close
ఆస్పత్రులు మానవతా దృక్పథాన్ని చూపాలి 

రహదారి ప్రమాద బాధితులకు అండగా నిలవాలి 
ప్రమాదాల్లో మూడింట ఒకవంతు మంది పాదచారులే 
ద్విచక్ర వాహనాల కోసం రహదారులపై ప్రత్యేక లైన్లు 
రహదారి భద్రతా కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం: మంత్రి వేముల

ఈనాడు, హైదరాబాద్‌: ‘రహదారి ప్రమాద బాధితుల విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ప్రమాదం జరిగిన వెంటనే తొలి మూడు రోజుల పాటు ఉచితంగా వైద్య సేవలు అందించే అంశాన్ని ఆస్పత్రుల నిర్వాహకులు పరిశీలించాలి. ప్రమాదాల నియంత్రణకు రహదారులపై వాహనాలను వేరు చేయటానికి ద్విచక్ర వాహనాలు, కార్ల కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ పరిధిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, నగర పోలీసులు చేపట్టాలి. గ్రేటర్‌ పరిధిలోని అన్ని రహదారులపై స్టాప్‌ లైన్లు, జీబ్రా లైన్లు వేయాలి. వచ్చే 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారి భద్రతా కౌన్సిల్‌ తీర్మానం చేసింది. శనివారం సచివాలయంలో కౌన్సిల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి రహదారులు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. జాతీయ రహదారులపై మూడు విభాగాలుగా విభజించిన ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దాలని, అద్దంకి-నార్కట్‌పల్లి మార్గంలోని ప్రమాదకర ప్రాంతాలను రహదారులు-భవనాల శాఖ తక్షణం అధ్యయనం చేయాలని, జాతీయ రహదారుల్లో 1033 నంబరును 108 అంబులెన్స్‌ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 
అవుటర్‌పై ప్రమాదకర స్థాయిలో వేగం 
హైదరాబాద్‌ బాహ్యవలయ రహదారి (అవుటర్‌)పై ప్రమాదకర స్థాయిలో వాహనాలు పరుగులు తీస్తున్నాయని మంత్రి  ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అవుటర్‌పై వంద కిలోమీటర్లకు మించి వేగంగా వాహనాలు నడపకూడదు. మితి మీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న వారిపై చలానాల సంఖ్య, అపరాధ రుసుము మొత్తాన్ని పెంచినా ఫలితం లేదు. జాతీయ రహదారులపై 173 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాం. వాటిని మూడు కేటగిరీలుగా విభజించాం. అత్యంత ప్రమాదకరంగా ఉన్న 20 ప్రాంతాలను మొదటి కేటగిరీగా గుర్తించి వాటన్నింటినీ ఇప్పటికే చక్కదిద్దాం. మిగిలిన రెండు కేటగిరీలను త్వరితగతిన చక్కదిద్దాలని అధికారులకు స్పష్టం చేశాం. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎంత సమయంలో అంబులెన్స్‌లు వస్తున్నాయి? ఎంత వ్యవధిలో బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి? అనే అంశంపై అధ్యయనం చేస్తాం. ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో మూడింట ఒక వంతు మంది పాదచారులే. వారి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.  వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌, సీటు బెల్టులు పెట్టుకోని 11 వేల మంది వాహనదారుల చోదక అనుమతి పత్రాల(డ్రైవింగ్‌ లైసెన్సుల)ను రద్దు చేశాం. రాష్ట్ర రహదారుల్లో 30 ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. వాటి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.