
తాజా వార్తలు
భళా లిషిత.. తణుకు చిన్నారి వరల్డ్ రికార్డు
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారి జొన్నాదుల లిషిత ఫైర్ లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వజ్ర వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక స్కేటింగ్ కోర్టులో నిర్వహించిన సాహసోపేతమైన లింబో స్కేటింగ్ ప్రదర్శనలో లిషిత ఈ ఘనత సాధించింది. 20మీటర్ల పొడువు.. 8 అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టాండ్స్ ద్వారా మంటల కింద నుంచి నిర్వహించిన ప్రదర్శనలో ఆమె ఈ సాహసం చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వజ్ర వరల్డ్ రికార్డ్స్ సీఈవో కె.తిరుపతిరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా చేయలేని సాహసోపేతమైన ఫైర్ లింబో స్కేటింగ్లో ఐదేళ్ల చిన్నారి లిషిత విజయం సొంతం చేసుకుందన్నారు. బాలుర విభాగంలో ఫైర్ లింబో చేశారు తప్పా బాలికల విభాగంలో చేయడం ఇదే మొదటిసారన్నారు. ఫైర్ లింబోలో వరల్డ్ సాధించిన లిషిత రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందన్నారు.
అనంతరం లిషితకు వరల్డ్ రికార్డు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. చిన్నారికి స్కేటింగ్ శిక్షణ ఇచ్చిన కోచ్ వి.లావణ్యకు బెస్ట్ కోచ్గా ప్రకటించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ డా. గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ.. సాహసోపేతమైన స్కేటింగ్ ప్రదర్శనలో చిన్నారి లిషిత రికార్డు సృష్టించడం తణుకు పట్టణంతో పాటు యావత్ భారతదేశానికే గర్వకారణమన్నారు. రికార్డు నెలకొల్పేలా ప్రోత్సహించిన కోచ్ లావణ్య, చిన్నారిని తల్లిదండ్రులు ఉమామహేశ్వర్, అనూషలను అభినందించారు. కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్లు జి.ప్రతాప్, ఎ.మోహన్, వైకాపా పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.