వారానికి మూడు రోజులు సెలవులివ్వండి!

తాజా వార్తలు

Updated : 22/01/2021 10:18 IST

వారానికి మూడు రోజులు సెలవులివ్వండి!

ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టాలంటున్న జపాన్‌ నేతలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు పనిదినాలు ఇచ్చి మూడు రోజులు వారాంతపు సెలవులు ప్రకటించాలని ఆ దేశ రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటున్నారు. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సమయపాలన, కష్టపడి పనిచేయడంలో జపాన్‌ పెట్టింది పేరు. అక్కడి ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పనిలో నిమగ్నమవుతుంటారు. అయితే, ఉద్యోగంలో అభద్రతా భావం కూడా ఇందుకు ఒక కారణం. వారానికి రెండు రోజులు వారాంతపు సెలవులు ఉన్నా యాజమాన్యాన్ని మెప్పించి ఉద్యోగ భద్రత పొందడం కోసం.. లేదా వచ్చే జీతం సరిపోక చాలా మంది ఉద్యోగులు ఆఫీసులో అదనపు సమయం పనిచేస్తుంటారు. సెలవు రోజుల్లోనూ పని చేయడమే కాదు.. కొన్నిసార్లు ఉద్యోగులు పనిచేస్తూ ఆఫీసుల్లోనే నిద్రపోతుంటారు. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలని యోచించింది. అయితే ఇటీవల కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరగడంతో నేతలు ఈ కొత్త విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. 

లాభానష్టాలు

మూడు రోజుల వారాంత సెలవుల విధానంపై నేతలు స్పందిస్తూ.. ఈ విధానం వల్ల కొవిడ్‌-19 సోకే ప్రమాదం తక్కువగా ఉండటంతోపాటు ప్రజారవాణా వాహనాల వినియోగం తగ్గుతుంది. ఉద్యోగులు వారి కుటుంబసభ్యులతో కలిసి గడిపేందుకు సమయం లభిస్తుంది. అలాగే ఇతర వృత్తులు చేసుకుంటూ మరో ఆదాయం పొందొచ్చు లేదా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ విధానం వల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు ఉండొచ్చు. వారానికి ఐదురోజులకు బదులు నాలుగు రోజులే పనిచేస్తారు కాబట్టి 20శాతం మేర జీతంలో కోతకు అవకాశం ఉంది. మూడు రోజులు సెలవులు ఉండటంతో ఆదాయం పెంపుకు మరో మార్గం చూసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, సమస్యల్లా సంస్థలు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత.. ఉద్యోగ ప్రయోజనాలు యథావిధిగా కొనసాగించేలా చేయాలన్నారు. అలాగే ఈ బిల్లు తీసుకొస్తే ఉద్యోగులు వారంలో వారిని నచ్చినట్లుగా మూడు రోజులు సెలవులు తీసుకునే వీలు కల్పిస్తుందని నేతలు చెబుతున్నారు. 

ప్రయోగం విజయవంతం

ఉద్యోగుల కోసం పనివేళలను.. పని వాతావరణాన్ని నచ్చిన విధంగా మార్చగలమని నేతలు నమ్ముతున్నారు. జపాన్‌లోని మైక్రోసాఫ్ట్‌.. తమ ఆఫీసులో ఉద్యోగులకు 2019 ఆగస్టు నెలలో మూడు రోజుల వారాంత సెలవులను ప్రయోగత్మకంగా అమలు చేసింది. ‘ది వర్క్‌ లైఫ్‌ ఛాయిస్‌ ఛాలెంజ్‌ సమ్మర్‌-2019’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ జపాన్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మూడు రోజుల వారాంత సెలవు విధానంలో దాదాపు 40శాతం ఉత్పాదకత పెరిగిందని తేలింది. ఆ దేశంలోని మరో సంస్థ కూడా ఉద్యోగులకు ఈ విధానాన్ని స్వచ్ఛందంగా ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే చిన్న సంస్థలకు చేయూతగా ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు రోజుల వారాంత సెలవులు అమల్లోకి ఎప్పుడు వస్తాయో చూడాలి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని