Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Published : 16/09/2021 08:59 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. పల్లె ముంగిట టీకా

జీహెచ్‌ఎంసీలో దాదాపు 100 శాతం తొలి డోసు టీకా పంపిణీ పూర్తి కావడంతో.. ఇక గ్రామీణ ప్రాంతాలు, పురపాలికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. పల్లె ప్రజల ముంగిటికి టీకాలను తీసుకెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైద్య బృందాలు రోజుకొక పల్లెలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ.. అర్హులను గుర్తించి వారికి టీకాలు ఇస్తారు. 2 వారాల్లో ఈ కార్యక్రమం పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది.

2. 24 మందితో తితిదే బోర్డు

తితిదే పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తితిదే భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది.

3. వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనకు నిరసగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సైదాబాద్‌ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని చిన్నారి ఇంటివద్దే షర్మిల దీక్షకు కూర్చున్నారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు రంగప్రవేశం చేసి వైతెపా శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. అనంతరం దీక్షాస్థలి నుంచి షర్మిలను తరలించారు. 

4. ఇదేం పద్ధతి! ఇవేం నియామకాలు?

దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. విచారణ సమయంలో ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను 2 వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

5. అత్యంత ప్రభావవంతులు మోదీ, మమత, అధర్‌ పూనావాలా

ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధర్‌ పూనావాలాలకు చోటు దక్కింది! 2021కు సంబంధించి ప్రఖ్యాత ‘టైమ్‌ మ్యాగజీన్‌’ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ, ప్లానింగ్‌ కౌన్సిల్‌ కార్యనిర్వాహక డైరెక్టర్‌ పి.కులకర్ణిని కూడా ఈ జాబితాలో ప్రముఖంగా పేర్కొంది.

6. వాళ్లు నకిలీ హిందువులు

‘భాజపా, ఆరెస్సెస్‌ నేతలు నకిలీ హిందువులు, మతాన్ని స్వప్రయోజనాలకు వాడుకునే దళారులు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కాషాయదళంపై విరుచుకుపడగా.. ‘రాహుల్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ భాజపా ఎదురుదాడికి దిగింది. రాహుల్‌ మాట్లాడుతూ.. ‘సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌ పార్టీ వారికి పూర్తి విరుద్ధం. ఈ దేశాన్ని ఏదో ఒక సిద్ధాంతమే పరిపాలించగలదు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌, మహాత్మాగాంధీల నడుమ ఉన్న తేడాలను గుర్తించాలి. అదేవిధంగా వీడీ సావర్కర్‌, నాథూరామ్‌ గాడ్సేల నడుమ కూడా’ అన్నారు.

7. ఒకసారి కరోనా వస్తే.. 6 నెలల వరకు రక్షణ! 

తొలిసారి కొవిడ్‌ సోకినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే.. యాంటీబాడీలు అధిక కాలం పాటు రక్షణ కల్పిస్తాయని చాలా అధ్యయనాలు తేల్చాయి. అయితే మొదటిసారి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా.. వ్యక్తులు రెండోసారి కరోనా బారిన పడకుండా దాదాపు ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా నిర్ధారించారు.

8. టెలికాంలో 100% ఎఫ్‌డీఐ

ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగానికి కేంద్ర మంత్రివర్గం 9 సంస్కరణలతో భారీ ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. ఈ రంగంలోకి నేరుగా (ఆటోమేటిక్‌ మార్గంలో) 100 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటిదాకా 49 శాతం వరకే ఈ అనుమతి ఉంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం విధించింది. టెలికాం యేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించింది.

9. లాక్‌డౌన్‌లో చైనా

చైనాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు బుధవారం ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని పుతియాన్‌ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. 

10. కేరింతలు మళ్లీ మొదలు

యూఏఈలో తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్‌ 14 రెండో దశ మ్యాచ్‌ల్లో మళ్లీ ఆ కేరింతలు, సందడిని చూడబోతున్నాం. ఆదివారం ఆరంభమయ్యే లీగ్‌ మ్యాచ్‌లను చూసేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటించారు. దుబాయ్‌లో ముంబయి, చెన్నై మధ్య మ్యాచ్‌తో ప్రేక్షకులు తిరిగి ఐపీఎల్‌ మజాను ఆస్వాదించేందుకు వచ్చేస్తున్నారు.

సాగేదెవరో? ఆగేదెవరో?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని