close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ వైద్యసేవలపై వివరణ ఇవ్వండి

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ స్వయంగా హాజరు కావాలి: హైకోర్టు
ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ ఉండాలన్న న్యాయస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: బోధనాసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో బోధనాసుపత్రులను వినియోగించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున వసుధానాగరాజ్‌ వాదనలు వినిపించారు. బోధనాసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా అందరూ గాంధీ ఆసుపత్రికి వస్తున్నారని.. అక్కడ యాంటీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు లేవు అని పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘కరోనా రోగులు జిల్లా ఆసుపత్రులకు వెళితే చాలావరకు గాంధీ ఆసుపత్రికి వెళ్లమంటున్నారు. అటువంటప్పుడు కొవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులను గుర్తించి ప్రయోజనం ఏముంది? ఆదిలాబాద్‌ వంటి మారుమూల జిల్లాల నుంచి రోగులు ఇక్కడికి రావాలంటే కష్టం. అమెరికాలో ఇంటికి రెండు కార్లుంటాయి. ఇక్కడ బైక్‌ కూడా ఉండని పేదలున్నారు. ఇంట్లో 60 ఏళ్ల అమ్మకు కరోనా వస్తే ఇక్కడికి ఎలా తీసుకురావాలి? ఈ పరిస్థితిలో ఏఏ ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలు అందుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. పూర్తి వివరాలను ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ స్వయం గా వచ్చి వివరించాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

‘ప్రైవేటు’ దోపిడీపై కౌంటరు దాఖలు చేయండి: ప్రైవేటు ఆసుపత్రులు.. నిర్దేశించిన మొత్తాలను కాకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవో అమలయ్యేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. కౌంటరుకు ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.


అది కరోనా చావు కాదు.. వైద్య నిర్లక్ష్యమే
తప్పు చేసినవారిపై చర్య తీసుకోవాల్సిందే
ఛాతీ ఆసుపత్రిలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఛాతీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రవికుమార్‌ అనే యువకుడు మృతిచెందిన సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కరోనా వల్ల వచ్చిన మరణం కాదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే జరిగిందని పేర్కొంది. ఇలా తప్పు చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. వారిపై కేసులు నమోదు చేసి అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొంది. యువకుడి మృతికి కారకులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్గం యశ్‌పాల్‌గౌడ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రియాంక చౌదరి వాదనలు వినిపిస్తూ.. సకాలంలో వైద్యం అందక రవికుమార్‌ మృతి చెందారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారానికి సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌కు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక నిజాయితీగా ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి నివేదికను ఈ నెల 20లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.