close

తాజా వార్తలు

Published : 06/11/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ అంటే అంతేగా.. రుతురాజ్‌ ఏమన్నాడంటే!

చెన్నై సారథిపై భావోద్వేగ పోస్టు..

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణగా నిలుస్తాడు. యువ క్రికెటర్లను ఎంతలా ప్రోత్సహిస్తాడో అందరికీ తెలిసిందే. తాను నమ్మిన ప్లేయర్‌లో సత్తా ఉండాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తాడు. మంచి ప్రదర్శన చేసే దాకా చేయి అందించి తోడుగా నిలుస్తాడు. దాంతో వారిలో దాగున్న అత్యుత్తమ ప్రతిభను బయటకు తీస్తాడు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినా, తాజాగా చెన్నై బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తమ సారథి గురించి ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. తాను మొదటిసారి ధోనీని ఎలాంటి పరిస్థితుల్లో కలిసాడో.. ప్రస్తుతం చెన్నై జట్టులో ఎలా కొనసాగుతున్నాడనే విషయాలు వెల్లడించాడు. 

‘2016 అక్టోబర్‌లో అతడిని తొలిసారి కలిశాను. రంజీల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చేయికి పెద్ద గాయమై బాధపడుతున్నా. అప్పుడు ధోనీ ఝార్ఖండ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో ధోనీ స్వయంగా నా వద్దకొచ్చి చేయి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాడు. ఇకపోతే 2020 అక్టోబర్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు విఫలమయ్యా. తక్కువ స్కోర్లకే ఔటయ్యా. దాంతో మళ్లీ ధోనీయే నా దగ్గరకొచ్చి మాట్లాడాడు. జీవితం గురించి చర్చించాడు. తనతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం నా అదృష్టం. అలా మా ప్రయాణం కొనసాగుతోంది’ అని రుతురాజ్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ దశకు చేరుకుంది. ఇప్పటికే చెన్నై ఆడిన 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. దీంతో టోర్నీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఇలా ప్లేఆఫ్స్‌ చేరకుండానే నిష్క్రమించింది. మరోవైపు రుతురాజ్‌ ఈ సీజన్‌ ఆరంభంలో 3 మ్యాచ్‌ల్లో విఫలమైనా చివర్లో రెచ్చిపోయాడు. చెన్నై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నాక మళ్లీ అవకాశం రావడంతో వరుసగా మూడు అర్ధ శతకాలు సాధించాడు. దాంతో చెన్నై మొత్తం 6 విజయాలతో ఈ సీజన్‌ను ముగించింది. కాగా, టోర్నీ ఆరంభానికి ముందు రుతురాజ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని