close
Array ( ) 1

తాజా వార్తలు

సాక్షి

- నందిరాజు పద్మలతా జయరాం

నలబై కిలోమీటర్ల ప్రయాణం. ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా అతి వేగంగా కారును నడుపుతున్నాడు ప్రవీణ్‌. కురుస్తున్న కన్నీటిని జారనీయకుండా జాగ్రత్తపడుతూ పల్లవి చూడకుండా తుడుచుకున్నాడు. ‘‘బాగా నొప్పిగా ఉంది ప్రవీణ్‌. పెయిన్‌ కిల్లర్స్‌ పని చెయ్యట్లేదు’’ కుడి చేతి పిడికిలితో పొట్టలో వత్తుకుంటూ బాధగా చెప్పింది పల్లవి. ‘‘కొంచెం ఓర్చుకోరా, పెద్ద డాక్టర్‌ దగ్గర చూపించుకుంటున్నాంగా... తగ్గిపోతుందిలే’’ భార్య భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.
కారు గమ్యం చేరింది.
‘‘ఇదేంటీ?’’ ఎదురుగా కనిపిస్తున్న బోర్డును చూసి అడిగింది పల్లవి.
‘శుశ్రుత క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌’ దేశంలోనే పెద్ద పేరున్న క్యాన్సర్‌ హాస్పిటల్‌ అది.
‘‘అంటే... నాకు... నాకు క్యాన్సరా!’’ అతన్ని కౌగిలించుకుని భోరుమంది పల్లవి.
‘‘ఛ, అదేం కాదు, భయపడకు. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టడం మంచిది కదా! దా....నెమ్మదిగా దిగు.’’
అనునయిస్తూ రిసెప్షన్‌ వద్దకు వెళ్ళాడు ప్రవీణ్‌. అదొక హాస్పిటల్‌లాగా కాక, స్టార్‌ హోటల్‌లాగా ఉంది. చాలా
అధునాతనమైన ఫర్నిచర్‌, గోడలకి అందమైన చిత్రపటాలూ ప్రసిద్ధ వైద్యుల సూక్తులూ అన్నింటికీ మించి చిరునవ్వు నింపుకుని సమాధానమిస్తున్న ఫ్రంట్‌ ఆఫీసు ఉద్యోగులు.
తాము తెచ్చిన రిపోర్ట్స్‌నీ డాక్టర్‌ గారు ఇచ్చిన రిఫరెన్స్‌నీ చూపించాక భార్యాభర్తలిద్దరినీ మూడో అంతస్తులోకి పంపారు బిల్లింగ్‌ విభాగం వాళ్ళు.
‘‘నిజం చెప్పు, నాకేమయింది?’’
‘‘చూడు’’ రిపోర్ట్‌ ఆమె చేతిలో పెట్టాడు ప్రవీణ్‌. ఇద్దరూ ఓపీలో కూర్చున్నారు. యాభై మందికి పైగా ఉన్నారక్కడ.
‘అడెనోకార్సినోమా- అని అనుమానిస్తున్నాం. నిపుణుల నిర్ణయానికి పంపుతున్నాం’ అని ఉంది అందులో.
దాదాపు ఆరు నెలల నుంచీ కడుపునొప్పితో బాధపడుతోంది పల్లవి. ఏడాదిక్రితం ప్రేమ వివాహం చేసుకున్నాక,
ఒకసారి గర్భస్రావం అయ్యింది ఆమెకి. తరవాత వచ్చిన చిన్నచిన్న రుగ్మతల్లో ఈ కడుపు నొప్పి కూడా ఒకటి. ఎప్పుడూ వాంతి అవుతున్న ఫీలింగ్‌... నోటి అరుచి... అలాంటివన్నీ ప్రెగ్నెన్సీ సంబంధితాలు అనుకోవడం... అది కాదు అని తెలుసుకున్నాక ఫ్యామిలీ డాక్టర్‌ వద్ద మందులు రాయించుకుని వాడుకోవడం జరుగుతోంది. అటువాళ్ళూ ఇటువాళ్ళూ కూడా పెళ్ళిని ఆమోదించాక ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు మంచి పేరూ ప్రమోషన్సూ పొందుతున్నారు.
రిపోర్ట్స్‌లో ఉన్న కొన్ని అర్థంకాని పదాల్ని గూగుల్‌లో వెతికే ప్రయత్నంలో ఉంది పల్లవి. ఆమె కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. గుండె వేగం హెచ్చింది.
‘‘ఏమీ పర్లేదమ్మా, తగ్గుతుంది. మరికొన్ని పరీక్షలు చేస్తే సరిపోతుంది. రూల్‌ అవుట్‌ అయిపోతే మంచిదే! కాకపోయినా దిగులొద్దు. క్యాన్సర్‌కి ఇవ్వాళ్రేపు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కాకపోతే మీరు ఒక నాలుగు అయిదు వారాలు మందులు వాడాల్సి ఉంటుంది. ఇక్కడే ఉండి మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు, ధైర్యంగా ఉండండి’’ చిరునవ్వు నిండిన ముఖంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడాడు డాక్టర్‌.
డాక్టర్‌ మాటల్లో ఓదార్పుకన్నా రోగం ఉందన్న భావమే పల్లవి మనసుకి తగిలింది. అనుమానం, తద్వారా దుఃఖంతో మాటలు రావడంలేదు.

* * *

ఐసీయూలో తెల్లటి పక్కమీద పడుకుంది పల్లవి. ఆ పెద్ద గదిలో పాతికమందికి పైగా ఉన్నా ఎవరికి వారు ఒంటరి వ్యక్తులే. ఎవరి కథ వారిది. ఎవరి వ్యథ వారిది. రిపోర్ట్స్‌ అన్నీ వచ్చాక తెలిసిన విషయం ‘పెద్ద పేగు లోపల కాన్సర్‌ వ్యాపించింది’ అని.
పల్లవి తనకీ వ్యాధి చుట్టుకుంటుందని ఏనాడూ ఊహించలేదు. ఎవరో దురలవాట్లున్నవాళ్ళూ అనువంశికంగా ఆ జబ్బున్న వ్యక్తులుంటేనే దాని బారినపడతారన్న గుడ్డి నమ్మకం. ఈ వారంలో తేలిన నిజం, విషంకన్నా చేదుగా ఉంది. కన్నీటి చెలమలయిన కళ్ళు ఇక ఏడవలేమంటున్నాయి. రోజులో అతి కొద్దిసేపు మాత్రమే తనవాళ్ళు ఒళ్ళంతా కవర్‌ చేసుకుని, ముక్కుకి కూడా మాస్క్‌ వేసుకుని వచ్చి పలకరించి వెళ్తున్నారు. ‘నాకే ఎందుకిలా? నేనే పాపం చేయలేదే! ఎవరికీ ఏ హానీ చేయలేదు. ఏ దేవుడినీ తిరస్కరించలేదు...’ ఇదే ఆలోచన పల్లవి మనసంతా.
శరీరానికి ఏవేవో ఇంజెక్షన్లూ ఘడియ ఘడియకూ మందులూ రకరకాల పరీక్షలూ. మొబైల్‌ ఫోన్‌ నిషేధం. అసౌకర్యంగా ఉన్న గౌను.
చాలా విసుగ్గా ఉంది. నిద్ర పట్టడానికి సెడెటివ్స్‌ ఇస్తున్నా మగతనిద్రే. అందులో పీడకలలు.
‘‘అమ్మా నాకు బతకాలని ఉంది’’ చూడటానికి వచ్చిన తల్లితో అంది పల్లవి.
‘‘నిన్ను బతికించుకోవాలనేగా అమ్మా, ఇక్కడ చేర్చింది. తప్పకుండా తగ్గుతుంది’’ తెచ్చి పెట్టుకున్న నిబ్బరం పద్మావతి గొంతులో.
నాలుగు రోజుల తర్వాత వార్డుకి తీసుకుని వచ్చారు పల్లవిని. మానసికంగా కూడా బాగా డస్సి పోయింది. ఎవరు ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం కలగడం లేదు. జీవితం ముప్ఫై కూడా దాటకుండానే ముగిసిపోతుందేమో అన్న దిగులు కుంగదీస్తోంది. ప్రవీణ్‌ పిచ్చివాడిలా తయారయ్యాడు. అతన్ని ఓదార్చడం ఇంకా కష్టంగా ఉంది. కీమో థెరపీ... రోగం కన్నా చికిత్స ఎక్కువ బాధాకరం. రేడియాలజీ విభాగంలో, పేషెంటుని మాత్రం ఉంచి డాక్టర్లూ నర్సులూ కూడా బయటికి వచ్చేస్తారు. రేడియాలజీ కిరణాలు క్యాన్సర్‌ కణాలతోపాటు మంచి కణాలను కూడా నాశనం చేస్తాయి. అతి చేదు మందులూ ఇంజక్షన్లూ నోటికి అరుచిని కలుగజేస్తాయి. క్యాన్సర్‌కి ఎందుకింకా తేలిక పద్ధతి వైద్యం రాలేదో? మంచి పోషకాహారం తీసుకుంటూ మందులు తీసుకోవాలి. బలమైన తిండి ఉంటేనే మందులు పనిచేసేది. కానీ తినడానికి నాలుక సహకరించదు. ఏమీ తినడం లేదు పల్లవి.

* * *

వార్డులో ఉన్న పల్లవికి దుఃఖంగా ఉంది. కష్టం అంటే ఏమిటో తెలియని తన మీద దేవుడు కావాలనే కక్ష కట్టాడనుకుంటోంది. పసితనం నుంచీ తను ఆడింది ఆట, పాడింది పాట.
తలిదండ్రులూ పెళ్ళయ్యాక అత్తమామలూ భర్తా ఎవ్వరూ తనను ఒక్క మాట అన్నదే లేదు. సెలవులన్నీ షికార్లకే. నిండు నూరేళ్ళ జీవితం ఇలాగే సాగుతుంది అనుకుంటే... ఇంతలోనే ఈ విపత్తు. నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగే బతుకు సుడిగుండంలో చిక్కుకుంది. అంతా కలలాగే ఉంది. ఉండుండీ కడుపులో వస్తున్న ఆటుపోట్లు ఇది కలకాదని గుర్తుచేస్తున్నాయి.
‘‘అయ్యో అక్కా... సెలైన్‌ సీసా ఖాళీ అయింది. రక్తం పైపులోకి వస్తోంది. సిస్టర్‌... సిస్టర్‌...’’
ఆ కేకలకి చటుక్కున కళ్ళు విప్పింది పల్లవి.
పద్నాలుగో పదిహేనో ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రాడికి. వాడి పిలుపుకి డ్యూటీ నర్స్‌ వచ్చి సెలైన్‌ సీసా మార్చి, పల్లవి చేతికి ఉన్న సాకెట్‌ని సర్ది వెళ్ళిపోయింది.
‘‘నీ పేరేంటి?’’ తన వంకే చూస్తున్న కుర్రవాడిని అడిగింది పల్లవి.
‘‘వేణుధర్‌. నిన్న రాత్రి జాయిన్‌ అయ్యానక్కా. ఏమైంది నీకు?’’
కన్నీరు గిర్రున తిరిగింది పల్లవికి.
‘‘సారీ అక్కా, ఏడవొద్దు ప్లీజ్‌... ఇక్కడందరూ పేషెంట్లే, క్యాన్సర్‌ పేషెంట్లు. నెలల పాపాయిలు కూడా ఉన్నారక్కా. నాకూ క్యాన్సరే...
బోన్‌ మ్యారో క్యాన్సర్‌. అదే అక్కా... రక్తకణాలు తయారవుతాయి చూడు మూలుగలో... అక్కడ. కీమో థెరపీ కోసం వచ్చా. రేపెళ్ళి పోతా. మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్‌ నాకు, చదువుకోవాలి. అక్కా... నీకు బ్రెస్ట్‌ క్యాన్సరా?
అహ... ఆడవాళ్ళకి ఎక్కువగా అదే కదా వచ్చేది. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అక్కా’’ చాలా మామూలుగా మాట్లాడేస్తున్నాడు వేణు.
‘‘ఏయ్‌ వేణూ, వెళ్ళు... వెళ్ళి నీ బెడ్‌ మీద పడుకో! అలా డిస్టర్బ్‌ చెయ్యకూడదు’’ సిస్టర్‌ వేణుని కోప్పడింది.
‘‘అలాగే’’ అన్నట్లు తలూపి వెళ్ళాడు వేణు.
వెనుకనే వచ్చాడు డాక్టర్‌ సూర్యప్రకాశ్‌.
‘‘నిజం చెప్పండి డాక్టర్‌... వుడ్‌ ఐ బీ నార్మల్‌ అగైన్‌? నేను బతుకుతానా?’’
‘‘సీ... నేను డాక్టర్ని మాత్రమే. దేవుణ్ణి కాదుగా, ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు మానసికంగా కూడా విశ్రాంతిగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండాలి’’ ఆమె భుజం తట్టి రిపోర్ట్స్‌ చూసి వెళ్ళిపోయాడు.
తల్లికోసం అటూ ఇటూ చూసింది పల్లవి. దూరంగా కిటికీ దగ్గర నిల్చుని ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ కన్నీరు తుడుచుకుంటోందామె.
కీమో తర్వాత కడుపునొప్పి మరీ ఎక్కువగా ఉంది పల్లవికి. కడుపులో అగ్నిగుండం రగులుతున్నట్లుంది.
పిండేస్తున్న నొప్పితోపాటు తలనొప్పి కూడా తోడయ్యింది.
‘‘దేనికీ ఇంజక్షన్‌?’’
‘‘నొప్పి తగ్గడానికి. నో ప్రాబ్లమ్‌, సెలైన్‌లోనే ఇస్తాను... రెస్ట్‌ తీసుకోండి’’ సిస్టర్‌ మాటలను వింటూ కళ్ళు మూసుకున్న పల్లవికి నిద్రపట్టింది.

‘‘ఎలా ఉందక్కా?’’ కళ్ళు తెరచిన పల్లవికి తననే చూస్తూ నిల్చున్న వేణు కనపడ్డాడు. రాత్రి పదిన్నర అని చూపిస్తోంది మొబైల్‌. వార్డులో ఫోన్‌ వాడుకోనిస్తున్నారు.
‘‘నొప్పి కొంచెం తగ్గింది వేణూ... నీకు ట్రీట్‌మెంట్‌ అయిపోయిందా?’’ నవ్వాడు వేణు.
‘‘ఇది క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌... అప్పుడే ఎక్కడా... ఇంకా అయిదుసార్లు రావాలి. అప్పుడు స్కాన్‌ చేసి చెప్తారు. ఎంత తగ్గిందో, ఇంకా ఎన్నిసార్లు రావాలో.
రేపు ఉదయమే వెళ్ళిపోతాను. రెండు రోజుల తర్వాత మళ్ళీ...’’ చాలా ఆశ్చర్యం వేసింది పల్లవికి. కొద్ది నీరసం తప్ప, వాడిలో భయం లేదు. ముఖం కూడా కళ తప్పలేదు. చెప్తే కానీ వాడు జబ్బు మనిషిలాగా లేడు. గిరగిరా వార్డంతా కలియ తిరుగుతున్నాడు. అందర్నీ పలకరిస్తున్నాడు. సిస్టర్లతో కూడా కూడా తిరుగుతూ వేరే పేషెంట్ల వద్దకు వెళ్తున్నాడు. వాడికి తోడుగా కూడా ఎవరూ కనిపించటం లేదు. అదే అడిగింది పల్లవి.
‘‘తోడా, ఎందుకక్కా? మన జబ్బుని వాళ్ళేం పంచుకోలేరుగా! అమ్మది ప్రైవేటు జాబ్‌. సెలవు పెడితే జీతం నష్టం.
ఉద్యోగంలో ఇబ్బంది. అందుకే నన్ను దింపి వెళ్తుంది.’’
‘‘మీ నాన్న?’’
ఇంతలో సిస్టర్‌ దగ్గరగా వస్తూండటం చూసి తన బెడ్‌ దగ్గరకి వెళ్ళిపోయాడు వేణు.
‘‘మేడమ్‌, వాడు డిస్టర్బ్‌ చేస్తున్నాడు కదూ... నేను డాక్టర్‌తో చెప్తాన్లెండి, వార్నింగ్‌ ఇస్తారు’’ సెలైన్‌ బాటిల్‌ చెక్‌ చేస్తూ చెప్పింది సిస్టర్‌. పల్లవి ఆమెని వారించి, ‘కాసేపు వాడితో మాట్లాడాలని ఉంది’
అనడంతో, ఒప్పుకుంది సిస్టర్‌. పదకొండు దాటాక డాక్టర్స్‌ అవసరమైతే తప్ప రారు.
‘‘అసలు వాడు పేషెంటేనా? అంత చలాకీగా ఎలా ఉన్నాడు? పెద్దవాళ్ళెవరూ లేకుండా ఎలా ఉంటున్నాడు?’’ పల్లవి ప్రశ్నలకి సాలోచనగా తల పంకించింది సిస్టర్‌.
మరో పేషెంట్‌ వివరాలు చెప్పడం సరికాదు, కానీ ఆమెకి కూడా ఇది వింతగానే ఉంది కనుక పంచుకోవాలనుకుంది.
‘‘నేను పదేళ్ళ నుంచీ ఇదే ఆసుపత్రిలో ఉన్నా. ఇలాంటి పేషెంట్‌ని చూడ్డం ఇదే మొదటిసారి. కుళ్ళికుళ్ళి ఏడ్చేవాళ్ళూ పెద్దగా ఏడ్చేవాళ్ళూ నిర్లిప్తంగా ఉండేవాళ్ళూ ‘నన్ను చంపేయండి’ అని గోల చేసేవాళ్ళూ తప్ప, ఇంత ధైర్యవంతుల్ని నేనింతవరకూ చూళ్ళేదు. మా అందరికీ అదే విడ్డూరం. ఉండండి, డాక్టర్స్‌ ఇక రౌండ్స్‌కి రారు. వేణు ఇంకా నిద్రపోకపోతే తీసుకొస్తాను’’ సిస్టర్‌ లేచి వెళ్ళి వేణుని తీసుకొచ్చింది.
పల్లవి వాడిని వాడి కథ చెప్పమని అడిగింది.
‘‘మా అమ్మ డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నకిచ్చి చేశారట. అమ్మ ఇంకా చదువుకుంటానని ఏడ్చినా వినలేదట-మా అమ్మమ్మా తాతయ్య. పాపం వాళ్ళకీ ఆస్తులేమీ లేవుగా అక్కా. నేనూ అన్నయ్యా పుట్టేదాకా, మా నాన్న బాగానే ఉండేవారట. తర్వాత కొన్నాళ్ళకి, నాన్నకి పిచ్చి అలవాట్లు వచ్చాయి. చేస్తున్న ఉద్యోగం మానేసి రకరకాల వ్యాపారాలు... రియల్‌ ఎస్టేట్‌ కొన్నాళ్ళూ ఫైనాన్సు కొన్నాళ్ళూ... అన్నీ నష్టాలే. అమ్మ ఉద్యోగం చేసి ఇల్లు నడుపుతూ ఉంటే, అమ్మకున్న కాసిని నగలూ తాతగారిచ్చిన ఇల్లూ కూడా అమ్మేశారు. అమ్మ డబ్బులివ్వకపోతే తాగి వచ్చి కొట్టడం, అమ్మ ఆఫీసుకి వెళ్ళి గలాభా చేయడం...
నన్నూ అన్నయ్యని కొట్టడం... అమ్మో, నాన్న రాక్షసుడక్కా’’ చెక్కిళ్ళ మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి వాడికి.
‘‘అయినా అమ్మ భరించింది. కానీ, జ్వరంతో మొదలైన నా జబ్బు... క్యాన్సర్‌గా తేలిన తర్వాత, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన డబ్బూ ప్రభుత్వం ఇచ్చిన సాయం కూడా నాన్న ఎత్తుకుపోతూంటే ఎదురు తిరిగింది. అన్నయ్య ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు కదా... వాడు కూడా నాన్నకి ఎదురుతిరిగాడు. పాపం వాడి చదువు ఆగిపోయింది. ఫీజు కట్టలేదని కాలేజీ నుంచి పంపేశారు. వాడిని అమ్మ గవర్నమెంట్‌ కాలేజీలో చేర్చింది. నాన్న రోజూ తాగివచ్చి మమ్మల్ని కొడుతుండటంతో నాన్నతో గొడవపడి, ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంది. బాగా గొడవలయ్యాక నాన్న వెళ్ళిపోయాడు. మాకిప్పుడు ఎవరూ లేరు. మేము ముగ్గురమే- ఒకరికొకరం.’’

‘‘వేణూ, నీకు చావు భయం లేదా?’’ పల్లవి తడబడింది అడగడానికి.
నవ్వాడు వేణు.
‘‘ఉహూ! నేను భయపడి ఏడుస్తూంటే అమ్మెలా ఆఫీసుకి వెళ్ళగలదు? అన్నయ్య ఎలా చదువుకుంటాడు? అయినా ఏడ్చినంత మాత్రాన జబ్బు తగ్గదుగా అక్కా. నేను దేవుడికి దగ్గరగా ఉన్నానేమో అనిపిస్తుందిప్పుడు. అప్పుడు నేను సరిగ్గా చదివేవాణ్ణి కాదు, బాగా అల్లరి చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు మంచి మార్కులొస్తున్నాయి. నాకిప్పుడు పెద్దయి అమ్మని బాగా చూసుకోవాలని ఉంది. అందుకోసమైనా బతకాలని ఉంది, బతుకుతాను. ఏమో, ఇంకా మంచి కొత్త మందులు కనిపెడతారేమో! అయినా అక్కా... నేనేమైనా దేవుణ్ణి ‘నన్ను పుట్టించు’ అని అడగలేదుగా... ‘ఇప్పుడు నన్ను తీసుకెళ్ళద్దు’ అని ప్రాధేయపడటానికి. అమ్మలాగే నాకు కూడా పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఇష్టం. చూస్తూ ఉండు... ఈ క్యాన్సర్‌ని కూడా ఓడిస్తాను. అందుకే ఇష్టంలేకపోయినా బోన్‌ సూప్‌ తాగుతున్నాను. బలమైన ఆహారం తింటున్నాను. మామూలుగా స్కూల్‌కి వెళ్తున్నాను. పెద్దయ్యాక ఈ క్యాన్సర్‌కి మందు కనిపెడతాను. నువ్వు కూడా ‘డోంట్‌ వర్రీ అక్కా’ నీకు తప్పకుండా తగ్గిపోతుంది. వెళ్తానక్కా, నిద్రొస్తోంది. గుడ్‌ నైట్‌’’ ఆవులిస్తూనే పల్లవి అరచేతిలో, తన చెయ్యి వేసి నొక్కి వెళ్లిపోయాడు వేణు.
గీతోపదేశంలాగా అనిపించింది పల్లవికి.
కళ్ళు మూసుకుంది. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషుకదాచన’ వేణు మాటలను మననం చేసుకుంటూ ఉంటే ఈ అర్థమే వచ్చింది పల్లవికి. ఆ పసివాడి కోరికనీ ఆత్మవిశ్వాసాన్నే మరీ మరీ తల్చుకుంటోంది.
‘‘భగవంతుడా ఎంత పని చేశావయ్యా! ఇంత కష్టం ఎందుకు రావాలి నా తల్లికి’’ పద్మావతి కూతురి తల నిమురుతూ, దుఃఖంగా అంది.
‘‘అమ్మా, మనం ఆనందంగా ఉన్నప్పుడెప్పుడూ ఆ భగవంతుడిని అడగలేదు ‘అయ్యో, ఇంతమంది ఇన్ని బాధలతో, పేదరికంతో ఉన్నారే... మాకే ఎందుకింత ఆనందాన్ని ఇచ్చావు’ అని. ఇప్పుడు ‘మాకే ఎందుకింత కష్టాన్ని ఇచ్చావు’ అని ఎలా అడగగలం? మన చేతిలో ఉన్నదేదో చేద్దాం. భగవంతుడి మీద భారం వేసి జరిగేదాన్ని చూస్తూ ఉందాం. అమ్మా, భయం లేకుండా హాయిగా పడుకో. నాకు బతుకుతాననే నమ్మకం కలుగుతోంది. ఆ ఆశతో ఈరోజు నిశ్చింతగా నిద్రపోతాను. ఒకవేళ రేపు నేను లేకపోయినా ఏం ఫర్వాలేదు అనే అవగాహనతో నిశ్చింతగా నిద్రపోతాను. గుడ్‌ నైట్‌ అమ్మా!’’
ఇప్పుడు...పల్లవి మాటల్లో నిబ్బరం, ముఖంలో నిశ్చింత, మనసులో ఆత్మవిశ్వాసం!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.