close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూముల ధరల్లో దిద్దుబాటు ఉండొచ్చు!

హైదరాబాద్‌ రియల్‌ రంగానికి ఢోకా లేదు
కొవిడ్‌-19 భయాలతో ప్రస్తుతం స్తబ్దత
‘ఈనాడు’తో నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌-ఇండియా (ఎన్‌ఏఆర్‌)
జాతీయ అధ్యక్షుడు ఎ.సుమంత్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

‘స్థిరాస్తి రంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్దత తాత్కాలికం. కరోనా భయాలతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని కొనుగోలుదారులు కాస్త వెనకడుగు వేస్తున్నారు. పరిస్థితులు చక్కబడగానే సాధారణ స్థితికి వస్తుంది. మార్కెట్‌ వృద్ధిలో ఉన్నప్పుడు అందరూ కొంటారు. అప్పుడు ప్రీమియం ధరలు చెల్లించాలి. నిజానికి మార్కెట్‌ డీలా ఉన్నప్పుడు స్థిరాస్తి కొనడం లాభిస్తుంది’ అని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌- ఇండియా(ఎన్‌ఏఆర్‌) జాతీయ అధ్యక్షుడు ఎ.సుమంత్‌రెడ్డి అన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో రియల్‌ ఎస్టేట్‌ వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులపై ఆయన తన అంచనాలను వివరించారు.
ప్రస్తుతం స్థిరాస్తి మార్కెట్‌ ఎలా ఉంది?
లాక్‌డౌన్‌కు ముందున్న ధరల కంటే తక్కువకు వస్తే స్థిరాస్తులు కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. 2008లో పరిస్థితికి ఇది పూర్తి భిన్నం. అప్పట్లో ధరలు తగ్గించి అమ్ముతామన్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడలా లేదు. లాక్‌డౌన్‌లో అందరినీ ఆదుకున్నది ఇల్లే కాబట్టి స్థిరాస్తి రంగానికి ఢోకా ఉండదని భావిస్తున్నా.
ధరలు తగ్గేందుకు అవకాశం ఉందా?
భూముల విషయంలో ధరలు తగ్గే అవకాశం ఉంది. దిద్దుబాటు ఉండొచ్చు. నిర్మాణదశలో ఉన్న కట్టడాల ధరలు తగ్గుతాయని భావించడం లేదు. పైగా ప్రస్తుతం కూలీల కొరత, స్టీల్‌ తదితర సామగ్రి లభ్యత తక్కువగా ఉంది. డిమాండ్‌ ఉన్నవాటికి సహజంగానే ధరలు ఎక్కువ ఉంటాయి. దీంతో నిర్మాణవ్యయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రాజెక్టుల్లో ధరలు తగ్గే సూచనలు లేవు. ఇది వరకే ఇళ్లు పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్నవాటిలో కొంత దిద్దుబాటు ఆశించవచ్చు.
మార్కెట్‌ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది?
వైరస్‌ ప్రభావం తగ్గి.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. అప్పటి నుంచి స్థిరాస్తి మార్కెట్‌ గాడిలో పడేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుంది. మూడేళ్లుగా హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధిపథంలో ఉన్నందున.. ఈ స్వల్ప ఒడుదొడుకులను ఇక్కడి బిల్డర్లు తట్టుకోగలరనే నమ్ముతున్నా. ఇతర నగరాల్లో చాలాకాలంగా మార్కెట్‌ పెద్దగా ఆశాజనకంగా లేదు. దీనికి లాక్‌డౌన్‌ తోడైంది.
ఈ రంగం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ప్రభుత్వం స్థిరాస్తి రంగం నుంచి వచ్చే ఆదాయంపై చాలా ఆశలు పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంది. మార్కెట్‌ పడిపోకుండా ప్రభుత్వం నుంచి తగు చర్యలు, ప్రోత్సాహకాలుంటాయి. కరోనా నేపథ్యంలో కొన్ని దేశాలు చైనా కాకుండా వేరే చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. భారత్‌ వైపూ చూస్తున్నాయి. ఈ క్రమంలో దేశానికి వచ్చే పెట్టుబడులను హైదరాబాద్‌ ఆకర్షించే అవకాశం ఉంది. ఇవన్నీ మార్కెట్‌ను నడిపించేవే. కొత్త కంపెనీల రాకతో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు పూర్తిగా నిండే అవకాశం ఉంటుంది.


లాక్‌డౌన్‌ తర్వాత ఎలాంటి మార్పులు చూడబోతున్నాం?

కొవిడ్‌-19 ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా ఉంది. కొత్త హోటళ్ల నిర్మాణం, విస్తరణ ప్రణాళికలు వాయిదా పడతాయి. ఆసుపత్రుల నిర్మాణాలు పెరిగే అవకాశం ఉంది. కరోనా ప్రభావం నగరంలోనే అధికంగా ఉంది. సురక్షిత ప్రదేశాల్లో నివాసం ఉండాలనుకునేవారు సిటీ నుంచి శివార్ల వైపు మొగ్గుచూపేందుకు ఆస్కారం ఉంది. కార్యాలయానికి దగ్గరలో ఉండాలని భావిస్తే.. శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు అవకాశం ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ఇరుకిరుకు ఇళ్లలో ఇబ్బంది పడినవారు విశాలమైన ఇంటికోసం కొంతదూరం వెళ్లేందుకు సిద్ధపడతారని అంచనా వేస్తున్నాం. వాణిజ్యపరంగా మాల్స్‌ కంటే హై స్ట్రీట్‌ మార్కెట్ల వైపు జనం మొగ్గుచూపే అవకాశం ఉండటంతో ఇక్కడా అవకాశాలుంటాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.