close
వీడిన పేగుబంధాలు

పేగుబంధాలు విడిపోయాయి. రక్తసంబంధీకులు తల్లడిల్లిపోయారు. ఉత్సాహంగా, గోదావరి పరవళ్ల మధ్య సాగుతున్న బోటు ప్రయాణం ఒక్కసారిగా తల్లకిందులు కావడంతో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం పర్యాటకుల తరం కావడం లేదు. లాహిరి లాహిరి లాహిరిలో అంటూ సాగిపోతున్న ప్రయాణం ఇంతటి పెను విషాదాన్ని మిగుల్చుతుందని తమ ఊహకైనా అందలేదని వారు అంటున్నారు. కాళ్లను పట్టుకున్న బిడ్డను అందుకోలేకపోయిన తల్లి ఒకరు, చితాభస్మాన్ని గోదావరిలో కలపడానికి వెళ్లి గల్లంతైనవారొకరు... ఏ ఒక్కరిని కదిపినా కన్నీటి గోదారులే...

గోదావరి ప్రవాహానికి బోటు పక్కకు ఒరగడంతో భయంతో దూకేశాను. తరువాత బోటు బోల్తాపడింది. వెంటనే బోటుపైకి ఎక్కాను. మళ్లీ బోటు పల్టీకొట్టి మునిగిపోవడంతో నీటిలోకి దూకేశాను. స్థానికులు నాటు పడవలపై వచ్చి రక్షించారు.
- సోలేటి రాజేష్‌, ఏఈ, హైదరాబాద్‌

దేవుడి దయతో బతికా

ర్యాటక ప్రాంతాలను చూసేందుకు 14 మంది స్నేహితులతో కలిసి శనివారం రాజమహేంద్రవరం వచ్చాం. దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామానికి వచ్చేసరికి బోటు తిరగబడింది. దేవుడి దయవల్ల ఒడ్డుకు చేరాను.
జి.ప్రభాకర్‌, కడిపికొండ, వరంగల్‌ జిల్లా

మావాళ్లు నలుగురి జాడ లేదు

మేం అయిదుగురు కుటుంబసభ్యులం వచ్చాం. నేను, నా భార్య శివజ్యోతి, మా సోదరి అంకెం వసుంధర, బావ పవన్‌కుమార్‌, వాళ్ల అబ్బాయి సుశీల్‌ (గోకుల్‌) పాపికొండల యాత్రకు బయల్దేరాం. తొలుత మేం అయిదుగురం లైఫ్‌జాకెట్లు వేసుకున్నాం. మధ్యాహ్నభోజనాల కోసం వాటిని పక్కనపెట్టాం. నేనింకా తీసేలోపే బోటు ఒకవైపు ఒరిగిపోయింది. నేను గోదావరిలో పడిన తర్వాత నా లైఫ్‌జాకెట్‌ పోయింది. ఈత రావడంతో కొద్దిసేపు ఈదాను. ఇంతలో గ్రామస్థులు వచ్చి రక్షించారు. మావాళ్లు నలుగురు ఏమయ్యారో ఆచూకీ లేదు.
- చింతామణి జానకిరామయ్య, ఉప్పల్‌, హైదరాబాద్‌

వాళ్లు ఏమయ్యారో 

మా స్నేహితులమంతా పాపికొండల యాత్రకు వెళ్లాలని కొన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాం. 14 మందిమి కలిసి వరంగల్‌ నుంచి శనివారం ఉదయం రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాం. ఆదివారం ఉదయం సింగనపల్లి నుంచి ఎంతో ఉత్సాహంగా పాపికొండలకు బయలుదేరాం. పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకోవడం, నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రమాదం జరిగింది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను. మా వాళ్లు ఏమయ్యారో తెలియదు.
- దశరథం, కడిపికొండ, వరంగల్‌ జిల్లా

సహోద్యోగులను కోల్పోయాం

మేం ఏడుగురం కలిసి హైదరాబాద్‌ నుంచి విహారయాత్రకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్నాం. మేమంతా తెలంగాణా పోలీస్‌ గృహనిర్మాణ సంస్థలో ఏఈలుగా పనిచేస్తున్నాం. ముగ్గురు మిత్రుల జాడ లేదు.
-ఎం.కిరణ్‌కుమార్‌, ఏఈ, హైదరాబాద్‌

ప్రాణభయంతో వణికిపోయాం

బోటు తిరగబడటంతో ఒక్కసారిగా అలజడి వాతావరణం ఏర్పడింది. అప్పటివరకు ఆహ్లాదకరంగా గడిపినవారంతా ప్రాణభయంతో వణికిపోయారు. నేను లైఫ్‌జాకెట్‌ ధరించి ఉండటంతో ప్రాణాలు దక్కాయి.
-ఎన్‌.సురేష్ ఏఈ, హైదరాబాద్‌

స్థానికుల సహకారంతో బయటపడ్డా

బోటు నీళ్లలోకి మునిగిపోవడంతో భయాందోళనకు గురయ్యా. అదృష్టవశాత్తూ స్థానికుల సహకారంతో ప్రాణాలతో బయటపడ్డా. ఒడ్డుకు చేరిన తర్వాత రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చారు.
- జి.శివశంకర్‌, ఏఈ, హైదరాబాద్‌

ఆయన గల్లంతయ్యారు..

నా భర్త నన్ను కాపాడి తను కనిపించకుండా పోయారు. నేను నీటిలో మునిగిపోతుంటే నా కాళ్లు పట్టుకుని పైకి నెట్టారు. ఆ సమయంలో మా పాప హాసిని(11) నా కాళ్లు పట్టుకునే ఉన్నా కాపాడుకోలేకపోయాను. చివరినిమిషం వరకు మమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నించి ఆయన కనుమరుగయ్యారు.
- దుర్గం మధులత, తిరుపతి

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.