close
హుజూర్‌.. హుషార్‌

84.75శాతం పోలింగ్‌
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే వృద్ధి
తమకే అనుకూలమంటున్న తెరాస, కాంగ్రెస్‌
ఈనాడు, నల్గొండ; ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పటిష్ఠ బందోబస్తు మధ్య సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు మినహా ఎలాంటి అనుచిత ఘటనలు తలెత్తకుండా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో వ్యవహరించింది. నియోజకవర్గవ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం ఏడింటి నుంచే ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకల్లా 70శాతం పోలింగ్‌ నమోదుకాగా.. సాయంత్రం ఐదింటికల్లా అది 84.45 శాతానికి చేరింది. తరువాతా హుజూర్‌నగర్‌ పట్టణంతో పాటు పలు మండలాల్లోని కొన్ని కేంద్రాల్లో ఓటర్లు వరుసలోనే ఉన్నారు. మొత్తమ్మీద ఉప ఎన్నికలో 84.75 శాతం పోలింగ్‌ నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శాసనసభ ఎన్నికల్లో 78.38 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. 2019 ఏప్రిల్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కాస్త మెరుగ్గా 78.85 శాతం రికార్డయింది. అత్యధిక సమస్యాత్మక ప్రాంతాలున్న మేళ్లచెర్వు, చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంలను అధికారులు సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు.

పెరిగిన పోలింగ్‌.. ఎవరికి అనుకూలం?
గతానికి భిన్నంగా నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం పెరగడాన్ని బట్టి ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని ప్రధాన పార్టీలు విశ్వసిస్తున్నాయి. హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల రెండు పురపాలికల్లోనూ పెరిగిన ఓటింగ్‌ శాతంతో ఓట్లు ఎవరికి అనుకూలంగా పడ్డాయి అన్న వివరాలను నేతలు వివిధ వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. తెరాస, కాంగ్రెస్‌ శ్రేణులు నియోజకవర్గమంతటా తిరుగుతూ తప్పక ఓటు వేయాలని కోరడం కనిపించింది. శాసనసభ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తెదేపా ఇప్పుడు సొంతంగా  బలనిరూపణకు ప్రయత్నించగా.. భాజపా మునుపటి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించేందుకు ఉద్ధృత ప్రచారం నిర్వహించింది. దీంతో పెరిగిన పోలింగ్‌ ఎవరి పుట్టి ముంచుతుందోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది.

ఎవరి ధీమా వారిదే
ఓటింగ్‌ సరళి ఉదయం నుంచి తమకు అనుకూలంగా సాగిందని తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు సైదిరెడ్డి, పద్మావతి పోలింగ్‌ అనంతరం వెల్లడించారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారంతా తెరాసకే ఓటేశారని సైదిరెడ్డి వెల్లడించగా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన వారంతా కాంగ్రెస్‌కే పట్టం కడతారని పద్మావతి ధీమా ప్రకటించారు. తమకు గతంలో కంటే ఎక్కువగానే ఓట్లు వస్తాయని తెదేపా, భాజపా నాయకులు భావిస్తున్నారు.

హుజూర్‌నగర్‌లో మాదే విజయం: కేటీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌లో తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజారిటీతో గెలుస్తారని సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఓటర్లకు మంత్రుల కృతజ్ఞతలు
హుజూర్‌నగర్‌లో పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాఠోడ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు హైదరాబాద్‌లో మాట్లాతుడూ.. ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తుదకంటూ ప్రలోభాలు
ప్రచారపర్వం ముగిసిన శనివారం సాయంత్రం నుంచి పోలింగ్‌ జరిగే సోమవారం ఉదయం 7 గంటల వరకు ప్రధాన పార్టీల ప్రలోభాలు కొనసాగాయి. డబ్బు, మద్యం, నజరానాలు, ప్రతి ఇంటికి చేరేలా ప్రధాన పార్టీలు పకడ్బందీగా వ్యవహరించాయి. ఉమ్మడి మేళ్లచెర్వు మండలంలో సోమవారం మధ్యాహ్నం వరకూ ఓ ప్రధాన పార్టీ ఓటర్లకు డబ్బు పంచింది. నేరేడుచర్ల మండలంలో ఓ ప్రధాన పార్టీ ఇచ్చిన డబ్బును ద్వితీయ శ్రేణి నాయకులు తమ వద్దే ఉంచుకున్నారని కొందరు ఓటర్లు గొడవచేశారు. హుజూర్‌నగర్‌లో ఓ ప్రధాన పార్టీకి చెందిన కీలక నేత మరో ప్రధాన పార్టీకి చెందిన కొందరు నాయకులను బుజ్జగించడంతో చివరి నిమిషంలో వారు ఆ పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.