వేర్వేరు డోసులు తీసుకున్న జర్మనీ ఛాన్సలర్
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 14:59 IST

వేర్వేరు డోసులు తీసుకున్న జర్మనీ ఛాన్సలర్

మొదటిది ఆస్ట్రాజెనికా..రెండోది మోడెర్నా

బెర్లిన్: ‘కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు, టీకా కొరతను అధిగమించేందుకు రెండు వేర్వేరు డోసులను తీసుకోవచ్చా?’ అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వేర్వేరు టీకా డోసులను తీసుకొని ఆశ్చర్యపరిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(66). మొదటి విడతలో ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న ఆమె.. రెండో దఫా మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని మెర్కెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

అరవై ఏళ్లు దాటినవారు మాత్రమే ఆస్ట్రాజెనికా టీకా వేసుకోవాలని కొద్ది నెలల క్రితం జర్మనీ మార్గదర్శకాలు జారీ చేసింది. యువతలో రక్తం గడ్డకడుతున్న కేసులు నమోదు కావడంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొద్దివారాల తరవాత ఏప్రిల్‌లో మొదటి డోసుకింద ఏంజెలా మెర్కెల్ ఈ టీకా తీసుకున్నారు. తాజాగా రెండోడోసుగా మోడెర్నా టీకాను వేయించుకున్నారు. 

16 ఏళ్లుగా జర్మనీని పాలిస్తోన్న ఆమె.. ఈ ఏడాది పదవి నుంచి దిగిపోనున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఆమె ఆరోగ్యం గురించి వార్తలు వచ్చాయి. నియంత్రించలేని స్థాయిలో ఆమె వణుకుతూ కనిపించేవారు. బహిరంగ సమావేశాల్లో కూడా ఆమె ఆ సమస్యతో బాధపడుతూ ఉండేవారు. దానికి సంబంధించి వీడియోలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరోపక్క జర్మనీలో నిదానంగా ప్రారంభమైన టీకా కార్యక్రమం గత కొద్దివారాలుగా వేగం పుంజుకుంది. మంగళవారం నాటికి 51శాతం మంది ప్రజలు మొదటిడోసు వేయించుకున్నారు. 

ఇటలీ ప్రధాని కూడా..

ఇటలీ ప్రధాని మారియో డ్రాగి(73) కూడా ఏంజెలా మెర్కెల్‌ బాటలోనే నడిచారు. ఆయన కూడా వేర్వేరు తయారీ సంస్థలకు చెందిన కరోనా టీకాలను వేయించుకున్నారు. మొదటి డోసుగా ఆస్ట్రాజెనికా టీసుకున్న ఆయన.. రెండో విడతగా ఫైజర్ టీకాను వేయించుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని అధికార ప్రతినిధి వెల్లడించారు.

వేర్వేరు డోసులపై నిపుణులు ఏమంటున్నారంటే..

 ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారికి ప్రస్తుతమున్న విరుగుడు కేవలం టీకానే. పలు దేశాల్లో టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా దేశాలు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ఒకేవ్యక్తి రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా? అనే అంశంపై దృష్టి సారించారు. ఇలా తీసుకునే వారిలో దుష్ప్రభావాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అయితే దీనివల్ల ప్రమాదం మాత్రం లేదంటున్నారు. కొన్ని దేశాల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బలమైన రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోందన్నారు. దీంతో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. రెండు వేర్వేరు డోసులు ఇవ్వడం వల్ల కొత్త రకాలపై టీకాలు బాగానే పని చేస్తున్నట్లు తెలుస్తోందంది. ఇప్పటికే ఒకడోసు టీకా ఇచ్చి, కొరత వల్ల రెండోడోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇదొక అవకాశమనే చెప్పాలని వ్యాఖ్యానించింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని