తెలంగాణ మరో 49 పాజిటివ్‌ కేసులు: ఈటల
close

తాజా వార్తలు

Updated : 08/04/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ మరో 49 పాజిటివ్‌ కేసులు: ఈటల

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం వరకు కొత్తగా 49మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరుకుందన్నారు. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని.. వారిలో కొందరికి పరీక్షలు నిర్వహించి నెగటివ్‌ వచ్చిన వారిని డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 80 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించామని మంత్రి చెప్పారు. 

వారిని ఇంటికి పంపిస్తున్నాం

దిల్లీ మర్కజ్‌ నుంచి రాష్ట్రానికి 1100 మందికి పైగా వచ్చారని ఈటల చెప్పారు. మర్కజ్‌ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన 3,158 మందిని 167 క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచామని.. వారిని పరీక్షించి ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. మర్కజ్‌ నుంచి వచ్చి టెస్టుల్లో నెగటివ్‌ వచ్చి వారిని 14 రోజుల హోంక్వారంటైన్‌కు పంపిస్తున్నామన్నారు. వారంతా ఏప్రిల్‌ 21 వరకు ఇళ్లలోనే ఉండాలని.. వారిపై వైద్య, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని ఈటల వివరించారు. రోజుకు రెండుసార్లు వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షిస్తారని మంత్రి చెప్పారు. మర్కజ్‌ కేసులు తగ్గినప్పటికీ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఆయన తెలిపారు. 

5లక్షల పీపీఈ కిట్లకు ఆర్డరిచ్చాం

గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున పరీక్షలు పూర్తి చేశామని ఈటల చెప్పారు. ప్రస్తుతం 535 శాంపిల్స్‌ మాత్రమే తమ వద్ద ఉన్నాయని.. రేపటికి అవి పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో 5లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్‌ ఇచ్చామని మంత్రి తెలిపారు. వాటితో పాటు 5లక్షల ఎన్‌-95 మాస్కులు, 2 కోట్ల డాక్టర్‌ మాస్కులు, కళ్లకు పెట్టుకునే గాగుల్స్‌ 5లక్షలు, 3.5లక్షల టెస్టింగ్‌ కిట్లు ఆర్డర్‌ చేశామని ఈటల వివరించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని ఈటల స్పష్టం చేశారు. వైద్య పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారిని జిల్లాల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతామని ఆయన వివరించారు. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిధ్దం చేశామని చెప్పారు. కరోనా చికిత్సకు 22 ప్రైవేటు వైద్యకళాశాలలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిలో 15,040 పడకలు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని