బోనులో నిలబడ్డ తొలి సీఎం జగన్‌: యనమల
close

తాజా వార్తలు

Updated : 10/01/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోనులో నిలబడ్డ తొలి సీఎం జగన్‌: యనమల

విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోర్టుబోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా జగన్‌ ఘనత సాధించారని ఎద్దేవా చేశారు. 63 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ రాష్ట్రానికి ఇంత చెడ్డపేరు తీసుకురాలేదని దుయ్యబట్టారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి సీఎం కావడం వల్లే ప్రజలకు ఇన్ని కష్టాలొచ్చాయని అన్నారు. వైకాపా నేతలను, అధికారులను కూడా జగన్‌ జైలుకు తీసుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఒకవైపు ఆందోళనలతో రాష్ట్రం మండిపోతుంటే వీడియోగేముల్లో ముఖ్యమంత్రి, కోడిపందేల్లో మంత్రులు మునిగిపోతున్నారని యనమల దుయ్యబట్టారు. సీఎం, మంత్రులు నీరో చక్రవర్తిని మించిపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆందోళనల్లో ముంచి అగ్నిగుండంలా మార్చారని మండిపడ్డారు. ప్రజలందర్నీ రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్న క్యాంటీన్లేవి.. సంక్రాంతి కానుకలెక్కడ?

అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుకలు, తదితర పథకాలను రద్దు చేసి, పేదల నోటి దగ్గర ముద్దను లాగేశారని యనమల మండిపడ్డారు. పండగ కానుకలు ఎగ్గొట్టి వైకాపా సర్కారు పేదలకు రూ.600కోట్లు నష్టం చేసిందని యమమల ఆరోపించారు. అక్కలు, అమ్మలు, చెల్లెమ్మలంటూ వాళ్లపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. తెనాలిలో మహిళలపై లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. దుర్గగుడికి వెళ్లే మహిళలను అడ్డుకోవడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు.విజయవాడలో మహిళలను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా కమిషన్ సుమోటాగా కేసు పెట్టినా వైకాపాకి సిగ్గులేదని విమర్శించారు. కార్యకర్తలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. విద్యార్థులను బైటకు పంపొద్దని కళాశాలలకు నోటీసులు ఇచ్చారని, మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని యనమల పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని