ఆ గ్రామాల్లో ఒక ఓటర్‌.. రెండు ఓట్లు! 

తాజా వార్తలు

Published : 06/02/2021 01:44 IST

ఆ గ్రామాల్లో ఒక ఓటర్‌.. రెండు ఓట్లు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక నేత రెండు చోట్ల పోటీ చేస్తారు.. మరి ఒక ఓటరు రెండు ఓట్లు వేయలేరా? ఒకరిద్దరు కాదు ఏకంగా 21 గ్రామాలు కొన్నేళ్లుగా రెండు ఓట్లు వేస్తున్నాయి. ఒకే వ్యక్తి ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకొంటున్నారు. రెండు రాష్ట్రాల పథకాలు పొందుతూ ఇద్దరేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటున్నారు కొటియా ప్రాంత ప్రజలు. ఇంతకీ వారెవరు? ఆ ప్రాంతం ఎక్కడ?

ఒక పౌరుడికి ఒకే ఓటు కార్డు ఉండాలనేది ఎన్నికల సంఘం ప్రాథమిక నిబంధన. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని కొన్ని గ్రామాలకు ఈ షరతు వర్తించదు. విజయనగరం - కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే కొటియా పంచాయతీలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు. విజయనగరం నుంచి 60 కి.మీల మేర కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తే కొటియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ ప్రాంతాల్లోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే, పార్లమెంట్‌లో తేల్చుకోవాలని 2006లో కోర్టు సూచించింది. నేటికీ ఆ పంచాయితీ తేలలేదు.

అక్కడంతా గిరిపుత్రులే..

కొటియా ప్రాంతాల్లో ఉండేదంతా గిరిజనులే. కొండల అవతలి వైపు కొటియా పంచాయతీ కేంద్రం ఉంది. దానికి దగ్గరగా ఉన్న గ్రామాల వారు ఒడిశావైపు మొగ్గుతున్నారు. ఈ గ్రామాలపై ఏపీ అధికారులు శ్రద్ధ కనబరచడంలేదని కొటియా, పురుటిభద్ర, మడకార్‌, డోలియాంబ తదితర గ్రామస్థులు బహిరంగంగానే చెబుతున్నారు. కొండకు ఇటువైపు ఉన్న నేరేళ్ల వలస, ఎగువ శెంబి, దిగువ శెంబి, ధూళిభద్ర, మూలతాడివలస, పగులుచెన్నేరు, పట్టుచెన్నేరు, సొలిపిగూడ, శిఖపరుగు గ్రామాలు ఏపీకి అందుబాటులో ఉన్నాయి.

ఆధార్‌, రేషన్‌.. ఓటర్ కార్డు.. అన్నీ రెండేసి..

ఈ కొటియా గ్రామాల్లో రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. ఆయా గ్రామాల్లో బడులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు కూడా రెండేసి ఉన్నాయి. అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వం వైపు, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వంపైపు చూస్తున్నారు అక్కడి ప్రజలు. అందుకే ఇరు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కచ్చితంగా ఓటేస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక సమరంలో ఓటేసిన ఈ గిరిజనం ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. 

‘నా దగ్గర రెండు పింఛను కార్డులున్నాయి. ఒకటి ఒడిశాది.. ఇంకొకటి ఆంధ్రాది. రెండు రేషన్ కార్డులు.. రెండు ఆధార్;‌ రెండు ఓటర్‌ కార్డులు ఉన్నాయి. ఓట్లు ఒడిశాకు ఒకటి వేస్తాం. ఆంధ్రాకు మరొకటి వేస్తాం’ అని ఓ మహిళ తెలిపారు. అలాగే, ఒడిశా నుంచి తమకు రేకు ఇళ్లు వచ్చాయి. తారు రోడ్డు, సీసీ రోడ్డు వచ్చింది. వీధిలైట్లు ఇచ్చారు. ఏపీ నుంచి కరెంటు వచ్చింది. వాటర్‌ ట్యాంకు వచ్చింది. ఏపీ నుంచి మాకు ఇళ్లు కావాలి’’ అని ఓ యువకుడు వివరించాడు.  

కొటియా గ్రామాల్లో మాంగనీస్‌, ఇనుము, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటిని దక్కించుకొనేందుకు ఒడిశా అధికారులు తరచూ ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని