
తాజా వార్తలు
అప్పుల ఊబిలో చిక్కొద్దు...
ఉన్నదాంట్లో సర్దుకోవడం.. కరోనా నేర్పిన ఒక ముఖ్యమైన ఆర్థిక పాఠం ఇది. కానీ, ఇది ఎన్నాళ్లు సాగుతుంది? కొన్ని నెలలు.. లేదా ఏడాదిలో.. మన దగ్గర ఉన్న మొత్తం నిండుకుంటుంది. అప్పుడెలా? ఈ ప్రశ్ననే ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది. ఉన్న పొదుపు, పెట్టుబడులు, అత్యవసర నిధిని వాడుకోవడంతో నెట్టుకొస్తున్నా.. మున్ముందు ఏం చేయాలి? అప్పులు తీసుకోవడం తప్పకపోవచ్చు. కానీ, ఈ రుణాల భారం పెరిగినా కష్టమే.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూనే.. తక్కువ భారంతో ఉండే రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏయే సందర్భాల్లో అప్పు తీసుకోవాలన్నదీ ముఖ్యమే. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి..
కరోనా వైరస్.. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆదాయం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం లాంటి సంఘటనలూ చూస్తున్నాం. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారూ.. వ్యాపారులూ.. వృత్తి నిపుణులు... ఒక్కరని కాదు.. అందరిపైనా కొవిడ్-19 తన ప్రభావాన్ని చూపిస్తోంది. అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఈ సంక్షోభం నుంచి యటపడటమే కాదు.. భవిష్యత్తులోనూ ఆర్థికంగా కుదుటపడేందుకూ ఏం చేయాలన్నది కీలకంగా మారింది.
సమస్య తాత్కాలికమేనా?
ప్రస్తుతం మీకు నిజంగా ఆర్థిక ఇబ్బందులున్నాయా?అవి తాత్కాలికమా? దీర్ఘకాలంపాటు ఉండే అవకాశం ఉందా? వీటికి సమాధానాలు తెలుసుకొని, మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం తాత్కాలికమైతే మీరు కొత్త రుణం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో చిక్కులు ఎదురై.. ఎంతకాలం తర్వాత కోలుకుంటుందో చెప్పడం కష్టం అనుకున్న సందర్భాల్లో మరో రుణాన్ని అప్పుల జాబితాకు జత చేయకపోవడమే మంచిది. దీనికన్నా మీ పెట్టుబడులేమైనా ఉంటే.. వాటిని తీసుకోవడమే ఉత్తమం. కొన్నిసార్లు ఒక లక్ష్యం కోసం కాకుండా.. మిగులు డబ్బును మదుపు చేస్తుంటాం. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
40 శాతం మించకుండా..
ఆదాయాన్ని బట్టి అప్పులు చేయడం చాలామందికి అలవాటు. ఆదాయం రూ.100 ఉంటే.. అందులో నుంచి నెలసరి వాయిదాలు రూ.60-70 వరకూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వేతనాల్లో 40-50శాతం వరకూ కోత పడుతోంది. ఎప్పుడూ క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారూ ఇప్పుడు బ్యాంకులు ఇస్తున్న మారటోరియాన్ని వాడుకోవడం చూస్తున్నాం.. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడూ ఇబ్బందులు రాకూదంటే.. వచ్చిన ఆదాయంలో 40 శాతానికి మించి వాయిదాలు ఉండకూడదు. ఇలాంటప్పుడు నెలసరి వాయిదాలు చెల్లిస్తే.. నిత్యావసర ఖర్చులకు ఎలా? అందుకే, వాయిదాల మొత్తం సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోవాలి.
వ్యక్తిగత రుణం ఎప్పుడు?
అత్యవసరాల్లో వ్యక్తిగత రుణం తీసుకోవడం చాలామందికి అలవాటే. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకునే ముందు కొన్ని అంశాలను గమనించాలి. ఆదాయం ఆగిపోయి, గత్యంతరం లేనప్పుడు మాత్రమే దీన్ని పరిశీలించాలి. హామీ అక్కర్లేని వ్యక్తిగత రుణానికి వడ్డీ అధికంగా ఉంటుంది. ఆదాయం లేనప్పుడు ఈఎంఐలు చెల్లించడం భారం కావచ్చు. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే.. అపరాధ రుసుములు పడటంతోపాటు, క్రెడిట్ స్కోరూ దెబ్బతింటుంది. దీని ప్రభావం భవిష్యత్తులో తీసుకోబోయే రుణాలపైనా ఉంటుంది. జీతం కొంత మేర తగ్గి, ఎలాంటి పొదుపు, పెట్టుబడులు లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఆరేడు నెలల్లో సర్దుకునే వీలుందని భావించినప్పుడు మాత్రమే ఈ రుణాన్ని తీసుకోవాలి. ఇలాంటప్పుడూ.. మీ బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు సంస్థను సంప్రదించండి. ‘ప్రీ అప్రూవ్డ్ లోన్స్’ ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి. అప్పుడు కాస్త తక్కువ వడ్డీకే అప్పు దొరుకుతుంది.
