close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. బుస కొడుతున్న మహమ్మారి!

భారత్‌లో నెమ్మదిగా ప్రారంభమైన కరోనా, ఇప్పుడు జోరు పెంచింది. మరింత ఎక్కువమందికి సోకుతోంది. మొత్తం రోగుల్లో 30 శాతం మంది తబ్లీగీ జమాత్‌తో సంబంధం ఉన్నవారేనని లెక్కలు తేలాయి! దీంతో తబ్లీగీతో సంబంధమున్న వారిని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే వీరిలో 22 వేల మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. వీరిలో, బయట ఉన్నవారిలో ఎంతమంది పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నారన్నది ఆందోళనకరంగా మారింది. మరోవైపు దేశంలో వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేటి రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి

‘ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు. ‘ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. అపార్టుమెంట్లు, కాలనీలకు కరెంటు సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్‌ఫార్మర్లు, మెయిన్‌ వద్ద సరఫరా కొనసాగించాలి. వీధి దీపాలు కూడా వెలగనివ్వాలి’ అని సూచించారు. దేశంలో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్తు గ్రిడ్‌పై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కళ్ల కలకా? కరోనా కావచ్చు!

జలుబు, జ్వరం, పొడి దగ్గు, ఆయాసం... ఈ లక్షణాలే కాదు.. ప్రస్తుత పరిస్థితిలో కళ్ల కలకలు కన్పించినా కరోనాగా అనుమానించాల్సిందే. వీటితోపాటు జ్వరం కూడా ఉంటే... ఇంకా ప్రమాదం. ఇలాంటి వారిలో 90 శాతం కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని సరోజనీ దేవి నేత్ర వైద్యశాల వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి రోగుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా కళ్ల కలకలు వైరస్‌ వల్లే వస్తాయి. మన దగ్గర చాలా మంది వీటి బారిన పడుతుంటారు. కొద్ది రోజులపాటు ఉండి తగ్గిపోతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీకా ప్రయోగాలకు.. ‘ఫెర్రెట్‌’

కరోనా మహమ్మారికి టీకా(వ్యాక్సిన్‌) అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇందుకు జరిపే ప్రయోగ పరీక్షలకు అనువైన జంతువుగా ఫెర్రెట్‌(ముంగిస వంటి క్షీరదం)ను గుర్తించారు. దీని శ్వాసకోశ వ్యవస్థ తీరుతెన్నులు అచ్చంగా మానవుల ఊపిరితిత్తులను పోలి ఉంటాయని తేల్చారు. కరోనా వైరస్‌ ఈ జీవికీ సోకుతుందని నిర్ధరించారు. కామన్వెల్త్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(సీఎస్‌ఐఆర్‌వో)లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న ఈ శాస్త్రవేత్తల బృందానికి భారత సంతతికి చెందిన వైరాలజీ నిపుణుడు, ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ నేతృత్వం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పండ్లు విరివిగా తినండి

ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి పండ్లు విరివిగా తినాలని రాష్ట్ర ఉద్యానశాఖ సూచించింది. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజూ తప్పనిసరిగా 100 గ్రాముల పండ్లు తినాలని ‘భారతీయ వైద్య పరిశోధన మండలి’ (ఐసీఎంఆర్‌) సూచించినట్లు తెలిపింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పండ్లను అధికంగా తినాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం  చేయాలని జిల్లా కలెక్టర్లకు ఈ శాఖ తాజాగా సూచించింది. అధిక పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ యాక్సిడెంట్లు తాజాపండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పేదలకు సాయంపై పార్టీ ముద్ర!

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రూ.1000 పంపిణీ పలుచోట్ల వివాదాస్పదంగా మారింది. బియ్యం కార్డుల ఆధారంగా గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సాయాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొన్నిచోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులే ముందుండి ఈ పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. అనంతపురం జిల్లాలో లబ్ధిదారులకు నగదు అందించిన  తర్వాత ‘ప్రభుత్వ సాయాన్ని మరవకండి….. మమ్మల్ని గెలిపించండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉద్యోగాల కంటే ముందు ప్రాణాలు ముఖ్యం

మానవాళి ప్రస్తుతం అత్యంత అంధకారమయ పరిస్థితిని ఎదుర్కోంటోందని, ఈ తరుణంలో జీవనోపాధి కంటే ముందు జీవితాలను కాపాడాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లు అభిప్రాయపడ్డాయి. కరోనా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగినప్పుడే ఆర్థిక కార్యకలాపాల పునరుజ్జీవం సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌-జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జీవాలు ‘ద డైలీ గ్రాఫ్‌’కు సంయుక్తంగా రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దమానీ రూ.155 కోట్ల విరాళం

కొవిడ్‌-19 మహమ్మారితో భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డి-మార్ట్‌) ప్రమోటరు రాధాకిషన్‌ దమానీ రూ.155 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో రూ.100 కోట్లు పీఎం కేర్స్‌ నిధికి ఇవ్వగా.. మిగిలిన రూ.55 కోట్లను 11 రాష్ట్రాల ప్రభుత్వాల సహాయ నిధికి అందజేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కేర్స్‌ నిధికి రూ.100 కోట్ల విరాళాన్ని అదానీ గ్రూపు అందజేయనుంది. గ్రూపు సంస్థల ఉద్యోగులు కలిపి మరో రూ.4 కోట్లను విరాళంగా ఇచ్చారని సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్రేయస్‌పై ద్రవిడ్‌ ఆగ్రహించిన వేళ..

గత ఏడాది కాలంగా నిలకడగా ఆడుతున్న యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నాడు. పరిస్థితులకు తగినట్లు ఆచితూచి ఆడడంతో పాటు అవసరమైన సమయంలో గేర్లు మార్చి విధ్వంసం సృష్టించడం అతడికి బాగానే అలవాటైంది. ఆట పట్ల తన దృక్పథం మారడానికి, పరిణతి రావడానికి కారణం రాహుల్‌ ద్రవిడ్‌ అని అతను చెబుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా కార్యాలయాన్ని వాడుకోండి

సంక్షోభ సమయంలో ఉదారత చాటుకుంటున్నారు కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌. ముంబయిలోని తన నాలుగు అంతస్తుల  కార్యాలయ భవనాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఉపయోగించుకోమని ఆ నగర పురపాలక సంస్థను షారుఖ్‌ కోరారు. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఆపత్కాలంలో ఇది మంచి నిర్ణయమంటూ షారుఖ్‌ను ప్రశంసించింది. బాలీవుడ్‌ నిర్మాత, బాలాజీ టెలీ ఫిలింస్‌ అధినేత ఏక్తా కపూర్‌ తన సంస్థలోని కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన ఒక ఏడాది వేతనం రూ.2.5 కోట్లను వదులుకొని, ఆ మొత్తాన్ని కార్మికుల కోసం వెచ్చించనున్నట్లు ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.