close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఉత్తర్‌ప్రదేశ్‌లో పసిడి గని

ఉత్తర్‌ప్రదేశ్‌లో పసిడి పండింది! జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సాగిస్తున్న సుదీర్ఘ అన్వేషణ ఫలించింది. సోన్‌భద్ర జిల్లా సోన్‌పహడిలో 30,00,000 కిలోల (3000 మెట్రిక్‌ టన్నుల) బంగారు నిక్షేపాలను... హర్ది ప్రాంతంలో మరో 6,50,000 కిలోల (650 మెట్రిక్‌ టన్నుల) పసిడి క్షేత్రాలను ఆ సంస్థ కనుగొంది. బంగారంతో పాటు ఉక్కు, పొటాషియం తదితర విలువైన నిక్షేపాలు కూడా ఆ జిల్లాలో దండిగా ఉన్నట్టు జీఎస్‌ఐ ఉన్నతాధికారి కేకే రాయ్‌ వెల్లడించారు. ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేసేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు రోషన్‌ జాకబ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహిళా గస్తీ బృందాలకు మంగళం

హైదరాబాద్‌ నగరంలో పోకిరీలు.. ఈవ్‌టీజర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు.. సాయంత్రం వేళల్లో రద్దీ ప్రాంతాలు.. ఉద్యానాలు.. మల్టీప్లెక్స్‌లు.. పర్యాటక ప్రాంతాల్లో విద్యార్థినులు.. మహిళలకు రక్షణగా ఉండేందుకు హైదరాబాద్‌ పోలీసులు ప్రారంభించిన ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ కథ ముగిసింది. మొత్తం 20 మహిళా కానిస్టేబుళ్ల బృందాలకు అధికారులు మంగళం పాడారు. 14 నెలల క్రితం ప్రారంభమైన ఈ వినూత్న సేవలు అంతర్గత సమస్యలు, మహిళా కానిస్టేబుళ్ల వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ఆగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అమలు చేసిన కీలక విధానాలపై దర్యాప్తు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. గత ప్రభుత్వ ముఖ్యమైన విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు వంటివి), ముఖ్యమైన పాలనా అనుమతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కామెర్ల చికిత్సకు ‘ఎన్‌లైట్‌’

కామెర్లు సోకిన నవజాత శిశువులకు అంతరాయం లేని, మెరుగైన చికిత్స అందించేందుకు సరికొత్త పరికరం ఆవిష్కృతమైంది. ఐఐటీ హైదరాబాద్‌లో పురుడుపోసుకున్న అంకుర సంస్థ ‘హీమాక్‌’ ప్రతినిధులు అకిత కొల్లోజు, ప్రసాద్‌ ముద్దం ‘ఎన్‌లైట్‌-360’ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బయో ఆసియా’ సదస్సులో 75 ఆవిష్కరణలతో పోటీపడి ఇది టాప్‌-5లో నిలవడం విశేషం. ఏడాదిలోగా ఈ పరికరాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అకిత కొల్లోజు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇచ్చిన భూములపైనే ఇప్పుడు కన్ను

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో వివిధ ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్నవి ఏమున్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. వాటిని తిరిగి తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుపతిలో సర్వే అకాడమీ, రెవెన్యూ కాంప్లెక్స్‌ నిర్మాణాల కోసం కేటాయించిన 41.19 ఎకరాలను ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. రాజమ హేంద్రవరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన భూమిని అధికారుల బృందం పరిశీలించింది. ప్రకాశం జిల్లా చదలవాడలోని పశుక్షేత్రానికి చెందిన స్థలంలో కొంత భాగాన్ని ఇళ్ల స్థలాల కోసం వినియోగించేందుకు యత్నించగా అక్కడి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘గ్రే లిస్ట్‌’లోనే పాక్‌

ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న పాకిస్థాన్‌కు ఓ అంతర్జాతీయ సంస్థ చెంప చెళ్లుమనిపించింది. ఆ దేశాన్ని ‘గ్రే లిస్ట్‌’లో కొనసాగించాలని ‘ఆర్థిక చర్యల కార్యదళం’  (ఎఫ్‌ఏటీఎఫ్‌) నిర్ణయించింది. ఈ ఏడాది జూన్‌ కల్లా ముష్కర ముఠాలకు నిధులు అందించడంలో ప్రమేయమున్న వారిని ప్రాసిక్యూట్‌ చేసి, శిక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉగ్ర నిధులపై కన్నేసి ఉంచడం ‘ఎఫ్‌ఏటీఎఫ్‌’ విధి. పారిస్‌లో శుక్రవారం ముగిసిన ఈ సంస్థ ప్లీనరీ సమావేశాల్లో తాజా నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పేస్టు రూపంలో బంగారం

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. తాజాగా దోహ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 367 గ్రాముల బంగారం పేస్టు పట్టుబడింది. విమానాశ్రయ భద్రాతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..దోహ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయం నుంచి బయటకి వచ్చే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అక్రమంగా పేస్టు రూపంలో తరలిస్తున్న బంగారం గుట్టురట్టయింది. రూ.15.56 లక్షల విలువైన బంగారం పేస్టును భద్రాతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్యాంకులు వరుసగా 6 రోజులు పనిచేయవా?

మార్చి రెండో వారంలో బ్యాంకుల కార్యకలాపాలు వరుసగా 6 రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదముంది. వేతన పెంపు కోసం మార్చి 11-13 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చాయి. సమ్మె జరిగితే 11-13 తేదీల్లో (బుధ-శుక్రవారాల్లో) బ్యాంకులు పనిచేయవు. 8న ఆదివారం. 9న సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. 10న హోలీ సెలవు. 14న రెండో శనివారం సందర్భంగా సెలవు, 15న ఆదివారం. అంటే మార్చి రెండో వారంలో ఒక్క సోమవారం మినహా మిగిలిన రోజుల్లో బ్యాంకులు పనిచేసే పరిస్థితి ఉండదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అదిరిందమ్మాయ్‌!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు గొప్ప ఆరంభం లభించింది. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. శుక్రవారం టోర్నీ తొలి మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు.. పూనమ్‌ యాదవ్‌ (4/19) మాయాజాలానికి కుదేలైంది. శిఖా పాండే (3/14) కూడా సత్తా చాటడంతో ఆ జట్టు 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కిలికి భాష నేర్చుకుంటారా!

బాహుబలి’తో కిలికి భాష విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలకేయ, అతని సైన్యం మాట్లాడే ఆ భాషని ప్రముఖ గేయ రచయిత మదన్‌ కార్కీ ఈ చిత్రం కోసమే సృష్టించారు. ఇప్పుడు ఆ భాషకి ప్రత్యేకంగా వర్ణమాలని, సంఖ్యల్ని కూడా రూపొందించారు. ఈ భాషలోని సంఖ్యల్ని 2 నిమిషాల్లోపు నేర్చుకోవచ్చని, 22 చిహ్నాలతో కూడిన వర్ణమాలని 60 నిమిషాల్లోనే నేర్చుకోవచ్చని మదన్‌ కార్కీ తెలిపారు. రోజువారీగా వినియోగించే 3 వేల పదాల్ని కూడా ఈ భాషలో సృష్టించినట్టు తెలిపారు. కార్కీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, లిఫో బృందాలు కలిసి ప్రత్యేకంగా ‌www.kiliki.in  పేరుతో ఓ వెబ్‌సైట్‌ని రూపొందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.