
తాజా వార్తలు
సినీ హీరోల అరణ్య పర్వం
ఇంటర్నెట్ డెస్క్: సినిమాలకు అడవికి అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతి సినిమా దాదాపు విజయం సాధించింది. ‘అడవిరాముడు’, ‘అడవి దొంగ’, ‘బొబ్బలిరాజా’ నుంచి ఇటీవల కాలంలో ‘మన్యం పులి’ వరకూ ఎన్నో సినిమా అడవి నేపథ్యంలో వచ్చాయి. త్వరలోనే ఈ నేపథ్యంలో పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఎవరెవరు? అడవి బాటపడుతున్నారు. ఏయే సాహసాలు చేయబోతున్నారో ఓ లుక్కేయండి..
రానా ‘అరణ్య’
యువ నటుడు రానా కీలక పాత్రలో నటిస్తున్న త్రిభాషాచిత్రం ‘అరణ్య’. ఇంతకు ముందెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దర్శనమివ్వబోతున్నారు. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జోయా హుస్సేన్, శ్రియ, విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేరళలోని అడవుల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రభు సాల్మన్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
‘పుష్ప’సాహసాలు
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, వెన్నెల కిశోర్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. ఈ సినిమా కోసం బన్నీ, కథానాయిక రష్మిక చిత్తూరు యాస నేర్చుకున్నారు కూడా.
అటు రామరాజు.. ఇటు కొమరంభీం
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘మా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు’ అంటూ రామ్‌చరణ్ పాత్రను ఇప్పటికే పరిచయం చేశారు ఎన్టీఆర్. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే కొమరం భీంగా ఎన్టీఆర్‌ను చూడొచ్చు అభిమానులు. అల్లూరి, కొమరం భీం కలిసి దేనిపై పోరాటం చేశారన్న కల్పితగాథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు జక్కన్న. ఇద్దరూ యోధులు అడవుల్లోనే తమ పోరాటాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే, అది ఎలా? వరిపైన అన్నది తెలియాలంటే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
రానా ‘విరాట్‌పర్వం’
విప్లవం, ప్రేమ అనే రెండు విభిన్న కాన్సెప్ట్‌ల ప్రధానాంశంగా తెరకెక్కుతున్న‘విరాటపర్వం’. రానా, సాయి పల్లవి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడెక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రానా విద్యార్థి నాయకుడిగా, సాయి పల్లవి, ప్రియమణి నక్సలైట్లుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు అడవుల్లోనే సాగుతాయి.
వైష్ణవ్ తేజ్-క్రిష్ చిత్రం కూడానా?
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. కొండపోలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కథ కూడా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. వికారాబాద్ అడవుల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.