close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లింగన్నకు అంతిమ వీడ్కోలు

తరలివచ్చిన తెరాస శ్రేణులు, అభిమానులు

 దుబ్బాక నియోజకవర్గంలో స్వచ్ఛందంగా దుకాణాల బంద్‌

రామలింగారెడ్డి అంతిమ యాత్ర...

న్యూస్‌టుడే, సిద్దిపేట, దుబ్బాక, చేగుంట: అందరూ ముద్దుగా లింగన్న అని నోరారా పిలుచుకునే ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.. ఉమ్మడి మెదక్‌ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం తెరాస శ్రేణులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.  అశ్రునయనాల మధ్య వారి స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో గురువారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, చేగుంట, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలను స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గురువారం ఉదయం 6 గంటలకు అంబులెన్స్‌లో కుటుంబసభ్యులు చిట్టాపూర్‌కు పార్థివదేహాన్ని తరలించారు. వారి ఇంటి వద్ద జనసందర్శనార్థం ఉంచారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తెరాస శ్రేణులు, నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాల నేతలు భారీగా గ్రామానికి తరలివచ్చారు.
తొలుత ఎర్రటి వస్త్రం... తర్వాత గులాబీ...
రామలింగారెడ్డికి ప్రజాఉద్యమాలతో సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురితో పాటు ప్రజాసంఘాల నేతలు రామలింగారెడ్డి పార్థివదేహానికి ఎర్రటి వస్త్రం చుట్టి పూలమాల వేశారు. రామలింగారెడ్డి అమర్‌రహే...!అని నినాదాలు చేశారు. లింగన్నా నీ ఆశయ సాధనకు కృషి చేస్తామంటూ నినదించారు. తర్వాత కొంత సేపటికి తెరాస శ్రేణులు ఆయన మృతదేహంపై గులాబీ వస్త్రాన్ని కప్పారు. పూలతో అలంకరించిన వాహనంలో అంతిమయాత్ర చేపట్టారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలైన అంతిమయాత్ర 4.20 వరకు కొనసాగింది. మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో కుమారుడు సతీష్‌రెడ్డి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల చివరలో వర్షం పడింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జోగు రామన్న, కార్పొరేషన్ల ఛైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు, సిద్దిపేట జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు రోజాశర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, కవి నందిని సిధారెడ్డి, దేవిప్రసాద్‌, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
* అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉండడంతో ఈ ప్రక్రియ చేపట్టలేకపోయామని పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

నివాళులు అర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌
 


తీరనిలోటు
మంత్రి హరీశ్‌

ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయాన్ని సందర్శిస్తున్న సీఎం కేసీఆర్‌,

మంత్రి హరీశ్‌రావు, పాలనాధికారి వెంకటరామరెడ్డి తదితరులు

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు, తనకు వ్యక్తిగతంగా తీరనిలోటు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజాప్రతినిధిగా ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. మంచి నేతను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఆయన నిరంతరం పరితపించారన్నారు.
* రామలింగారెడ్డి మృతికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రగతిశీల భావాలతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు వారు చేసిన కృషి అపారమని ఆయన కొనియాడారు.


ఉంటే జనం మధ్య... లేదంటే పాడెపై అన్నవు..!


రామలింగారెడ్డి పార్థివదేహం వద్ద రోదిస్తున్న భార్య సుజాత, కుటుంబ సభ్యులు

‘జీవించి ఉంటే జనం మధ్య... లేదంటే పాడెపై ఉంటా...!’ అని అన్నావు...మా నుంచి దూరంగా వెళ్లిపోయావంటూ రామలింగారెడ్డి సతీమణి సుజాత బోరున విలపించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరిన సందర్భంలో రామలింగారెడ్డి తమతో ఈ విధంగా అనేవారని ఆమె గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు...! నాకు డాడీ కావాలి...!! అంటూ కుమార్తె ఉదయశ్రీ పదే పదే ఏడ్వడం అక్కడ ఉన్న వారందరిని కలచివేసింది.


నాడు కిష్టారెడ్డి... నేడు రామలింగారెడ్డి
ఎమ్మెల్యేలుగా ఉంటూ కన్నుమూసిన నేతలు

ఈనాడు, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటూ ఇద్దరు నేతలు తుదిశ్వాస విడిచిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకొంటున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకుగాను 8చోట్ల తెరాస అభ్యర్థులే గెలిచారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయాలు దక్కించుకున్నారు. పార్టీలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి 67ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆగస్టు 24, 2015లో ఆయన హైదరాబాద్‌లో మృతిచెందారు.  కిష్టారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో తెరాస ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో గెలిచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. 2015లో కిష్టారెడ్డి, 2018లో రామలింగారెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కొంత కాలానికే తుదిశ్వాస విడిచారు.
 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.