Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 21/09/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. పారిశ్రామికంగా ఏపీ గణనీయ వృద్ధి సాధించింది: జగన్‌

గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా పారిశ్రామికంగా ఏపీ గణనీయ వృద్ధి సాధించిందని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌-2021ని జగన్‌ ప్రారంభించారు. 2021 ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైందని చెప్పారు. ‘68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను’ అని జగన్‌ పేర్కొన్నారు.

2. 2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమే: జావడేకర్‌

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో జావడేకర్‌ పాల్గొన్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. 2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమేనని.. హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపాదే విజయమని జావడేకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

3. కెనడా ప్రధాని.. హ్యాట్రిక్‌ విజయం..!

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్‌ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ చివరకు జస్టిన్‌ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

4. కొప్పర్రు ఘటన.. 16 మంది అనుమానితులు అరెస్టు: ఎస్పీ

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎస్పీ విశాల్‌ గున్నీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పెదనందిపాడు పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సీఐ, పొన్నూరు రూరల్, పట్టణ సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఏపీలో ఫ్యాక్షన్‌ మూకలు రెచ్చిపోతున్నాయి: లోకేశ్‌ 

5. ఏటూరునాగారంలో సీతక్కకు అస్వస్థత..

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చేపట్టిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలో నడుస్తూనే సొమ్మసిల్లి కింద పడిపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడంతో ఆమె కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

6. మహారాష్ట్రలో పెరుగుతోన్న డెల్టా వ్యాప్తి..!

దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. కరోనా వైరస్ రూపం మార్చుకుంటూ విస్తరిస్తూనే ఉంది. తగ్గినట్టే తగ్గి, కొత్త మార్పులతో కోరలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా రకం ప్రపంచదేశాలకు విస్తరించి, వణికిస్తోంది. కాగా, మహారాష్ట్రలో మాత్రం డెల్టాలోని ఏవై.4 రకం కేసులు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. 

7. యాంటీ వ్యాక్సిన్‌ నిరసనలు హింసాత్మకం.. ఆందోళనకారులపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో యాంటీ వ్యాక్సిన్‌ నిరసనలు హింసాత్మకంగా మారాయి. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం ఒక్క డోసు టీకా అయినా వేసుకొని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. 

8. యూకే క్వారంటైన్‌ పాలసీ వివాదం.. ప్రతిచర్య తప్పదని భారత్‌ హెచ్చరిక!

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకే వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం జారీ చేసిన నూతన ప్రయాణ నిబంధనలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా ‘వివక్షపూరితమైన విధానం’ అని కేంద్ర విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకున్న బ్రిటన్‌.. ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. 

9. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు కోలుకున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 58,630.06 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,084.51 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 514.34 పాయింట్ల లాభంతో 59,005.27 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో మెజారిటీ లాభపడ్డాయి.

10. మా ఆటగాళ్లముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదు: మోర్గాన్‌
ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని తొలి దశలో ఐదు ఓటములతో వెనుకంజలో పడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సోమవారం బెంగళూరుపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి కోహ్లీసేనను చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని ప్రశంసించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని