close

కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి

తెరాసలోకి మరో ఎమ్మెల్యే
  కేటీఆర్‌తో పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి భేటీ
   ఖమ్మం సభలో చేరాలని సూచించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
   మరో 8 మందిపై గులాబీ గురి
   సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస పావులు?
ఈనాడు - హైదరాబాద్‌

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఉపేందర్‌రెడ్డి తెరాస అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ఆయనతో కలిసి నడుస్తానని పేర్కొనగా.. కేటీఆర్‌ స్వాగతించారు. ఖమ్మంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభలో పార్టీలో చేరాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరుతున్న ఆరో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి. అధికార పార్టీ వ్యూహానికి కాంగ్రెస్‌ విలవిల్లాడుతోంది. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతులమందిని తెరాసలో చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని తెరాస వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని తెరాస పావులు కదుపుతోంది.

కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి తెరాసలో చేరితే విలీనం జరిగే అవకాశం ఉంది. గతంలో తెలుగుదేశం, తాజాగా కాంగ్రెస్‌ శాసనమండలి పక్షం విషయంలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే ఆరుగురు బయటికి రాగా శాసనసభాపక్షం విలీనం కావాలంటే మరో ఎనిమిదిమంది సభ్యులు కావాలి. వారిని కూడా సమీకరించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

కాంగ్రెస్‌ నుంచి ఆరో ఎమ్మెల్యే..
ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరుతున్న ఆరో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి. రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), హరిప్రియ (ఇల్లందు), సబితారెడ్డి (మహేశ్వరం) ఇప్పటికే తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం తెరాసలో చేరనున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు ఖమ్మం జిల్లా వారే.

కాంగ్రెస్‌లో మిగిలింది వీరే
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(హుజూర్‌నగర్‌), మల్లు భట్టి విక్రమార్క (మధిర-ఎస్సీ), శ్రీధర్‌బాబు(మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి), సీతక్క (ములుగు -ఎస్టీ), హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్‌),  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొందెం వీరయ్య (భద్రాచలం - ఎస్టీ), సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్‌), వెంకట్రమణారెడ్డి, (భూపాలపల్లి), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), జాజుల సురేందర్‌ (ఎల్లారెడ్డి), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు).

98కి చేరనున్న తెరాస బలం
తెరాస బలం ఇప్పటికే 91 కాగా మరో ఏడుగురు సభ్యులు కాంగ్రెస్‌, తెదేపాల నుంచి చేరితే మొత్తం సంఖ్య 98కి చేరుతుంది. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 19 నుంచి 13కు తగ్గుతుంది.

గందరగోళంలో కాంగ్రెస్‌
శాసనసభ్యులు ఒక్కోక్కరు పార్టీని వీడుతుండటం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్ని గందరగోళంలో పడేస్తోంది. శాసనసభ్యులను నిలువరించే ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తెరాస పంచన చేరుతుండడం ఆ పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ కూడా తెరాసలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. రోజుకో పేరు వినపడుతుండటం కాంగ్రెస్‌ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పూర్వపు ఖమ్మం జిల్లా నుంచి నెగ్గిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క (మధిర), మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) మినహా అంతా కూడా తెరాసలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

విలీనమే లక్ష్యమా!
కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని చూస్తోందా లేక ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే తెరాస లక్ష్యమా అనేదానిపై కాంగ్రెస్‌ తర్జనభర్జన పడుతోంది. 19 స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. శాసనసభ్యుల్లో పదోవంతుమంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అంటే కనీసం 12 లేదా అంతకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండాలి. మొత్తం 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఆరుగురు గులాబీ కండువా కప్పుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు మిగిలింది 13మంది. మరో ఇద్దరు దూరమైతే శాసనసభలో ప్రతిపక్షహోదా పోయినట్లే. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాతో పాటు ఆ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డిల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ ఇద్దరు లేకుంటే మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేనట్లే.

ఆగమన్నా ఆగని సబిత

మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడకుండా చూడడానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. సబితారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి తెరాసలో చేరనున్నారు. అంతలోనే కందాల ఉపేందర్‌రెడ్డి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇంకా ఒకరిద్దరు గోడ దూకుతారనే ప్రచారం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొన్ని అంశాల్లో స్పష్టమైన హామీలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం కూడా పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేసుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. పొత్తుల కారణంగానే సబితారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డికి రాజేంద్రనగర్‌ టికెట్‌ ఇవ్వలేకపోయామని, సిటింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఈసారి చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ కార్తీక్‌రెడ్డికి ఇవ్వలేకపోతున్నామని వాపోతున్నారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
 సురేందర్‌, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు గురువారం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘ఈనాడు‘ వివరణ కోరగా.. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. తాను వ్యక్తిగత పనుల మీద దిల్లీ వెళ్లి వస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

అవసరమైతే రాజీనామా చేస్తా

కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్ధం. కేసీఆర్‌ అన్ని ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మొత్తానికి సాగునీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన, అంకితభావం ఉన్నవాళ్లు కేసీఆర్‌ తప్ప మరొకరెవరూ నాకు కనిపించడం లేదు.
-కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.