
తాజా వార్తలు
భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 1,025 పాయింట్లు ఎగబాకి 31,627 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 291 పాయింట్లు లాభపడి 9,284 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.22 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ మార్గదర్శకాలు విడుదల చేయడం సహా వివిధ దేశాల్లోనూ ఉద్దీపన, పునరుద్ధరణ ప్రణాళికల రూపకల్పన ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా సూచీలు లాభాలతో ముగిశాయి. మరోవైపు దేశంలో పరిశ్రమలకు రెండో దఫా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు సూచీల సెంటిమెంటును ప్రభావితం చేశాయి. అలాగే, మరికాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నిర్వహించనున్న మీడియా సమావేశంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు పుంజుకున్నట్లు తెలుస్తోంది.
టీసీఎస్,యాక్సిస్ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ,బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్‌కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. సన్ ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.