close
భూగ్రహం.. మునుగుతున్న నావ

వాతావరణ మార్పులతో పెరుగుతున్న విపత్తులు
పదేళ్లలో తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం
వాతావరణ మార్పులపై కమిషనర్‌ను నియమించాలి
హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి నిర్వహణ చాలా ముఖ్యం
‘ఈనాడు’తో ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్రవేత్త టిమ్‌ ఫ్లెన్నరీ
ఈనాడు - హైదరాబాద్‌

పెరిగిపోతున్న కాలుష్యం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులతో భూగ్రహం మునిగిపోతున్న నావలా మారింది. ఇప్పుడు దీనికి కారణమెవ్వరనే వాదనలు వదిలేసి పుడమిని కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. అప్పుడే మానవాళికి మనుగడ అని ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్రవేత్త టిమ్‌ ఫ్లెన్నరీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై దశాబ్దాలుగా అధ్యయనం చేసిన ఆయన ఆస్ట్రేలియా, కెనడా ప్రభుత్వాలకు ఈ అంశంపై సలహాదారుడిగా పనిచేశారు. ఆస్ట్రేలియా వాతావరణ మార్పుల మండలికి ప్రధాన అధిపతిగా, వాతావరణ శాఖ కమిషనర్‌గా, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007లో కోపెన్‌హెగన్‌ క్లైమేట్‌ కౌన్సిల్‌ సదస్సుకు అధ్యక్షుడిగా పనిచేశారు. వివిధ సైన్స్‌ పత్రికల్లో 140 వ్యాసాలు రాశారు. ఆయన రాసిన 32 పుస్తకాలను 20 భాషల్లోకి అనువదించారు.

అభివృద్ధి చెందిన దేశాల చర్యలతోనే కాలుష్యం పెరుగుతుందనే వాదన ఉంది
చారిత్రకంగా అది నిజమే. కానీ ఇప్పుడు కాలుష్యం, వాతావరణ మార్పులతో భూగ్రహం మునిగిపోతున్న నావలా మారింది. ఇప్పుడీ విషయంపై మనం వాదించుకుంటూ రాబోయే తరాలకు అన్యాయం చేయరాదు. భూమిని వాతావరణ మార్పుల నుంచి కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలి.

ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి
యువతతో మాట్లాడి అవగాహన కల్పించాలి. భారతదేశానికి భవిష్యత్తులో ఆహార భద్రత, నీటి భద్రత ముఖ్యం. సముద్ర మట్టాలు పెరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకోవాలి. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తితోనే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో ఇంకా బాగా పనిచేయాలి.

వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల తీవ్రత ఎలా ఉంటుంది
ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొన్ని సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి. రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ముంబయి తీర ప్రాంతం చాలావరకూ మునిగిపోయే ప్రమాదముంది. హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి పెద్ద సమస్య. మురుగు వ్యర్థాలను శుద్ధి చేస్తే అందులో నుంచి వచ్చే నీటిని మళ్లీ వాడుకోవచ్చు. విపత్తుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రతి ప్రభుత్వం ప్రత్యేక విపత్తు సహాయక నిధిని ఏర్పాటు చేయాలి.

పేద ప్రజలకు వాతావరణ మార్పులపై ఎలా అవగాహన కల్పించాలి
వాతావరణ మార్పుల విభాగానికి ప్రత్యేక కమిషనర్‌ ఉండాలి. అతను నేరుగా ప్రజలతో మాట్లాడాలి. కొత్త పరిశ్రమలు సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించుకునేలా చూడాలి. సౌర, పవన విద్యుదుత్పత్తిని బాగా పెంచాలి. ఎలాంటి వాతావరణమున్న దేశంలో భద్రంగా బతకాలని కోరుకుంటున్నారని భారత యువతను అడగండి. వారికి అవగాహన కల్పించి వాతావరణ పరిరక్షణ వైపు మళ్లించాలి.

భారతదేశంలో కాలుష్యం, వాతావరణ మార్పుల సమస్యలను పరిశీలించారా?
ఈ విషయమై హైదరాబాద్‌లో పరిశోధకులతో మాట్లాడా. పంటల వ్యర్థాలను కాల్చడం వల్ల ఉత్తర భారతంలో కాలుష్యం వెలువడుతోందని వారంటున్నారు. దానిని కాల్చకుండా భూమిలోకి పంపే చర్యలు చేపడితే భూసారం పెరుగుతుంది. ఇప్పటి నుంచి దీనిపై దృష్టి పెడితే రాబోయే పదేళ్లలో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

* అణు ఇంధన ఉత్పత్తి ఇప్పుడంత లాభదాయకం కాదు. సౌరవిద్యుత్‌ ఉత్పత్తి ఇప్పుడు చాలా చౌక. దీనిని ప్రజలు వినియోగించుకునేలా చూడాలి. 
* థర్మల్‌ విద్యుత్‌ నుంచి సంప్రదాయేతర ఇంధన రంగంవైపు జర్మనీ వేగంగా వెళుతోంది. అలాగని థర్మల్‌ రంగంలో పనిచేస్తున్న వారి ఉపాధి పోకుండా చూసింది. ఏ ఒక్కరి ఉపాధి పోకుండా సంప్రదాయేతర ఇంధన రంగాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమే. 
* సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. సముద్ర జలాలను నీటి భద్రతకు వినియోగించుకునేలా అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. చైనాలో మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు. మొక్కలు నాటితే అవే కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకుని మానవాళికి ప్రాణవాయువును ఇస్తాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.