ఏపీలో చేతకాని సీఐడీ: రఘురామకృష్ణరాజు
close

తాజా వార్తలు

Published : 13/10/2020 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో చేతకాని సీఐడీ: రఘురామకృష్ణరాజు

దిల్లీ: న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా దాడులు ఆగడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ధరిత్రి ఎరుగని చరిత్ర అని వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్‌ మీడియా దూషణల వ్యవహారంలో ఆరు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆక్షేపించారు. ఇంతవరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని.. చేతకాని, నిస్సహాయ సీఐడీ రాష్ట్రంలో ఉందని ధ్వజమెత్తారు. వైకాపా నేతలకు ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం సెక్షన్లపై సెక్షన్లు నమోదు చేస్తూ అరెస్టు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 

‘‘నాడు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది.. నేడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది. నేటి అభినవ కౌరవ సభలో నేనూ భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నా. వ్యవస్థలను వివస్త్రలను చేసే ప్రయత్నం ఎవరు చేసినా వారికి మనుగడ ఉండదు. ఆనాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడితే.. నేడు న్యాయ వ్యవస్థను కోవిందుడు (రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్) కాపాడుతారు. 300 రోజులుగా అమరావతి రైతులు నిరసన తెలుపుతుంటే సానుభూతి లేకపోగా అవమానిస్తున్నారు. ఉద్యమమే లేకపోతే అసెంబ్లీకి వెళ్లేందుకు సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటున్నారు. ఉద్యమకారులంటే  భయంతోనే సచివాలయానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారుల వల్ల ప్రజలకు దూరం అవుతున్నారు. కొంతమంది సలహాదారుల వల్ల సీఎం జగన్‌ ఇప్పటికే ఎస్సీ,ఎస్టీలకు దూరమయ్యారు. ఇప్పుడు సజ్జల వల్ల రైతులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని