ఆపత్కాలం.. విరిసిన మానవత్వం..! 

తాజా వార్తలు

Published : 03/04/2020 19:46 IST

ఆపత్కాలం.. విరిసిన మానవత్వం..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలి బాధలు తీర్చేందుకు సాయం చేసే చేతులు వేలాదిగా ముందుకు వస్తున్నాయి. దాతలు ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్తూ తోచిన మేర సాయమందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలే కాకుండా పలువురు సాధారణ వ్యక్తులు సైతం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ దాతృత్వం చాటుతున్నారు. 

* కృష్ణాజిల్లా మైలవరంలోని సూరిబాబుపేట ప్రభుత్వ పాఠశాలలో ద్వారకా తిరుమల దేవస్థానం అన్నదానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రారంభించగా.. లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. 

* ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూస్తూ.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి గుడివాడలో పలు స్వచ్ఛంద సంస్థలు మాస్కులు, మజ్జిగ, భోజనం  ప్యాకెట్లు, శానిటైజర్లు పంపిణీ చేశాయి. 

* విజయవాడ నగరంలో నిరాశ్రయులైన వారందరినీ మున్సిపల్‌ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 500 మందికి మూడు పాఠశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించగా.. స్వచ్ఛంద సంస్థలు వారికి భోజనాలు ఏర్పాటు చేశాయి. 

* ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి గుంటూరు మిర్చి యార్డులో పనిచేసే కూలీల ఆకలి బాధకు స్థానిక నాయకులు పరిష్కారం చూపారు. 15రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, పండ్లు అందించి దాతృత్వం చాటుకున్నారు. దాదాపు 1000 కుటుంబాలకు సరకులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. 

* తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో మల్లిసాల నుంచి గోకవరం వెళ్లే మార్గంలో సందర్శకులు రాక.. తిండి లేక.. అలమటిస్తున్న కోతులకు దాతలు బియ్యం, అరటి పండ్లు, శనగపప్పు వేసి ఆకలి తీర్చారు.

ఇలా రాష్ట్ర్ర వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని