Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 13/06/2021 16:57 IST

Top Ten News @ 5 PM

1. విశాఖ‌లో పల్లా సోదరుడి నిర్మాణాలు కూల్చివేత

విశాఖ‌లో కూల్చివేత‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. విశాఖ జిల్లా గాజువాక ఆటోన‌గ‌ర్ స‌మీపంలో మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు సోద‌రుడు ప‌ల్లా శంక‌ర‌రావు ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టారంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు చెందిన ఆస్తులే ల‌క్ష్యంగా కూల్చివేతలు సాగుతున్నాయని ప‌లువురు నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆక్ర‌మ‌ణ‌లోని భూములు ప‌లువురి ఆధీనంలో ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. తుంగ్లాంలో 12.5 ఎక‌రాలు, జ‌గ్గ‌రాజుపేట‌లో 5 ఎక‌రాలు స్వాధీనం చేసుకున్నారు.

2. ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి 

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో రామాపురం క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద  భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఈ-పాస్‌ లేని వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ ఎత్తేశారని ప్రయాణికులు రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి పెరిగింది. ఆంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా  ఈపాస్‌ ఉంటేనే కోదాడ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈపాస్‌ లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

3. వైకాపాకు కూల్చడం తప్ప కట్టడం తెలీదు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపించాలని.. లేకుంటే మంత్రి అవంతి శ్రీనివాస్‌ క్షమాపణ చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్‌ చేశారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూల్చడం తప్ప కట్టడం ఈ ప్రభుత్వానికి తెలియదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూముల తాకట్టుపై ప్రజలు మేల్కోవాలని, లేకుంటే ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. పల్లా శ్రీనివాసరావు భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో నిర్మాణాలను కూలగొడుతున్నారని.. ప్రభుత్వ సర్వేయర్లతో స్థలంలోకి వెళ్లి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

4. Rythu Bandhu: 15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము

తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63,25,695 మంది అర్హులను గుర్తించిన సీసీఎల్‌ఏ తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈసారి కొత్తగా 66,311 ఎకరాలు ఈ పథకంలో చేరాయని.. అందుకు అనుగుణంగా 2.81 లక్షల మందికి రైతుబంధు నిధులు అందనున్నట్లు మంత్రి చెప్పారు.

5. ఆ వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తాం: వెల్లంపల్లి

క‌డ‌ప జిల్లాలోని బ్ర‌హ్మంగారి మ‌ఠం ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని.. మ‌ఠాధిప‌తి విష‌యంలో ఎవ‌రూ వివాదాల‌కు పోవ‌ద్ద‌ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. మ‌ఠాధిప‌తిపై గ‌త కొన్నిరోజులుగా వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. మ‌ఠాధిప‌తికి సంబంధించి ఎలాంటి వీలునామా అంద‌నందున ధార్మిక పరిష‌త్ త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు. మ‌ఠం నిర్వ‌హ‌ణ‌కు అధికారిని నియ‌మించిన‌ట్లు వెల్లడించారు. అక్క‌డి ఆచారాలు, సంప్ర‌దాయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌రిత‌గ‌తిన సేక‌రిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

6. మా పార్టీని భాజపా బానిసలా చూసింది: రౌత్‌

గత సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనను భారతీయ జనతా పార్టీ బానిసలా చూసిందని, ఒకానొక దశలో పార్టీని పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేసిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. 2014-19 మధ్య భాజపా నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ప్రభుత్వంలో శివసేన రెండో స్థానంలో ఉంది. ఆ సమయంలో భాజపా శివసేనను ఓ బానిసలా చూసింది. శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ పార్టీని అంతం చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసింది’’ అని రౌత్‌ అన్నారు. 

7. Maharashtra: కాంట్రాక్టర్‌పై చెత్త వేయించిన శివసేన ఎమ్మెల్యే

మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్‌లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ఓ పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఆయన బహిరంగంగా శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన చాంద్‌వాలి ఎమ్మెల్యే దిలీప్‌ లాండే.. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో కాంట్రాక్టర్‌ను కూర్చోబెట్టి పారిశుద్ధ్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. ఈ నిర్వాకాన్ని సమర్థించుకున్న శివసేన ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్‌ పని సరిగా చేయలేదని మండిపడ్డారు. 

8. Lockdown: బ్రిటన్‌కు ‘డెల్టా’ వేరియంట్‌ కష్టాలు!

భారత్‌లో తొలుత వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్‌పై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త వేరియంట్‌ మూలంగా.. మహమ్మారి కట్టడికి ఆ దేశంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేతను వాయిదా వేయాల్సి రావొచ్చని సంకేతాలు ఇచ్చారు. భారీ ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో త్వరలోనే బ్రిటన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని అంతా భావించారు. ఆ దిశగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలించాలని యోచిస్తోంది. కానీ, వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌.. బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసింది.

9. Defence:‘రక్షణ’ ఆవిష్కరణలకు రూ.499 కోట్లు

వచ్చే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఆయుధాలు, సైనిక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని రక్షణ శాఖ తెలిపింది.

10. China: చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరు..!

కరోనా వైరస్‌కు కారణమైన చైనా.. వివిధ అంశాల్లో ప్రపంచదేశాలకు పెనుముప్పుగా తయారవుతోందనే అభిప్రాయం బలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి ‘జి-7’ని ఉద్దేశించి చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని హెచ్చరించింది. చైనా ఆధిపత్యాన్ని ఎలాగైనా కట్డడి చేయాలని భావిస్తోన్న జి-7 దేశాలు ఆ అంశంపై చర్చిస్తున్న తరుణంలో ఈ విధంగా స్పందించింది. ‘ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలను కేవలం కొన్ని దేశాలతో కూడిన చిన్న కూటములు నిర్దేశించే రోజులు ఎప్పుడో ముగిసిపోయాయి’ అని లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

పేలిన గ్యాస్‌ పైపులైన్‌: 12 మంది మృతి
వ్యక్తిగత సమాచార సేకరణలో చైనా యాప్‌లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని