర్ల జాబితాకు బాధ్యత ఆయనదే. మీ వివరాలను పరిశీలించిన తర్వాత ఆయన మీ పేరు, క్రమ సంఖ్య పోలింగ్‌ కేంద్రంలో అందరికీ వినిపించేలా గట్టిగా చదువుతారు. దీంతో అక్కడే ఉన్న ఏజెంట్లు వివరాలు సరిచూసుకుంటారు.

2 గుర్తు
అనంతరం మీరు రెండో పోలింగ్‌ అధికారి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు (చెరిగిపోకుండా కొద్దిరోజుల పాటు అలాగే ఉండేది) పెడతారు. అనంతరం మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. (చదువుకోని వారు వేలిముద్ర వేస్తారు). ఆ తర్వాత రెండో పోలింగ్‌ అధికారి మీకు ఓటు కేటాయింపు కాగితం అందజేస్తారు.

3 ఓటు విడుదల
రెండో పోలింగ్‌ అధికారి ఇచ్చిన చీటీ తీసుకుని మూడో పోలింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.   ఆ కాగితాన్ని తీసుకున్న ఆయన కంట్రోల్‌ యూనిట్‌లోని మీట నొక్కుతారు. దీంతో ఓటు    విడుదలవుతుంది.

ప్రశాంతంగా ఓటు వేయండి
చివరగా బ్యాలెట్‌ యూనిట్‌ దగ్గరకు (చుట్టూ అట్టలు ఉండే ప్రాంతం) వెళ్లండి. ఎలాంటి ఆదుర్దా, గాబరా పడకండి. ప్రశాంతచిత్తంతో ఉండండి. మీకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తుకు ఎదురుగా ఉన్న మీట నొక్కండి. చిన్నపాటి శబ్దంతో ఓటు నమోదవుతుంది. వెంటనే మీ ఓటు మీరు అనుకున్న అభ్యర్థి ఖాతాలోకే వెళ్లిందా లేదా అనేది వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)లో సరిచూసుకోండి. ఆ యంత్రంలోని కాగితంపై మీరు ఓటు వేసిన అభ్యర్థి గుర్తు ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. చివరగా ప్రజాస్వామ్య యజ్ఞంలో ‘నా పాత్రను సమర్థంగా పోషించాను’  అన్న ఆత్మ సంతృప్తితో వెనుదిరగండి.

మీ ఓటు ఎవరైనా వేసేస్తే..
మీరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సరికే ఎవరైనా మీ ఓటు వేసేసినట్లు ఉంటే.. (సాధారణంగా అలా జరగదు) టెండర్‌ ఓటు   వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం మీ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. దానిని పరిశీలించిన అధికారులు మీ వివరాలు నమోదుచేసుకుని, సంతకం తీసుకుని మీకు బ్యాలెట్‌ పత్రం అందజేస్తారు. దానిపై మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. అనంతరం ఆ బ్యాలెట్‌ పత్రాన్ని తిరిగి ఎన్నికల అధికారి అందజేయాలి.

వీటిలో ఏదో ఒకటి ఉండాలి సుమా
ఫొటో ఓటర్‌ కాగితం ఒక్కదానితోనే మీరు ఓటు వేయలేరు. ఆ కాగితంతోపాటు ఓటర్‌ కార్డు ఉండాలి. ఒకవేళ ఓటర్‌ కార్డు లేకుంటే.. ఎన్నికల సంఘం పేర్కొన్న క్రింది ధ్రువీకరణల్లో ఏదో ఒకటి ఉండాలి. ఆ వివరాలు..
1 పాస్‌పోర్ట్‌
2 ఆధార్‌ కార్డ్‌
3 డ్రైవింగ్‌ లైసెన్స్‌

4 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పీఎస్‌యూలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు.. తమ ఉద్యోగులకు జారీచేసే సర్వీస్‌ గుర్తింపు కార్డులు(ఫొటోతో ఉన్నవి మాత్రమే)
5 బ్యాంకులు, తపాలా కార్యాలయాలు జారీచేసిన పాస్‌ పుస్తకాలు(ఫొటోతో ఉన్నవి)
6 పాన్‌కార్డ్‌
7 ఉపాధిహామీ స్మార్ట్‌కార్డ్‌
8 కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డ్‌
9 ఫొటోతో సహా ఉన్న పింఛను పత్రం
10 ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులు

సెల్‌ఫోన్‌ తీసుకెళ్లొద్దు

పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు తీసుకుని వెళ్లడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది.

- ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.