దళారుల దందా
దళారుల దందా

సర్కారు ఆశయం మంచిది. స్వార్థపరుల దురాశ చెడ్డది. పేదల నిస్సహాయతను అలుసుగా తీసుకుని దళారులు దందా చేస్తున్నారు. అందినంత దోపిడీ చేస్తున్నారు. రెండు పడక గదుల ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాల్లో తాజాగా వెలుగు చూస్తున్న అక్రమాలు దీనికి తార్కాణం. ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్లకు స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సకు సొమ్ము మంజూరు చేయిస్తామంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.


డబుల్‌ దోపిడీ

ఇళ్ల నిర్మాణానికి స్థలాల కొరతను సాకుగా తీసుకుని..

సొమ్ములు వసూలు చేసి భూముల కొనుగోళ్లు

ముందే అనధికారికంగా లబ్ధిదారుల ఎంపిక

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో రెండు పడకగదుల ఇళ్లకు ప్రభుత్వ భూమి దొరకలేదు. వంద మంది లబ్ధిదారుల నుంచి రూ.20-50 వేల చొప్పున స్థానిక నాయకులు వసూలు చేశారు. ఎకరాకు రూ.7.5 లక్షలు వెచ్చించి అయిదెకరాలు కొన్నారు. రెండేళ్ల కిందటే ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. కారణం.. స్థలానికి డబ్బులిచ్చింది 100 మంది.. కట్టిన ఇళ్లు 70. ఎవరిని తొలగించాలో తేల్చుకోలేక ఇళ్లను వదిలేశారు. భూమికి ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. లేదంటే ఖాళీ స్థలం స్వాధీనం చేసుకుంటానంటున్నారు ఆ భూమి యజమానుల్లో ఒకరైన గణపవరపు శ్రీను. తనకూ ఓ ఇల్లిస్తామంటూ రూ.50 వేలు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపణ.


సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో సిరిసిల్ల పట్టణ నిరుపేదల కోసం 1,320 ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారింది. స్థానిక నాయకులు ఒక్కొక్కరు 100-200 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులొచ్చాయి.


సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌కు 2016లో 15 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ స్థలం లేదు. స్థానిక నాయకుల సూచనతో 15 మంది రూ.50-60 వేల చొప్పున ఇవ్వగా, ఆ డబ్బుతో కొన్న ఎకరం 6 గుంటల భూమిని ఓ నాయకుడు తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఇళ్లు కట్టకపోవడంతో డబ్బులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది.


ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: పేదలకు ఉచితంగా కట్టిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకానికి స్థానిక నాయకులు తూట్లు పొడుస్తున్నారు. స్థలాల కొరతను సాకుగా తీసుకుని, వారు దళారుల అవతారమెత్తారు. కొన్నిచోట్ల పేదల నుంచి సొమ్ము వసూలు చేసి, స్థలాలు కొనుగోలు చేయిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల స్థలాల పేరిట రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సేకరించారు. సిరిసిల్లలో ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో లబ్ధిదారుల నుంచి రూ.లక్ష - 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక

అర్హులకే ఇళ్లను కేటాయించాల్సి ఉన్నా పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. డబ్బులిచ్చిన వారు, స్థానిక నాయకులు చెప్పిన వారే లబ్ధిదారులవుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలం అవసరమైతే, ప్రభుత్వమే కొనాలి. దాతలు ఉచితంగా స్థలమిస్తే దాన్ని స్థానిక సంస్థ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించాలి. కానీ కొన్నిచోట్ల స్థానికనేతలు తమ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

* సిద్దిపేట జిల్లా నర్సాయపల్లికి 2016లో 18 ఇళ్లు మంజూరు కాగా స్థానిక నాయకుడు ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పున తీసుకుని రెండెకరాలు కొన్నాడు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యినా, పంపిణీ ఆలస్యమైంది. ఒత్తిడి రావడంతో కొంతమందికి డబ్బు తిరిగిచ్చాడు. 

* మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం నిజలాపూర్‌లో 104 ఇళ్లకు లబ్ధిదారులే స్థలాన్ని కొన్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఆ ఇళ్లలోనే వారుంటున్నారు.

* భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం చల్లసముద్రం, లలితాపురంలలో 20 మంది చొప్పున లబ్ధిదారులు సొంత సొంత డబ్బుతో భూమి కొనుగోలు చేసి ఇచ్చారు.ఆ స్థలాల్లోనే వారికి ఇళ్లు కట్టించి ఇచ్చారు.


స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు రాసిచ్చారు

ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నారాయణ, గణపవరపు శ్రీను ముందుకువచ్చారు. స్వచ్ఛందంగా అయిదెకరాలు ఇస్తున్నట్లు కాగితం రాసిచ్చారు. 75 ఇళ్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తయ్యింది.

- పుల్లయ్య, కారేపల్లి తహసీల్దార్‌


చర్యలు తీసుకుంటాం

అర్హులకే ఇళ్లు కేటాయిస్తాం. డబ్బులు వసూలు చేసి భూములు కొనుగోలు చేసే ప్రక్రియ సరైంది కాదు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటాం.

- నరేందర్‌, తహసీల్దార్‌, మద్దూరు


అప్పు చేసి రూ.50 వేలు ఇచ్చా

ప్రభుత్వ జాగా లేదనడంతో ఒక్కొక్కరం రూ.50 వేలు ఇచ్చాం. నేను అప్పు చేసి తెచ్చా. ఇళ్లు కట్టించి ఇచ్చినా, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం.

- ఆరెం సీత, చల్లసముద్రం పంచాయతీ వేములవాడ, భద్రాద్రి జిల్లా


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని