close
Updated : 17/08/2021 20:26 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆ 9 నెలలు పని చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!

గర్భం ధరించామని తెలిసినప్పట్నుంచి సున్నితంగా మారిపోతుంటారు మహిళలు. ఈ క్రమంలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికీ భయపడిపోతుంటారు. కారణం.. తాము చేసే పనుల వల్ల తమ కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని! అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. రోజువారీ కూలీ పనులు చేసే మహిళల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది నిండు గర్భంతోనే తమ తమ పనుల్లో కొనసాగడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి గర్భం ధరించినా ఇలా యాక్టివ్‌గా ఉండడమే మంచిందంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సహకరిస్తే గనుక డాక్టర్‌ సలహా మేరకు ప్రసవం సమీపించే దాకా తమ తమ పనుల్లో కొనసాగచ్చంటున్నారు. పైగా ఇలా తల్లి చురుగ్గా పనిచేయడం వల్ల అటు పుట్టబోయే పిల్లలు కూడా చురుగ్గా ఉంటారట! అలాగని పని పైనే పూర్తి ధ్యాస పెడుతూ కాబోయే తల్లులు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదని, తమ తమ విధుల్లో కొనసాగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

నిండు గర్భంతోనే వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారు, రోజువారీ కూలీ పనులు చేసుకునే మహిళల్ని మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా గర్భం ధరించినా తమ తమ విధుల్లో కొనసాగుతున్నారు. మీరూ వీరినే ఫాలో అవుతూ నెలలు నిండుతున్నా పని చేయాలనుకుంటున్నారా? అయితే అందుకోసం మీ ఆరోగ్య పరిస్థితిని ఓసారి వైద్యుల వద్ద చెక్‌ చేయించుకొని వారు సరేనంటే ముందుకెళ్లమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..!

ఇవి పాటించాల్సిందే!

* కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని వృత్తుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే గర్భిణిగా ఇలా ఎక్కువ సేపు నిల్చున్నా/కూర్చున్నా ఇబ్బందే! కాబట్టి మీ పనిని బట్టి నిర్ణీత వ్యవధుల్లో నిలబడుతూ, కూర్చుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, విరామం తీసుకుంటూ ఉండాలి. తద్వారా శరీరంపై పని భారం పడకుండా జాగ్రత్తపడచ్చు.

* కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.

* ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కాస్త ఎక్కువ సమయం నిల్చోవాల్సి వచ్చినా.. రెండు కాళ్లను మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంచడం, అలాగే ఒక కాలిని ముందు మెట్టుపై లేదంటే ఒక చిన్న స్టూల్‌పై ఉంచేలా చూసుకోండి. తద్వారా మీ శరీర బరువు లోయర్‌ బ్యాక్‌పై పడకుండా ఉంటుంది.

* ఇక కూర్చున్నప్పుడు కూడా పాదాల్ని నేలకు ఆనించడం కాకుండా.. ఫుట్‌రెస్ట్‌ (చిన్న స్టూల్ లాంటిది)పై ఉంచే ఏర్పాటు చేసుకోండి. తద్వారా పాదాల్లో వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.

* పనిలో పడిపోయి భోజనం చేయడం మర్చిపోకూడదు. డాక్టర్‌ సూచన మేరకు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో తినడానికి పండ్ల ముక్కలు, నట్స్‌, సలాడ్స్‌.. వంటివి మంచి ప్రత్యా్మ్నాయాలు!

* మీ బరువును బట్టి తగినన్ని నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడచ్చు.

* ఆహారపు కోరికల పేరుతో బయటి ఆహారం తినడం అస్సలు మంచిది కాదు.. పైగా కరోనా పొంచి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంటి ఆహారమే శ్రేయోదాయకం అంటున్నారు నిపుణులు.

* అలాగే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో గర్భిణులు బయటికి వెళ్లి పని చేస్తున్నప్పుడు మాస్క్‌ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం.. వంటివి తప్పనిసరి!

* ఇంటి నుంచి పనిచేసినా, ఆఫీసుకు వెళ్లినా మీపై అధిక పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి. తిరిగి త్వరగా ఇంటికి చేరుకోవచ్చు.