ఆదాయం అంచనా వేయొద్దు..
ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడూ మనం ఆదాయం ఆగిపోతే అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకోం. ఇప్పుడున్న ఆదాయం ఏటా పెరుగుతుందన్న అంచనాతోనే మనం ఆలోచిస్తుంటాం. కరోనా తెచ్చిన మార్పును జీవితంలో మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఇలాంటి సందర్భాల గురించీ ఆలోచించుకోవాల్సిందే. ఇక నుంచి భవిష్యత్తులో వచ్చే ఆదాయాల గురించి కాకుండా వాస్తవంగా మనం సంపాదిస్తున్నది ఎంత అనేదాని ఆధారంగానే ఖర్చులు, లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. ఆర్థికంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసేందుకు సిద్ధపడాలి. అందుబాటులో నగదు, అత్యవసర నిధి, భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం ఇప్పుడు ఆర్థిక ప్రణాళికలో మొదటి స్థానంలో ఉండాలి. అవసరమైన, ఆస్తులను పెంచుకునే అప్పుల విషయంలోనూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి, నిర్ణయం తీసుకోండి.
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త..
క్రెడిట్ కార్డు ఉన్న వారు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన సమయమిది. ఎంతో అవసరమైతే తప్ప దాన్ని తీయకూడదు. సాధారణంగా దీనిపై రుణాలు కూడా సులువుగా వస్తుంటాయి. మీకు ముందస్తు మంజూరైన రుణం ఉంటే.. దాన్ని వాడుకోవాలనే ఆత్రుత పనికిరాదు. పైగా క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణానికి సాధారణ అప్పులకన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బిల్లు సరైన సమయానికి చెల్లించకుంటే.. 24-36 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సిందే. కొంతమంది కొన్ని వెబ్సైట్లలో క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసి, ఆ నగదును తమ ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిద్వారా తాత్కాలికంగా ఉపశమనం లభించినా.. మరుసటి నెల నుంచి ఆర్థిక కష్టాలు తప్పకపోవచ్చు.
ఇలా చేయండి..
* తీసుకున్న అప్పుల వివరాలు, వాయిదా మొత్తం, వడ్డీ మిగిలిన చెల్లింపు సమయం ఒకచోట రాసుకోండి. అధిక వడ్డీ ఉన్న అప్పులను వదిలించుకునేందుకు ఏం చేయాలన్నది ఆలోచించండి. వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా పరిశీలించండి. బ్యాంకును సంప్రదించి, సలహా తీసుకోండి.
* అత్యవసరమైతే తక్కువ వడ్డీ రుణాలను తీసుకునేందుకు ప్రయత్నించండి. పూర్తిగా ఆదాయం ఆగిపోతే.. కొవిడ్-19 నేపథ్యంలో ఈపీఎఫ్ నుంచి డబ్బును తీసుకునేందుకు ఇచ్చిన వెసులుబాటును వినియోగించుకోండి.
* వాయిదాలను వాయిదా వేసుకునే అవకాశాన్ని (మారటోరియం) తప్పనిసరైతేనే వాడుకోండి. వినియోగించుకున్న వారూ.. తమపై పడే అదనపు భారాన్ని లెక్క చూసుకోండి. అన్నీ సాధారణ స్థితిలోకి వచ్చిన వెంటనే రుణానికి సంబంధించిన అసలును చెల్లించడం ద్వారా ఎంతోకొంత భారాన్ని తగ్గించుకోవచ్చు.
* ఎండోమెంట్, మనీ బ్యాక్ జీవిత బీమా పాలసీలను హామీగా పెట్టి, రుణం తీసుకోండి. దీనికి ఇప్పటికిప్పుడు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వడ్డీ చెల్లించినా సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, షేర్లనూ హామీగా పెట్టి అప్పు తీసుకోవచ్చు.
* ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేయొద్దు.. అవసరమైతే దానిపై రుణాన్ని తీసుకోండి. పీపీఎఫ్, ఎన్పీఎస్ నుంచీ పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
* బంగారాన్ని తనఖా పెట్టి వెంటనే అప్పు తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరిగాయి కాబట్టి, కాస్త అధిక మొత్తమే వచ్చేందుకు వీలుంది. చేతిలో డబ్బు సర్దుబాటు కాగానే రుణం తీర్చేయవచ్చు.