Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 05/08/2021 17:12 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. AP NEWS: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన న్యాయస్థానం ఈమేరకు తీర్పును రిజర్వ్‌ చేసింది.

2. KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం... గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది.

3. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్‌ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోవిడ్ కారణంగా గతేడాది నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

4. Bharat Biotech: భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం

 కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం దక్కింది. కొవాగ్జిన్‌ తయారీకి మెరుగైన తయారీ పద్ధతులు (జీఎంపీ) కంపెనీ అనుసరిస్తోందని పేర్కొంటూ ఐరోపా దేశం హంగరీ ధ్రువపత్రాన్ని జారీ చేసింది. గురువారం ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ ట్విటర్ వేదికగా వెల్లడించింది. 

5. భాజపాకు భారీగా విరాళాలు

భాజపాకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో విరాళాలు అందాయి. ఈ విషయంలో మరే ఇతర జాతీయ పార్టీ దాని దరిదాపులో కనిపించడం లేదు. కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం.. ఈ ఐదు పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోల్చితే 3 రెట్లు అధికంగా కాషాయ పార్టీకి అందడం గమనార్హం. జాతీయ పార్టీలకు రూ.20 వేలకన్నా ఎక్కువగా వచ్చిన విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

6. ఆగస్టు 5.. చరిత్రలో నిలిచిపోయే రోజు: మోదీ

ఆగస్టు 5ను దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే రోజున.. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న అధికరణం 370 రద్దు, గతేడాది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ఆయన ముచ్చటించారు. 

7. హాకీ జట్టుకు పార్లమెంట్‌ అభినందనలు

ఏళ్ల విరామానికి తెరదించుతూ హాకీ పురుషుల జుట్టు కాంస్య పతకాన్ని సాధించడంపై పార్లమెంట్‌లో అభినందనలు దక్కాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలు తదితర అంశాలపై పార్లమెంట్‌లో అదే గందరగోళం కొనసాగుతోంది.

8. bell bottom: ఇందిరాగాంధీలా మిస్‌ యూనివర్స్‌ లారాదత్తా!

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘బెల్‌బాటమ్‌’ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్‌ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు. 

9. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే సూచీలు

దేశీయ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస భారీ లాభాల అనంతరం గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు లోనైనా.. లాభాల పరంపరను కొనసాగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు డీలా పడినప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ వంటి షేర్లు సూచీలను నడిపించాయి. 

10. Tokyo Olympics: రజతంతో మెరిసిన రవి దహియా

ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో రవి కుమార్‌ దాహియా ఓటమిపాలయ్యాడు. అయినా అతడు రజతంతో మెరిశాడు. ఫైనల్స్‌లో రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ రవిని ఓడించి స్వర్ణం సాధించాడు. కాగా, 2012 తర్వాత రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం సాధించిన రెజ్లర్‌గా రవి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని