close

ప్ర‌త్యేక క‌థ‌నం

చదువు కొనాల్సిందేనా?

ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో డొనేషన్ల దోపిడీ 
నిబంధనలకు కళాశాలల తిలోదకాలు 
సాంకేతిక సమస్యలున్నాయంటూ పట్టించుకోని విద్యాశాఖ 
ఈనాడు - హైదరాబాద్‌

బీటెక్‌ చేస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్న తల్లిదండ్రుల ఆశను ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నా, విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు పలు వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నా.. ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో నిరంతరాయంగా జరుగుతున్న డొనేషన్ల వసూళ్లకు అడ్డుకట్ట వేసే కనీస ప్రయత్నం లేకపోవడం గమనార్హం. విద్యార్థికి ప్రతిభ ఉన్నా, అదనంగా డొనేషన్‌ చెల్లించక తప్పడంలేదు. బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లను ప్రతిభావంతులకు దక్కే ప్రణాళిక తయారు చేయడంలో విద్యాశాఖ చొరవ చూపకపోగా, నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో యాజమాన్యాలు మరింత బలం పుంజుకుని ‘మా సీట్లు మా ఇష్టం’ అన్నట్లు తల్లిదండ్రుల నుంచి డొనేషన్లు వసూలు చేస్తూ బీ కేటగిరీ సీట్లు భర్తీ చేస్తున్నాయి. 
కొన్ని కళాశాలల్లోని బీటెక్‌ సీట్లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తూ, బీ కేటగిరీ సీట్లకు ఏటా ‘దుకాణాలు’ తెరుస్తున్నాయి. విద్యార్థుల నుంచి పోటీ పెరిగేకొద్దీ, డొనేషన్లు పెంచుతూ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఇంజినీరింగ్‌ సీట్లలో 70% కన్వీనర్‌ కోటా, 30% యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. యాజమాన్య కోటాలో 15% జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా, మిగిలిన 15% ఎన్‌ఆర్‌ఐ లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కేటగిరీకి ఇస్తారు. బీటెక్‌ కోర్సులో ఒక సెక్షన్‌కు 60 సీట్లుంటే వాటిల్లో 42 సీట్లను కన్వీనర్‌ కోటా కింద ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన 18 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. నిబంధనల ప్రకారం కన్వీనర్‌ సీట్లకు తీసుకునే రుసుమే యాజమాన్య సీట్లకూ వర్తిస్తుంది. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఏడాది ఫీజును 5 వేల అమెరికా డాలర్లుగా ప్రభుత్వమే నిర్ణయించింది. వాటితోపాటు అదనంగా రూ.లక్షలు ఇస్తేనే సీట్లిస్తున్నారు. అతికొద్ది కళాశాలలు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం నిర్దేశించిన విధానాన్ని పాటిస్తున్నా, డొనేషన్లు మాత్రం వసూలు చేస్తూనే ఉన్నాయి. 
జీఓ 66 ఉన్నా.. 
డొనేషన్ల వసూలుపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందటంతో 2012 సెప్టెంబరు 3న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై జీఓ 66 జారీ చేశారు. విద్యార్థులు, ముఖ్యంగా దివ్యాంగులు ప్రతి కళాశాలకు వెళ్లి యాజమాన్య కోటా సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే ఉమ్మడి పోర్టల్‌ రూపొందించి ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల నుంచి ఉన్నత విద్యామండలి దరఖాస్తులను స్వీకరిస్తుంది. వాటిని ఆయా కళాశాలలకు పంపిస్తారు. ప్రతిభ ఆధారంగా యాజమాన్యాలు సీట్లను భర్తీ చేస్తాయి. ఆ జాబితాను కూడా ఆన్‌లైన్‌లో అందరూ చూసుకునేలా ఉంచాలి. అయితే దీన్ని 2013-14 విద్యాసంవత్సరానికి అమలు చేసినా పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ‘ఒకవేళ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తే వారు రుసుములు చెల్లించకపోతే ఎలా? ఒకసారి ఎంపిక చేసిన తర్వాత వారు చేరకుంటే ఎలా? తర్వాత మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలా? ఒక విద్యార్థి 10 కళాశాలలకు దరఖాస్తు చేసి అన్నిట్లో ఎంపికైతే ఒక కళాశాలలో చేరితే మిగిలిన 9 కళాశాలలు ఏం చేయాలి?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దానికితోడు పలు సమస్యలకు పరిష్కారం చూపే సాఫ్ట్‌వేర్‌ కూడా అప్పట్లో లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టలేదు. దాంతో యాజమాన్యాలు వసూళ్ల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. 
సంకల్పం ఉంటే చాలు.. 
తేనెతుట్టను కదిలించడం ఎందుకన్నట్లు అధికారులు ఈ అంశంపై దృష్టి సారించడంలేదు. డొనేషన్లపై ఫిర్యాదు చేస్తే ‘ఆధారాలతో రండి. రసీదులు ఉన్నాయా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘కళాశాలల దోపిడీని ఆపాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఇదేమంత గాడిలో పడని సమస్య కాదు. ప్రభుత్వం అనుకోవాలంతే’ అని విద్యాశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో జరిపేందుకు సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు ఎన్‌ఐసీతో మాట్లాడుతున్నామన్నారు. ‘దరఖాస్తులు మేం స్వీకరించి వాటిని కళాశాలలకు పంపిస్తాం. బీ కేటగిరీ సీట్ల భర్తీ తుదిఅధికారం కళాశాలలదే’ అని చెప్పారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.