close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పునరావాసానికి పుట్టెడు కష్టాలు

విచారణల పేరుతో కాలయాపన

ఇళ్ల స్థలాలు, ప్యాకేజీ కోసం ఎదురుచూపులు

మాచవరం, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

కరాలపాడు పునరావాస కేంద్రం

కాలం కరుగుతున్నా.. పులిచింతల నిర్వాసితుల కష్టాలు మాత్రం పట్టించుకునేవారే లేరు. పునరావాసానికి పుష్కర కాలం పట్టేలా ఉందని నిర్వాసితులు వాపోతున్నారు. చాలామందికి ఇళ్ల స్థలాలు చూపకపోవడంతో, ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. జలాశయానికి వరద నీరొచ్చిన సమయంలో గ్రామాలను వీడటం, తగ్గాక మరలా రావడం అలవాటుగా మారింది. ఆ సమయంలో పిల్లా, పాపలతో కొంతమంది అటవీ ప్రాంతంలో గుడారాలు వేసుకొని ఉంటుంటే, మరికొందరు తెలిసిన చోటకు వెళుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా, అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా, వీరి తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో, ప్రాజెక్టులోకి నెమ్మదిగా నీరొచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీరు నిల్వ చేస్తే, నిర్వాసితుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పరిస్థితి ఇదీ..

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో మాచవరం మండలంలోని ఏటి ఒడ్డు గ్రామాలైన గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ పూర్తిగా, వేమవరం పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. పైగ్రామాల్లోని పొలాలు, ఇళ్లకు పరిహారం వచ్చినా, పునరావాసం చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో నివేశన స్థలాలు, ఇంటి నిర్మాణం, కాలనీల అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో లెక్కించి, ప్యాకేజీ రూపొందించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు వచ్చేలా చూశారు. గోవిందాపురం, రేగులగడ్డ గ్రామస్థులకు ప్యాకేజీ అందించారు. వెల్లంపల్లి నిర్వాసితుల్లోని కొందరికి, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు అందజేశారు. జాబితాలో చాలామంది అనర్హులు ఉన్నారంటూ, అప్పట్లో జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో దాదాపు 90 మందికి పట్టాలివ్వడం నిలిపేశారు. అక్కడి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. విచారణల పేరుతో కాలయాపన జరుగుతోందని వారు వాపోతున్నారు. సుమారు రెండేళ్ల క్రితం పునరావాస శాఖ కమిషనర్‌ స్వయంగా వెల్లంపల్లి వచ్చి విచారణ చేపట్టారు. ఇరవై రోజుల్లో అర్హులైన వారికి పునరావాసం చూపుతామని హామీ ఇచ్చారు. సంయుక్త కలెక్టర్‌, పులిచింతల అధికారులు 39 మందిని అర్హులుగా ప్రకటించారు. గతేడాది అక్టోబరు నెలలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. మిగిలిన 51 మంది, తాము ఎందుకు అర్హులం కాదో తెలపాలని, సోషల్‌ ఎకనామిక్‌ సర్వేలో పేర్లున్నాయని అభ్యంతరం తెలిపారు. దీనిపై వినతులు అందటంతో, జిల్లా కలెక్టర్‌ గురజాల ఆర్డీవోని విచారణాధికారిగా నియమించారు. విచారణ పూర్తవగా నివేదిక అందాల్సి ఉంది. వేమవరం గ్రామంలో 305 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. ఎస్సీ కాలనీ వాసుల్లోని 95 మందికి వేమవరర-చెన్నాయపాలెం రహదారి పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, అక్కడ ఇళ్ల స్థలాలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి సాయం, పనిదినాలకు ప్యాకేజీ ఇచ్చారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరో 26 మందితో పాటు ఇతరులు 93 మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇక్కడి నిర్వాసితులు రేగులగడ్డ, గోవిందాపురం వాసుల మాదిరిగా తమకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. అది కూడా అమలుకు నోచుకోలేదు.

నిర్వాసితులకు న్యాయం చేస్తాం

వెల్లంపల్లికి చెందిన 90 మందిలో 39 మందిని అర్హులుగా తేల్చాం. మిగిలిన వారిపై ఆర్డీఓ నుంచి విచారణ నివేదిక అందాల్సి ఉంది. రాగానే కరాలపాడు పునరావాస కేంద్రం-2లో ఇళ్ల పట్టాలు అందజేస్తాం. వేమవరంలో 26మంది ఎస్సీ కుటుంబాలకు పునరావాస కేంద్రం సమీపంలో భూమి సేకరించాం. అదే గ్రామానికి చెందిన 93మంది వన్‌టైం సెటిల్‌మెంట్‌ ప్యాకేజి అడుగుతున్నారు. దీనిని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. కరోనా వైరస్‌తో వెల్లంపల్లి నిర్వాసితులకు పట్టాలు అందజేయడంలో జాప్యం జరుగుతోంది. త్వరలో వారికి పట్టాలు పంపిణీ చేస్తాం. - కొండయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, పులిచింతల యూనిట్‌-3

ముంపు ప్రాంతంలో నివాసముంటున్న వేమవరం నిర్వాసితులు​​​​​​​

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.