close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐసీయూలో ఎస్పీ బాలు

క్షీణించిన ఆరోగ్య పరిస్థితి

కోడంబాక్కం (చెన్నై), న్యూస్‌టుడే, ఈనాడు, దిల్లీ: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీయూకి తరలించినట్లు ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 5వ తేదీన స్వల్ప కరోనా లక్షణాలతో ఎస్పీ బాలు ఈ ఆసుపత్రిలో చేరారు. గురువారం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. ఆ తరవాత ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అయితే గురువారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఐసీయూకి మార్చాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు’ అని ఆ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో ఎస్పీ బాలు ఈనెల 5న ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, హోం క్వారంటైన్‌లో ఉండమని వైద్యులు సూచించినా తాను ఆసుపత్రిలో చేరినట్లు అందులో వివరించారు. బాలు ఆరోగ్యం క్షీణించిన విషయం చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేసింది. సంగీత దర్శకుడు రెహమాన్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన అద్వితీయమైన స్వరంతో ఎంతో వినోదాన్ని పంచారు. నాతోపాటు సంగీతాభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయాలి’ అని కోరారు. ‘బాలు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. ఆయన పూజించే దేవతలు, నేను పూజించే  ప్రకృతి  ఆయనను  కాపాడుతుంది’ అని సీనియర్‌ దర్శకుడు భారతిరాజా పేర్కొన్నారు. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని పలువురు  సినీ తారలు, సంగీత దర్శకులు, గాయకులు ఆకాంక్షించారు.

వదంతులను నమ్మొద్దు: ఎస్పీ చరణ్‌
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో వచ్చిన సమాచారం, ఇతర వదంతులను నమ్మొద్దు’’ అని స్పష్టం చేశారు.

డాక్టర్లతో మాట్లాడిన వెంకయ్యనాయుడు
బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలియగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆసుపత్రి యజమానులు రాజగోపాలన్‌, ప్రశాంత్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. బాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
అందుకు డాక్టర్లు స్పందిస్తూ 15 మంది వైద్యనిపుణులతో చర్చించిన తరవాత ఆయనకి ఐసీయూలో ఎకో సౌకర్యం ఏర్పాటుచేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఉపరాష్ట్రపతికి చెప్పారు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్‌తో కూడా వెంకయ్యనాయుడు మాట్లాడారు. బాలూ సంపూర్ణ ఆరోగ్యవంతుడై వస్తారని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా ప్రాశస్త్యాన్ని తెలిపే పాటను వెన్నెలకంటి రాస్తే, బాలసుబ్రహ్మణ్యం పాడాలని, దర్శకుడు కోదండరామిరెడ్డి దాన్ని చిత్రీకరించాలని ఇదివరకే తాము ఒక అవగాహనకు వచ్చిన విషయాన్ని వెంకయ్యనాయుడు చరణ్‌తో ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.