* మీ ఆఫీస్‌ లేదా పని ప్రదేశం మీ ఇంటి నుంచి దూరంగా ఉన్నట్లయితే మీరు అంత దూరం వెళ్లగలరో లేదో ముందే ఆలోచించుకోండి. ఈ క్రమంలో మీ గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ అంత దూరం వెళ్లే వీల్లేకపోతే ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు. లేదు తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే మాత్రం ఆఫీస్‌ నుంచి క్యాబ్‌ ఏర్పాటు చేసే వీలుందో ఓసారి హెచ్‌ఆర్‌ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ వైద్యులు ఓకే అంటేనే!

* గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో మీ సొంత నిర్ణయం కాకుండా నిపుణుల సలహా మేరకే వాటిని చేయడం మంచిది. అలాగే మీ ఆరోగ్యం సహకరించకపోయినా వ్యాయామం చేసే విషయంలో మీ శరీరాన్ని అస్సలు బలవంత పెట్టద్దు. ఎందుకంటే ఇలా బలవంతంగా మీరు చేసే వ్యాయామాలు మీపై, మీ బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపచ్చు.

* నెలలు నిండుతున్న కొద్దీ పెరుగుతున్న పొట్ట వల్ల అసౌకర్యం కలగచ్చు. ఈ క్రమంలో పొట్ట సపోర్ట్ కోసం బెల్లీ బ్యాండ్‌ వాడచ్చు. అయితే అది కూడా మీ గైనకాలజిస్ట్‌ సలహా తీసుకున్నాకే అని గుర్తుపెట్టుకోండి.

* గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు.. బయటికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్ని ధరించడానికే మొగ్గు చూపాలి. ఈ క్రమంలో వదులుగా ఉండే, కాటన్‌ తరహా దుస్తులు వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.. అలాగే హీల్స్‌కు బదులుగా ఫ్లాట్ గా ఉండే చెప్పులు ఎంచుకుంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు.

* ఖాళీ సమయాల్లో మీకు నచ్చిన పనులు చేయడం, మ్యూజిక్‌ వినడం.. వంటివి చేస్తే మనసుకు, శరీరానికి రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. అలాగే సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమే!

* ఇక పని బిజీలో పడిపోయి నిర్ణీత వ్యవధిలో చెకప్స్‌, స్కాన్స్‌ చేయించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.

సుఖ ప్రసవం జరగచ్చు!

ఆరోగ్యం సహకరిస్తే గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు తమ తమ విధుల్లో కొనసాగడం వల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* తొమ్మిది నెలల పాటు చురుగ్గా పనిచేయడం వల్ల సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట!

* ఇలా మనం ఎప్పుడూ పనిలో బిజీగా ఉండడం వల్ల లేనిపోని ఆలోచనలు మనసులోకి రాకుండా మానసికంగా దృఢంగా ఉండచ్చు.

* కొంతమంది కాబోయే తల్లులు పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అలా వారు ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ కూడా హ్యాపీగా, యాక్టివ్‌గా పుడతాడని చెబుతున్నారు నిపుణులు.

ఇలా ఈ చిట్కాలన్నీ పాటిస్తూ గర్భిణిగా ఉన్న సమయంలోనూ హ్యాపీగా తమ తమ పనుల్ని, వృత్తి ఉద్యోగాల్ని కొనసాగించచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఒకవేళ ఈ క్రమంలో మరీ అలసటగా అనిపించినా, శరీరం సహకరించకపోయినా బలవంతంగా ముందుకెళ్లడం మాత్రం అస్సలు చేయద్దంటున్నారు. తద్వారా తల్లీబిడ్డలిద్దరి మీదా దాని ప్రభావం పడుతుందట! కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని, నిపుణుల సలహా మేరకు మసలుకుంటే అటు ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేయచ్చు.. ఇటు మీ పనుల్నీ పూర్తిచేసుకోవచ్చు.. తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలవచ్చు.

మరి, మీరూ ప్రెగ్నెన్సీ సమయంలో ప్రసవ తేదీ దగ్గర పడే దాకా పనిచేశారా? అయితే ఆ సమయంలో మీకెదురైన అనుభవాలు, మీరు తీసుకున్న జాగ్రత్తల్ని అందరితో పంచుకోండి.. అవి మరెంతోమందికి ఉపయోగపడచ్చు..!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని