
తాజా వార్తలు
హంగ్ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ భాజపా పంచన చేరుతారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య జరుగుతోంది ‘నకిలీ యుద్ధం’గా అభివర్ణించారు. కొవిడ్‌పై పోరు కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ నిధులను ఎన్నికల సమయంలో నేతల కొనుగోళ్లకు భాజపా వినియోగిస్తోందని ఆరోపించారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో కాంగ్రెస్- వామపక్షాలు ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అవినీతి తృణమూల్ ప్రభుత్వం, మతత్వ భాజపాను అడ్డుకుంటేనే ఉత్తమ బెంగాల్ సాధ్యమవుతుందని ఏచూరి అన్నారు. రైతుల విషయంలో మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో ఇక్కడ యువత పట్ల కూడా మమత ప్రభుత్వం అదే తీరున వ్యవవహరిస్తోందని దుయ్యబట్టారు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తృణమూల్ మళ్లీ భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. (1998 నుంచి తృణమూల్ కొన్నేళ్ల పాటు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది.) ‘‘అవినీతి, వారసత్వ రాజకీయాలంటూ విమర్శలు చేసే భాజపా.. అమిత్‌షా కుమారుడు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యారు? క్రికెట్ స్టేడియానికి మోదీ పేరు ఎందుకు పెట్టారు ? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
తృణమూల్, భాజపాను ఓడిస్తాం: అధిర్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్- వామపక్షాలు, ఇతర లౌకిక శక్తులతో కూడిన మహా కూటమి తృణమూల్, భాజపాను ఓడించి తీరుతుందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్‌లో భాజపా, తృణమూల్ జాడ ఉండదని, కేవలం మహా కూటమి మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పారు. మార్చి 27 నుంచి మొత్తం 8 దశల్లో బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే2న ఫలితాలు వెలువడనున్నాయి.