close

ఆలోక్‌కు ఉద్వాసన

సీబీఐ నుంచి అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ
అత్యున్నత స్థాయి కమిటీ సంచలన నిర్ణయం
అవినీతి ఆరోపణలున్నాయన్న సీవీసీ నివేదిక ఆధారంగానే చర్య
వాదన వినిపించుకునే అవకాశమిద్దామన్న ఖర్గే
ససేమిరా అన్న ప్రధాని మోదీ,  జస్టిస్‌ సిక్రి
సీబీఐ పగ్గాలు మళ్లీ నాగేశ్వరరావు చేతికి

కేంద్ర దర్యాప్తు సంస్థలో నెలకొన్న పరిణామాలకు సంచలన ముగింపు! 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో తొలిసారిగా ఒక డైరెక్టర్‌ ఉద్వాసనకు గురయ్యారు.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించింది. ఆలోక్‌పై అవినీతి, విధులు పట్ల అలసత్వం వంటి ఆరోపణలున్నట్లు కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) సమర్పించిన నివేదిక ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే వ్యతిరేకించినప్పటికీ మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం వెలువడింది. అనంతరం సీబీఐ పగ్గాలను తాత్కాలికంగా అదనపు డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావుకు ప్రభుత్వం అప్పగించింది. ఆలోక్‌ వర్మను కేంద్ర హోంశాఖ పరిధిలో అగ్నిమాపక సేవలు, సివిల్‌ డిఫెన్స్‌, హోంగార్డుల డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి కమిటీ గురువారం సమావేశమైంది. ఇందులో ప్రధానితోపాటు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి సభ్యుడిగా ఉండాలి. ఆలోక్‌ను సీబీఐ డైరెక్టర్‌గా పునర్నియమిస్తూ తీర్పు చెప్పిన ధర్మాసనంలో తాను సభ్యుడిగా ఉండటంతో తన తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్‌ సిక్రిని తన ప్రతినిధిగా సీజేఐ పంపారు. సమావేశం రెండు గంటలపాటు సాగింది. సీవీసీ చేసిన ఆరోపణలపై వాదన వినిపించుకునేందుకు ఆలోక్‌కు అవకాశమివ్వాలని ఖర్గే పట్టుబట్టారు. అందుకు మోదీ, జస్టిస్‌ సిక్రి నిరాకరించారు. ఆలోక్‌ చిత్తశుద్ధి కనబర్చడం లేదని, ఆయనపై కొన్ని కేసుల్లో క్రిమినల్‌ దర్యాప్తు అవసరమని వారిద్దరు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో మెజారిటీ(2-1) ప్రాతిపదికన ఆలోక్‌ను తప్పించారు. బుధవారం ఈ కమిటీ 30 నిమిషాలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే.

విధుల్లో చేరిన రెండు రోజులకే..
ఆలోక్‌ 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. సీబీఐ డైరెక్టర్‌గా ఆయన రెండేళ్ల పదవీకాలం ఈ నెల 31తో ముగియాల్సి ఉంది. ఆలోక్‌, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య విభేదాలు ముదరడంతో వారిద్దరినీ నిర్బంధ సెలవుపై పంపిస్తూ గతేడాది అక్టోబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం కలకలం సృష్టించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ నిర్వహించిన న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్‌గా ఆయనకు తిరిగి పగ్గాలు అప్పగిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. విధానపరమైన కీలక నిర్ణయాలేవీ తీసుకోవద్దని ఆయన్ను ఆదేశించింది. ఆలోక్‌ భవితవ్యాన్ని వారంలోగా తేల్చాలని ప్రధాని నేతృత్వంలోని కమిటీని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో 77 రోజుల నిర్బంధ సెలవు తర్వాత ఆలోక్‌ బుధవారం తిరిగి విధుల్లో చేరారు. తాను వెళ్లిపోయాక సీబీఐలో చోటుచేసుకున్న బదిలీలను రద్దు చేశారు. తిరిగి విధుల్లో చేరిన రెండ్రోజులకే ఆయనను పదవి నుంచి తప్పించారు. ఇంతకుముందు ఆలోక్‌ వర్మను సెలవుపై పంపినప్పుడు ప్రభుత్వం నాగేశ్వరరావునే సీబీఐ తాత్కాలిక అధిపతిగా నియమించింది.

అంతకుముందు నాటకీయ పరిణామాలు
ఆలోక్‌ వర్మ తొలగింపునకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై నమోదైన అవినీతి కేసు దర్యాప్తు అధికారి(ఐవో)గా ఎస్పీ హోదాలోని మోహిత్‌ గుప్తాను ఆలోక్‌ వర్మ నియమించారు. ప్రస్తుతం గుప్తా గాజియాబాద్‌ సీబీఐ యూనిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అస్థానా కేసులో తొలుత డీఎస్పీ ఎ.కె.బస్సి, అదనపు ఎస్పీ ఎస్‌.ఎస్‌.గుర్మ ఐవోలుగా ఉన్నారు. అనంతరం వారి స్థానంలో సతీశ్‌ దాగర్‌ నియమితులయ్యారు. సతీశ్‌ను తప్పించి గుప్తాకు ఆలోక్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న అవినీతి నిరోధక(ఏసీ)-3 విభాగం బాధ్యతలు చేపట్టేందుకు డీఐజీ ఎం.కె.సిన్హా విముఖత వ్యక్తం చేయడంతో ఇప్పటికే ఈ కేసు పర్యవేక్షణ విధుల్లో ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తరుణ్‌ గౌబను ఆలోక్‌ కొనసాగించారు. సిన్హాకు ‘బ్యాంకింగ్‌, సెక్యూరిటీలు, మోసాలు సెల్‌(బీఎస్‌ఎఫ్‌ఎసీ)’ విభాగం పర్యవేక్షణను కేటాయించారు.

అస్థానా పిటిషన్‌పై తీర్పు నేడు
అవినీతి కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ రాకేశ్‌ అస్థానా, సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేందర్‌ కుమార్‌, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.