close

తాజా వార్తలు

Published : 05/01/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంగారమంటే సింగారమే కాదు!

ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్‌..

అందరికీ పసిడి కలలు ఉంటాయి...  నాలుగు రూపాయలు చేతిలో ఉంటే  అమ్మాయికి అరవంకీలో.. తనకు బంగారు సూత్రమో చేయించుకోవాలని కోరుకోని మహిళ ఉంటుందా? ఆభరణాలే కాదు... బంగారాన్ని రకరకాల మార్గాల్లో కొనుగోలు చేసుకోవచ్చు. అలా చేయడం సులభమే కాదు... మంచి సూత్రం కూడా!

భారతదేశంలో అప్పుడూ.. ఇప్పుడూ బంగారాన్ని ఇష్టంగా కొంటూనే ఉంటారు. అప్పుడప్పుడూ కొంటూ బంగారాన్ని పెంచుకుంటూ వెళుతుంటారు మన ఆడవాళ్లు. అది వారికి నగల మీద మోజు అని అనుకోకూడదు. భవిష్యత్తుపై బెంగతో ముందు జాగ్రత్తతో వారు అలా చేస్తుంటారు. అయితే ఎక్కువగా ఆభరణాల రూపంలోనే ఆ కొనుగోళ్లు ఇప్పటిదాకా జరిగాయి. ఇక్కడో చిక్కుంది. ఆభరణాలపై తయారీ ఛార్జీల పేరిట 6-15 శాతం  వసూలు చేస్తుంటారు. ప్రత్యేక డిజైన్లు కావాలంటే ఆ ఛార్జీ 25 శాతం వరకూ వెళుతుంటుంది. అయితే మనం దాన్ని తిరిగి విక్రయించాలన్నా.. లేదంటే పాత నగలు ఇచ్చి కొత్తవి చేయించుకోవాలన్నా ఆ ఛార్జీలు మనకు వెనక్కి రావు.

‘పేపరు’ బంగారమూ ఉంది: ఇప్పుడు భౌతికంగా కాకుండా.. ఎలక్ట్రానిక్‌ రూపంలోనూ బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. పైగా దీంతో చాలా ప్రయోజనాలూ ఉన్నాయి. భద్రతకు ఢోకా ఉండదు. వ్యయాలు పెద్దగా ఉండవు. అన్నిటికంటే మించి పారదర్శకత ఉంటుంది. మనకు కావాల్సిందల్లా డీమ్యాట్‌ ఖాతానే. గోల్డ్‌ ఈటీఎఫ్‌లుగా పిలిచే వీటిని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కొనవచ్చు. అమ్మవచ్చు.        
ప్రభుత్వ బాండ్లు సైతం: నేరుగా  బంగారాన్ని కొనుగోలు చేసే ప్రత్యామ్నాయాల్లో ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేసే సావరిన్‌ బంగారం బాండ్లు (ఎస్‌జీబీ) ఉన్నాయి. ఇవి గ్రాము నుంచి మొదలవుతాయి. ఎనిమిదేళ్ల గడువుండే వీటిలో అయిదేళ్ల నుంచి మాత్రమే మనం విక్రయించడానికి వీలుంటుందని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి రెండు మూడు నెలలకు ఒక వారం పాటు ఈ విక్రయాలను చేపడుతుంటారు. లేదంటే సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా వీటిని సొంతం చేసుకోవచ్చు. వీటికి   2.5 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు.
బంగారు నాణేలు: ఆభరణాలకు బదులు బంగారు నాణేలు/బిస్కట్లు కొంటే వాటిపైన ఎటువంటి తయారీ ఛార్జీలు ఉండవు. అదీకాక డిజైన్‌ పాతబడిందన్న మాటా ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఆ రోజు ధరకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇవి కొనడం చాలా సులువు. ప్రభుత్వం బీఐఎస్‌ హాల్‌మార్క్‌తో 5 గ్రా., 10 గ్రా., 20 గ్రా. పసిడి బాండ్లను మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎమ్‌ఎమ్‌టీసీ) అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తోంది.
ఆభరణాలు ఇలా కూడా:  ఇప్పుడు చాలావరకు ఆభరణాల విక్రయ సంస్థలు బంగారం పథకాలు ప్రవేశపెట్టాయి. ప్రతి నెలా కొంత మొత్తం కట్టి.. గడువు పూర్తయ్యాక వారి వద్దే ఆభరణం కొనుగోలు చేయవచ్చు. ఒక్కోసారి ఒక నెల వాయిదా వాళ్లే చెల్లిస్తారు. లేదంటే.. తరుగు లేదా తయారీ ఛార్జీలను మినహాయిస్తారు.

- బెజవాడ వెంకటేశ్వర్లు, విజయవాడ

ఫండ్లలాగే బంగారాన్ని కొనొచ్చు
ఆడవాళ్లు స్టాక్‌ మార్కెట్‌ అంటే బ్రహ్మ పదార్థం అనుకుంటారు. కొంచెం అవగాహన ఉంటే చాలు. రిస్క్‌లేని మ్యూచువల్‌ ఫండ్‌లను మనం ఎలా కొంటామో.. బంగారం ఫండ్లనూ అలాగే కొనొచ్చు.  ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క క్లిక్‌తో అమ్ముకోవడం దీనికుండే సౌలభ్యం. లేదూ ఆభరణాలే కావాలనుకుంటే.. బంగారం కొనుగోలు పథకాలూ పరిశీలించవచ్చు. ఆఫర్లను ధ్రువీకరించుకున్నాకే ఆ పనిచేయాలి.

-స్వప్న కంతేటి, ఆర్థిక నిపుణురాలుTags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని