‘టిక్‌టాక్‌ కొనుగోలుపై తేల్చేస్తాం’
close

తాజా వార్తలు

Updated : 03/08/2020 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టిక్‌టాక్‌ కొనుగోలుపై తేల్చేస్తాం’

ట్రంప్‌తో నాదేళ్ల భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్‌ ప్రకటన

న్యూయార్క్‌: చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ప్రకటించింది. యాప్‌ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ సీఈవో సత్యనాదేళ్ల ఆదివారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించారు. యాప్‌ పనితీరు విషయంలో ట్రంప్‌ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో జరుపుతున్న చర్చలు సెప్టెంబరు 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

అమెరికాలో టిక్‌టాక్‌ని పూర్తిగా నిషేధిస్తామని ట్రంప్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ అయిన నాదేళ్ల యాప్‌ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాల్ని అధ్యక్షుడుకి వివరించారని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అధ్యక్షుడి ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని.. వాటన్నింటికీ సరైన పరిష్కారం లభించే విధంగానే కొనుగోలు ఒప్పందం ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సైతం ప్రయోజనాలు అందేలా ఒప్పందం ఉంటుందని హామీ ఇచ్చింది. మైనారిటీ వాటాల కోసం ఈ ఒప్పందంలోకి ఇతర సంస్థలను సైతం ఆహ్వాస్తామని తెలిపింది. దీనిపై వైట్‌హౌస్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

అంతకుముందు అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌, వీచాట్‌ సహా చైనాకు చెందిన అనేక యాప్‌లు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు. వినియోగదారుల ఫోన్‌నెంబర్లు, చిరునామా, పరిచయాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని