కరోనా చికిత్సపై ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన

తాజా వార్తలు

Published : 18/11/2020 22:25 IST

కరోనా చికిత్సపై ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసులు 90 లక్షలకు సమీపంలో ఉండగా.. ఈ మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య లక్షా 30 వేల మార్కును అధిగమించింది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా రక్షించే టీకా వైపే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. అయితే, మరణాల రేటును కొంతమేర అదుపులోకి తెచ్చేందుకు బాధితులకు ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్లాస్మా చికిత్స గురించి ఓ ప్రకటన చేసింది.

కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత లేదా మరణాలపై ప్లాస్మా విధానం ప్రభావం చూపడం లేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ చికిత్సను తీసుకున్న, తీసుకోని వారిలో ఏ తేడా కనిపించలేదని తెలిపింది. అంతే కాకుండా కొవిడ్ బాధితులకు విచక్షణా రహితంగా  ప్లాస్మా చికిత్సను అందించటం మంచిదికాదని సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్లాస్మా చికిత్సపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొవిడ్‌ సోకిన 464 మంది పాల్గొన్నారు. వారిలో 235 మందికి ప్లాస్మా చికిత్సను, 229 మందికి సాధారణ చికిత్స అందించారు. అయినా బాధితులకు ప్లాస్మా విధానం వల్ల ఏ ప్రయోజనమూ కలగలేదని ఈ సందర్భంగా స్పష్టమయింది. ఈ సర్వే ఫలితాలను బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.
ప్లాస్మా చికిత్సపై దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్యులు కూడా గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక చైనా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో జరిపిన సర్వేల్లో కూడా ప్లాస్మా థెరపీ వల్ల గణనీయమైన ప్రభావం లేదనే ఫలితాలు వెల్లడైనట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. బాధితులకు ఈ చికిత్సను అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి ఐసీఎంఆర్‌ సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని