close

తాజా వార్తలు

Updated : 01/12/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోముల భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) ఈ ఉదయం మృతి చెందారు. తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సింహయ్యను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం భౌతికకాయాన్ని కొత్తపేటలోని కుమారుడి నివాసానికి తరలించారు. నర్సింహయ్య పార్థివదేహానికి మంత్రులు  కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తదితరులు నివాళులర్పించారు. మంత్రి  హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు భాస్కర్‌ రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు నర్సింహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

నర్సింహయ్య ఆకస్మిక మరణం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జీవితాంతం ప్రజల కోసం.. వారి హక్కుల కోసం పోరాడారని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్య అని కొనియాడారు. ఆయన మృతి నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని చెప్పారు. నోముల మృతదేహాన్ని ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు నల్గొండలోని అలియాకు తరలించి అక్కడి నుంచి రేపు ఉదయం నకిరేకల్‌కు.. ఎల్లుండి స్వగ్రామం పాలెంకు తరలించనున్నట్లు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. పాలెంలో నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారని మంత్రి వివరించారు.

కిషన్‌ రెడ్డి దిగ్భ్రాంతి
నర్సింహయ్య అకాల మరణం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన అతికొద్దిమంది ప్రజానాయకుల్లో నోముల నర్సింహయ్య ఒకరని కొనియాడారు. తెలంగాణ యాస, భాషతో శాసనసభలో ప్రజాసమస్యలపై గళం విప్పి అనేక ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన గొప్ప నాయకుడన్నారు. నిరంతరం పేదల సంక్షేమానికి, అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించే వారని తెలిపారు. నర్సింహయ్యతో కలిసి రెండుసార్లు శాసనసభలో పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 

జననేతను కోల్పోయాం: కాంగ్రెస్‌
నోముల అకాల మరణం పట్ల కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఒక జననేతను కోల్పోయామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. నర్సింహయ్య మరణం ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని వారు కొనియాడారు. 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని