close

తాజా వార్తలు

Published : 23/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జులై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏని పెంచినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 శాతానికి పెంచింది. మూల వేతనంపై పెరిగిన డీఏ 2019 జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*ప్రభుత్వం వద్దని చెప్పినా వినలేదు: కేసీఆర్‌

2. పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలి: జగన్‌

రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. అన్ని పథకాలను బ్యాంకర్లు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారుల కోసం వచ్చేనెలలో జగనన్న తోడు పథకం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ముంబయి vs చెన్నై

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. షార్జా వేదికగా ముంబయి, చెన్నై జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాట్స్‌మెన్ ముంబయి బౌలర్ల ధాటికి విలవిల్లాడుతున్నారు. లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ఉల్లి నిల్వలపై ఆంక్షలు

ఉల్లిపాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. రిటైల్ వర్తకులు రెండు టన్నుల వరకు మాత్రమే ఉల్లి కలిగి ఉండాలని, హోల్‌సేల్‌ వర్తకులు 25 టన్నులకు మించి నిల్వలు కలిగి ఉండకూదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్‌ తెలిపారు. అసాధారణ రీతిలో ధరలు పెరుగుతున్నప్పుడు వాటి నిల్వలపై పరిమితి విధించేందుకు గత నెలలో పార్లమెంట్‌ ఆమోదం పొందిన నిత్యావసరాల (సవరణ) చట్టం వీలు కల్పిస్తోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఆ బాధ్యత తెరాస ప్రభుత్వంపై ఉంది: పవన్‌

నీటి వనరులను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను ప్రజాప్రతినిధులు బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థకు తూట్లు పొడిచి వెళ్లిపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. నాలాలు ఆక్రమించి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడితే భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్నో ఇబ్బందులు తప్పవన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ధరణి పోర్టల్‌ ప్రారంభ తేదీ మార్పు

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ విధానం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ ప్రారంభ తేదీ మారింది. దసరా నాడు పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని కారణాలతో ఈనెల 29కి అది వాయిదా పడింది. ఈనెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మోదీ ఆ సమయంలో ఎక్కడున్నారు?:రాహుల్ 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నవడా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..‘దేశసేవలో భాగంగా అమరులైన బిహార్ సైనికులకు ప్రధాని మోదీ తల వంచి నమస్కరిస్తున్నారు. ఘర్షణల్లో బిహార్‌ సైనికులు మరణించినప్పుడు..ప్రధాని ఏం చేశారు, ఏం చెప్పారన్నది నా ప్రశ్న. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకురాలేదని ప్రధాని అబద్ధం చెప్పారు. జవాన్లు చనిపోయినప్పుడు ప్రధాని ఎక్కడ ఉన్నారు?’ అంటూ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావించి విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నవంబర్‌లో కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌

 కొవిడ్‌-19 నివారణకు కృషి చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. జంతువులతో పాటు మనుషులపై జరిగిన మొదటి, రెండు దశల పరీక్షల ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దేశంలో కరోనా నిర్ధారణకు మరో విధానం

కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన క్రిస్పర్‌ ఫెలూదా విధానం 96 శాతం కచ్చితత్వాన్ని, 98 శాతం విశిష్టతను కనబరిచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ ప్రకటించారు. ఈ ఫెలూదా పేపర్‌ స్ట్రిప్‌ పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ ఐసీఎంఆర్‌ జారీ చేసింది. ఈ పరీక్షా విధానం ప్రస్తుతం వాడుతున్న ఇతర పరీక్షలకు దీటుగా కచ్చితమైన, వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుందని సంస్థ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80,238 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,765 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,00,684కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,544 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.