close
బెంగాల్‌ను కుదిపేస్తున్న కట్‌ మనీ 

అక్రమార్కులపై కఠిన చర్యలకు మమత నిర్ణయం! 
రుజువైతే జీవిత ఖైదు? 
అధికార పార్టీ నేతలపై  విచారణకు విపక్షాల పట్టు 
కోల్‌కతా

మొన్నటి వరకూ అల్లర్లతో అట్టుడికిన పశ్చిమ బెంగాల్‌ను ఇప్పుడు ‘కట్‌ మనీ’ కుదిపేస్తోంది! ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తామంటూ తీసుకున్న డబ్బులను ఇచ్చేయాలనిఅధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ఇదే విషయమై మంగళవారం శాసనసభ దద్దరిల్లింది! అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చకచకా చోటుచేసుకోవడం విశేషం! 
శ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి కమీషన్లు తీసుకొనే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇక పెద్ద గండమే! ఇలాంటి వారిని భారత శిక్షా స్మృతి సెక్షన్‌ 409 కింద విచారించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించినట్టు ఆమె కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. అవినీతికి పాల్పడినట్టు రుజువైతే, ఈ సెక్షన్‌ కింద జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా బలం పుంజుకోవడం, 2021లో శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో సీఎం మమత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఆలోచనతోనే ఈనెల 18న పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా ఆమె గట్టి హెచ్చరిక చేశారు. ‘‘నా పార్టీలో దొంగలకు చోటు లేదు. ప్రభుత్వ పథకాలు అందించడానికి కొందరు నేతలు 25% కమీషన్‌ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. లబ్ధిదారుల నుంచి కమీషన్లు తీసుకొని ఉంటే వెనక్కు ఇచ్చేయండి. నేను చర్యలు తీసుకోవడం మొదలుపెడితే మీరు పార్టీ మారక తప్పదు’’ అని ఆమె వారితో అన్నారు. మరోవైపు- ప్రజాప్రతినిధులు, అధికారుల ‘కట్‌ మనీ’ అవినీతిపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, తక్షణం విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
‘కమీషన్‌’ వెనక్కు ఇచ్చేసిన నేత 
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల తృణమూల్‌ నేతలకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కమీషన్‌గా తీసుకున్న డబ్బుల్ని వెనక్కు ఇచ్చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. 
ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఓ తృణమూల్‌ నేత ‘కట్‌ మనీ’గా తీసుకున్న రూ.2.25 లక్షలను వెనక్కు ఇచ్చేశాడు! బీర్‌భుమ్‌ జిల్లా సూరీకి చెందిన త్రిలోచన్‌ ముఖోపాధ్యాయ అధికార పార్టీ బూత్‌ అధ్యక్షుడు. ఉపాధి హామీ పథకం కింద లబ్ధి చేకూర్చుతానంటూ 141 మంది నుంచి కమీషన్‌ తీసుకున్నాడు. అయితే తమ డబ్బుల్ని వెనక్కు ఇచ్చేయాలని రెండ్రోజుల కిందట వారంతా ఆయన ఇంటికి వచ్చి డిమాండ్‌ చేశారు.దీంతో ఒక్కొక్కరికి రూ.1,600 చొప్పున వెనక్కు ఇచ్చేసినట్టు త్రిలోచన్‌ తెలిపాడు. 
ఏంటీ ‘కట్‌ మనీ’? 
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చేందుకు ప్రజల నుంచి నేతలు, అధికారులు కమీషన్లుగా తీసుకున్న మొత్తాలను పశ్చిమ బెంగాల్‌లో ‘కట్‌ మనీ’గా పిలుస్తున్నారు. లబ్ధిదారులకు అందే మొత్తాల నుంచి కూడా నేతలు 25% వరకూ కమీషన్‌గా తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. ‘కట్‌ మనీ’ మొత్తాలను వెనక్కు ఇచ్చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టేందుకు భాజపా, అనుబంధ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.