close

ప్రధానాంశాలు

సీఏఏను రద్దు చేయాలి

కేంద్రాన్ని కోరిన తెలంగాణ సర్కారు
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం
పౌరసత్వంలో మతపరమైన వివక్ష తగదు
ఈ నెల 24 నుంచి ‘పట్టణ ప్రగతి’
ఉమ్మడి రాష్ట్రంలోని పథకాలపై అధ్యయనం
మంత్రిమండలి నిర్ణయాలు
లోకాయుక్త సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఈనాడు - హైదరాబాద్‌

* లౌకికవాదానికి మారుపేరైన తెలంగాణ ప్రభుత్వం సీఏఏ వంటి చట్టాలకు వ్యతిరేకం. దీనిపై మా విధానాన్ని దేశమంతటికీ తెలిసేలా పార్లమెంటులో స్పష్టం చేశాం. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం. సీఏఏపై కేంద్రం పునరాలోచించకుంటే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.

* కేంద్రం తెలంగాణకు ఏమాత్రం చేయూతనివ్వడం లేదు. పన్నుల వాటా మినహా ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు విమర్శలకే పరిమితమయ్యారు. మెట్రోలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా ఆక్షేపణీయం.

* ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రాజీవ్‌ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేని రుణం తదితర పథకాలను అధ్యయనం చేసి వాటిని కొనసాగించాలా వద్దా అనే అంశంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌భారత పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని, అన్ని మతాలను సమానంగా చూడాలని తెలంగాణ మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లౌకికత్వానికి ప్రమాదంగా పరిణమించే పౌరసత్వ సవరణ చట్టా (సీఏఏ)న్ని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి, వసతులు, సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ‘పట్టణ ప్రగతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీని విధి విధానాల ఖరారుకు ఈ నెల 18న ప్రగతి భవన్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఆదివారం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టంపై చర్చించారు.

రాష్ట్రమంతటా ‘పురో’గమనం
‘పట్టణ ప్రగతి’ నిర్వహణపై మంత్రిమండలిలో విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంతో పట్టణాల్లో చక్కటి వ్యవస్థకు బాటలు పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం- పారిశుద్ధ్యం వెల్లివిరియాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని ఆయన పిలుపునిచ్చారు. పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని, దీనిపై ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ జరిగే సదస్సులో మార్గనిర్దేశం చేస్తామన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన శాకాహార, మాంసాహార మార్కెట్‌ను, శ్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్లాలని సూచించారు.

రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని మార్గదర్శకాల ఖరారుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన ఆర్థిక, పురపాలక ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అరవిందకుమార్‌ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్‌ రావు, ఐఏఎస్‌ అధికారి సందీప్‌ సుల్తానియాలకు అప్పగించింది.

మేడారం జాతర నిర్వహణ భేష్‌
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, రవాణా శాఖ మంత్రి అజయ్‌ కుమార్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


ఇవీ మంత్రిమండలి నిర్ణయాలు

* వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి నిర్వహించాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించాలి. వార్డుల వారీగా ప్రజాసంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే అయిదు రోజుల్లో పూర్తి కావాలి. జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పురపాలక సంఘాలకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ఆర్థిక సంఘ నిధుల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. దీనివల్ల అన్ని పట్టణాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి.

* 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ. 811 కోట్లలో రూ.500 కోట్లు నగరపాలక, పురపాలక సంఘాలకు, రూ.311 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించాలి. పట్టణ ప్రగతిలో పచ్చదనం - పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యమివ్వాలి. మురుగు కాల్వలు శుభ్రం చేయాలి. గుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
పారిశుద్ధ్య పనులకు 3100 వాహనాలు

* నగర, పురపాలికల్లో పారిశుద్ధ్య పనులకు 3100 వాహనాలు సమకూర్చాలి. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగిలిన వాటిని త్వరగా రప్పించాలి. మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. శ్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలి. మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, అందుకు స్థలాలను ఎంపిక చేయాలి. క్రీడా ప్రాంగణాలు, వ్యాయామశాలలు ఏర్పాటు చేయాలి. డంప్‌ యార్డుల కోసం స్థలాలు గుర్తించాలి. మరుగుదొడ్లను నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా వాటిని నిర్మించాలి. వీధిబాటలపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించే వరకు వారిని ఇబ్బంది పెట్టవద్దు. పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంబించాలి.

* తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

* కొత్త రెవెన్యూ చట్టం, నీటిపారుదల వ్యవస్థ పునర్య్వవస్థీకరణ, కొత్త ప్రవాస విధానం తదితర అంశాలపై చర్చించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.