
తాజా వార్తలు
భారత పర్యాటకులకు సౌదీ వీసా ఇక సులువు
దిల్లీ: పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న సౌదీ అరేబియా మరో నిర్ణయం తీసుకుంది. తొలిసారి పర్యాటక వీసా జారీ చేస్తామని ప్రకటించిన ఆ దేశం తాజాగా భారత పర్యాటకుల విషయంలో వీసా నిబంధనలను సులభతరం చేసింది. యూఎస్, యూకే లేదా షెంజన్ దేశాల వీసాలు కలిగిన భారతీయులు ఇకపై సౌదీ అరేబియాలో సులువుగా పర్యాటక వీసా పొందొచ్చు. వీసా జారీ చేసిన దేశాలకు వెళ్తున్నప్పుడు ఏదైనా సౌదీ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఈ వీసాలు జారీ చేస్తారు. అయితే, సౌదీ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
చమురు అమ్మకాలే ప్రధానంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అందించాలన్న ఉద్దేశంలో సౌదీ అరేబియా తొలిసారి పర్యాటక వీసా జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు గానూ గతేడాది సెప్టెంబర్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, సౌదీకి వెళ్లే పర్యాటకులు ఎలా మసులుకోవాలనే విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది. అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుచుకునేవారికి జరిమానాలు విధిస్తామని తెలిపింది. వస్త్రధారణ, ప్రవర్తన విషయంలో పర్యాటకులు పద్ధతిగా ఉండాలని కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.