పరివర్తనంతో పెరుగుతున్న సంక్రమణ సామర్థ్యం!
close

తాజా వార్తలు

Published : 03/07/2020 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరివర్తనంతో పెరుగుతున్న సంక్రమణ సామర్థ్యం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే ప్రపంచమంతా కొవిడ్‌-19తో అతలాకుతలమవుతుంటే.. శాస్త్రవేత్తలు మరో చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. రోజురోజుకీ కరోనా వైరస్‌ జన్యుక్రమంలో వస్తున్న పరివర్తనంతో మనుషులకు సోకే సామర్థ్యం మరింత మెరుగుపడుతోందని గుర్తించారు. ఈ మేరకు ‘జర్నల్‌ సెల్‌’ అనే మ్యాగజైన్‌లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని ప్రచురించారు. 

ఆ అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌-19కు కారణమవుతున్న కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతూ అనేక రకాలుగా ఏర్పడుతోంది. వీటిలో ‘డీ614జీ’ అనేది ఓ రకం. దీనికి మనుషులకు సోకే సామర్థ్యం భారీ స్థాయిలో ఉన్నట్లు ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ రకాలలో దీనిదే సింహభాగం. ఈ డీ614జీని మొట్టమొదటిసారి ఏప్రిల్‌లో పరిశోధకులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన జన్యుక్రమాలను పరిశీలిస్తుండగా.. ఈ రకం తరచూ తారసపడడంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పరిశోధనలకు నేతృత్వం వహించిన అమెరికాలోని ‘లాస్‌ అలమోస్‌ నేషనల్‌ ల్యాబోరేటరీ’కు చెందిన బెట్టీ కోర్బర్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్షేత్ర స్థాయిల్లో కరోనా అసలు రూపం విజృంభిస్తుండగానే.. డీ614జీ ప్రవేశించి ప్రబలరూపంగా మారిందని తెలిపారు. అయితే, డీ614జీ ప్రస్తుత రూపం వ్యాధిని తీవ్రం చేయడం లేదని పేర్కొన్నారు.

మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు దోహదపడుతున్న కొమ్ముభాగాలు(స్పైక్‌ ప్రొటీన్‌) డీ614జీలో ప్రభావవంతంగా మార్పు చెందడమే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. అలాగే శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్‌ భారీ స్థాయిలో ఉంటున్నట్లు గుర్తించారు. దీని వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్‌ రూపాంతరం వల్ల ఏర్పడుతున్న ముప్పును గుర్తించేందుకు మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో వైరస్‌ పరివర్తన రేటు చాలా తక్కువగానే ఉన్నట్లు గుర్తించామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని