close
గులాబీ గూటికి గండ్ర 

తెరాసలో చేరనున్న భూపాలపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 
సతీసమేతంగా  కేటీఆర్‌తో భేటీ 
చీఫ్‌ విప్‌ పదవి హామీ? 
భార్య జ్యోతికి వరంగల్‌ గ్రామీణ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి?

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు తెరాసలో చేరనున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తన భార్య జ్యోతితో సోమవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం గండ్ర లేఖను విడుదల చేశారు.  ‘‘జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నాను.’’ అని ఆ లేఖలో పేరొన్నారు. 
ఇదీ గండ్ర నేపథ్యం 
గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. 2007లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009లో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన తెరాస వైపు దృష్టి సారించారు. ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడంతో పాటు వచ్చే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆయన సతీమణి జ్యోతికి వరంగల్‌ గ్రామీణ జిల్లా పరిషత్‌ ఇవ్వడానికి తెరాస అధిష్ఠానం అంగీకరించింది. శాసనసభలో చీఫ్‌ విప్‌ గురించి ఆయన కోరగా దానిపైనా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య జ్యోతితో కలిసి సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. కేటీఆర్‌ వారిని స్వాగతించారు. 
గండ్ర తెరాసలో చేరుతున్న పదకొండో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళ, బుధవారాల్లో తెరాసలో చేరనున్నట్లు తెలిసింది. తెరాసకు శాసనసభలో 91 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తెదేపా నుంచి సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌ నుంచి 11 మంది సభ్యులు తెరాస చేరేందుకు ముందుకొచ్చారు. వీరి చేరికతో పార్టీ బలం 103కి చేరనుంది. 
భూపాలపల్లి బి-ఫారాల అందజేత 
తమ పార్టీలో చేరేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భూపాలపల్లి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించిన బి-ఫారాలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు ఎంపిక బాధ్యతలు ఇవ్వాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.