close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/04/2020 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

టాప్‌ 10 న్యూస్ - 5 PM

1. సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌

దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది.లాక్‌డౌన్‌ నుంచి బయటపడిన వెంటనే ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి:సోనియా

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ మంచి పరిణామమేనని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అయితే ప్రణాళికాబద్ధంగా చేయకపోవడంతోనే ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. వలస కార్మికులు వందల కి.మీ.ల మేర నడవాల్సి రావడంపై ఆవేదన కలిగించిందన్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చర్యలను సమర్థిస్తున్నామని.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. హాట్‌ స్పాట్లలో రాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని తేల్చింది. అయితే కొవిడ్-19 హాట్ స్పాట్ లలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి ఆదేశించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షలో పాజిటివ్ వస్తేనే చికిత్సకు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి ఇవి వాడండి: మోదీ

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కొవిడ్-‌19పై పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవటం ముఖ్యమని ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచించింది. ఇందుకు కాచిన నీటిని తాగాలని, ప్రాణాయామం, 30 నిమిషాలపాటు ధ్యానం చేయాలని ఆ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా, ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉపయోగించాలని కూడా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సంగారెడ్డిలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా గురువారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి నుంచి దిల్లీకి ఆరుగురు మతపరమైన ప్రార్థనలకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారిని వైద్య పరీక్షల కోసం పంపారు. గురువారం వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలో ఇద్దరు, సంగారెడ్డి శివారులోని అంగడిపేట గ్రామంలో ఇద్దరు, కొండాపూర్‌, జహీరాబాద్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్‌ సోకిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వనపర్తి పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం

వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసులు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మురికివాడలో కరోనారోగి మృతి:కాలనీమూసివేత

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారవికి చెందిన వ్యక్తి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులు, సన్నిహిత సంబంధాలున్న వారందరికీ స్టాంపులు వేసి క్వారంటైన్‌కు తరలించారు. మృతుడు నివసించే స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ (మురికివాడల పునరావాస సంస్థ) కాలనీలో 8 భవనాలలో 308 ఫ్లాట్లు, 91 దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. తబ్లీగీ సభ్యుల సమాచారం చెప్పారని దాడి

తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారి వివరాలను బయటపెట్టాడన్న నెపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారి వివరాలను కొందరు స్థానికులు అధికారులకు తెలియజేస్తున్నారు. దాదాపు ఏడుగురు వ్యక్తులు తబ్లీగీకి హాజరయ్యారని ఓ వ్యక్తి స్థానిక గ్రామసేవక్‌కు సమాచారం అందించారు. వారికి కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధీకులు ఎందుకు సమాచారం బయటకు చెప్పావని అతడిపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనాపై అసత్య ప్రచారమా? ఫిర్యాదు చేయండిలా..!

కొవిడ్-19ను గురించి అబద్ధపు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో గమనిస్తే తమకు తెలియచేయాలని ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) యూజర్లను కోరింది. ఇందుకుగానూ ఆ వార్త స్క్రీన్‌షాట్‌ లేదా లింక్‌ను 87997 11259 అనే వాట్సాప్‌ నంబరుకు లేదా pibfactcheck@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలని పీఐబీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన ఉదారతను చాటుకున్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.