close
డయాలసిస్‌ రోగులకూ పింఛనివ్వండి

సభను కోరిన పలువురు సభ్యులు

ఈనాడు, హైదరాబాద్‌: మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్‌ చేయించుకుంటున్న వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి..నెలలో నాలుగైదు సార్లు చేయించుకోవాల్సిన పరిస్థితి కొందరిలో ఉందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుటుంబాన్ని పోషించే యజమాని ఈ చికిత్సకు తిరుగుతుండటంతో ఆదాయార్జన లేక భార్య, పిల్లల భవిష్యత్తు అంధకారమవుతోందని పేర్కొన్నారు. బాధితులకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు. ఎవరైనా చనిపోతే ఆ తరువాత అవకాశం తమకు వస్తుందా అనే రీతిలో డయాలసిస్‌ రోగులు ఎదురుచూస్తున్న పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయని సభ్యులు మాట్లాడారు.  ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఈ అంశంపై మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. ‘మా నాన్నకు 14 ఏళ్లు డయాలసిస్‌ చేయించాం. ఆ సమయంలో మేం ఆర్థికంగా ఎంతో కుంగిపోయాం.రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న వ్యథ ఏమిటో నాకు తెలుసు. ప్రభుత్వం పైలేరియా లాంటి జబ్బున్న వారికి పింఛను ఇస్తోంది. డయాలసిస్‌ రోగులకు కూడా ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. కొలనుపాకకు చెందిన తండ్రి లేని ఓ యువకుడు తల్లితో కలిసి వారంలో రెండు సార్లు చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని సునీత సభ దృష్టికి తెచ్చారు. వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది మగవారే ఉండటంతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్య ఎక్కువగా ఉండటంతో.. కిడ్నీ బాధితులు కూడా ఎక్కువ మంది ఉన్నారన్నారు.

ప్రత్యేక పరిశోధన చేయాలి
మూత్రపిండాలు చెడిపోవడానికి గల కారణాలు, టీకా తయారీకి ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశోధనలు చేయాలని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా కోరారు. నల్గొండలో మరో పది యంత్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరగా.. రోగులకు మౌలిక వసతులు కల్పించాలని పైళ్ల శేఖర్‌రెడ్డి విన్నవించారు. నిత్యం 52 మంది రోగులు డయాలసిస్‌ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు జగిత్యాలలో ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ సభ దృష్టికి తెచ్చారు. పింఛను ఇచ్చి ఆదుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం విజ్ఞప్తి చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కిడ్నీ బాధితులున్నారని, డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ కోరారు. బార్కాస్‌, చార్మినార్‌, యాకుత్‌పురా, మలక్‌పేటలో అవసరమైనన్ని యంత్రాలు ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి కోరారు.


ముఖ్యమంత్రి దృష్టికి సమస్య: ఈటల

రాష్ట్రంలో నెలకు పదివేల మంది డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో బారులు తీరుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. 43 కేంద్రాల్లో 270 యంత్రాలతో సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు బస్‌పాసులు ఇచ్చామన్నారు. వారికి పింఛను ఇచ్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపించామన్నారు. రాష్ట్రం తరఫున ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కోరుట్ల, ఆర్మూరు, హుజూరాబాద్‌, కామాటిపురలో కొత్తగా డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గతేడాది రూ.33.29 కోట్లు, ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.19.39 కోట్లు ఈ చికిత్సకు వ్యయంచేసినట్లు పేర్కొన్నారు.


ఉపరితల నీటితో వ్యాధికి అడ్డుకట్ట

బోరు బావుల నుంచి వస్తున్న నీటిలో ఫ్లోరైడ్‌ తదితర విష జలాలు వస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సభలో ఆయన ప్రత్యేక ప్రకటన చేశారు. నీళ్లు పడటం లేదని 500-600 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారని, ఈ నీరు మూత్రపిండాలను దెబ్బతీస్తోందన్నారు. ఉపరితల నీటితో మూత్రపిండ వ్యాధుల ప్రభావం తగ్గే అవకాశాలుంటాయని, ప్రభుత్వం ‘భగీరథ’ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తాగేలా ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలని సూచించారు. ఎక్కడైనా పథకం అమల్లోకి రాకపోతే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.