Amara Raja: కరెంట్‌ కట్‌
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amara Raja: కరెంట్‌ కట్‌

నిలిపివేసిన ఏపీఎస్‌పీడీసీఎల్‌ ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి
సంస్థకు క్లోజర్‌ నోటీసు ఇచ్చిన పీసీబీ
చట్టపరంగా ముందుకెళ్తాం: యాజమాన్యం

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, తిరుపతి: తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దాంతో శనివారం నుంచి పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్‌ నోటీసును జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చింది. ఈ సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నోటీసు, విద్యుత్తు సరఫరా నిలిపివేతపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పీసీబీ ఇచ్చిన క్లోజర్‌ నోటీసులో...  ఈ సంస్థకు సంబంధించి చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న యూనిట్లు పర్యావరణ అనుమతులు (ఈసీ), ఆపరేషన్‌ నిర్వహణ సమ్మతి (సీఎఫ్‌వో)లో విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. పనిచేసే ఉద్యోగుల రక్త నమూనాలు పరీక్షించగా.. వాటిల్లోనూ నిర్దేశిత పరిమితికి మించి సీసం ఉన్నట్లు తేలిందని తెలిపింది. ఆయా ప్లాంట్లు ఉన్న గ్రామాల ప్రజల రక్త నమూనాలను నేషనల్‌ రిఫరల్‌ సెంటర్‌ ఫర్‌ లెడ్‌ ప్రాజెక్ట్స్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌ఆర్‌సీఎల్‌పీఐ)లో విశ్లేషించగా... ప్రమాణాలకు మించి చాలా అధికంగా వారి రక్తంలో సీసం పరిమాణం ఉందని ప్రస్తావించింది. మనిషి శరీరంలో సీసం పరిమాణం అధికంగా ఉంటే.. వివిధ అవయవాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ‘మీ సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసింది. అందుకే మూసివేత ఆదేశాలిస్తున్నాం. ఇవి అందాక కూడా ఆయా ప్లాంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తే.. నీటి కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 41, వాయు కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 37(1) ప్రకారం కనీసం ఏడాదిన్నర నుంచి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది...’ అని పేర్కొంది.

35 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాం
నోటీసులపై చట్టపరంగా ముందుకెళ్తామని అమరరాజా యాజమాన్యం స్పష్టం చేసింది. ‘ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్‌ సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామని...’ వెల్లడించింది. భాగస్వాముల ప్రయోజనాల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ, విదేశాల్లో అతి కీలక రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు సంస్థ ఉత్పత్తులను అందజేస్తూ గత 35 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించినట్లు వివరించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని