close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజ్యసభలో రణరంగం

మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులకు ఆమోదం
అడ్డుకోవడానికి విపక్షాల విఫలయత్నం.. మార్షల్స్‌ రంగప్రవేశం
మైకులు లాక్కొనే యత్నం...
మహిళా బిల్లు నాటి దృశ్యాలు  దశాబ్దం తర్వాత పునరావృతం
డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాల నోటీసు
ఈనాడు - దిల్లీ

వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు అధికార పక్షం, వ్యతిరేకించేందుకు విపక్షాలు మోహరించడంతో ఆదివారం రాజ్యసభలో యుద్ధ వాతావరణం నెలకొంది. బిల్లులపై చర్చ సందర్భంగా సభ రణరంగాన్ని తలపించింది. ఒకదశలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆవేశంగా పోడియం వద్దకు దూసుకువచ్చి, సభా నిబంధనల పుస్తకాన్ని  డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మీదికి విసిరారు. కోపంగా బిల్లు ప్రతుల్ని చించి విసిరేయడంతోపాటు మైకుల్ని బలవంతంగా లాక్కోవాలని చూశారు. ఈ ప్రయత్నాలను మార్షల్స్‌ వమ్ము చేశారు. అరుపులు, కేకలు, వాగ్వాదాల నడుమ ఈ బిల్లులు మూజువాణి ఓటుతో సభామోదం పొందినట్లు హరివంశ్‌ ప్రకటించారు. సభ ముగిశాక డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి.

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో తీవ్ర గందర గోళం నెలకొంది. 2010 మార్చి 9న అప్పటి యూపీయే ప్రభుత్వం వ్యూహాత్మకంగా మార్షల్స్‌ని మోహరించి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకున్న పద్దతుల్లోనే ఎన్డీయే సర్కారు ప్రస్తుతం ఈ బిల్లులను ఆమోదింప జేసుకుంది. అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న వారి స్థానాలు మారినా వ్యూహం అదే అమలైంది. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు 2020, ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లు 2020’లను అడ్డుకోవడానికి విపక్షాలు చేసిన ప్రయత్నాలను మార్షల్స్‌ సాయంతో అధికారపక్షం నిర్వీర్యం చేసింది. బిల్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్లను తోసిపుచ్చుతూ ప్రభుత్వం 2 బిల్లులను మూజువాణి ఓటుతో నెగ్గించుకుంది. రెండురోజుల క్రితం లోక్‌సభ ఆమోదం పొంది ఆదివారం రాజ్యసభ ముందుకొచ్చిన రెండు బిల్లులపై ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చర్చ సాఫీగా జరిగింది. 31 మంది అధికార విపక్ష సభ్యులు తమ తమ వాదనలను బలంగా వినిపించి ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లేచి బిల్లులపై చర్చకు సమాధానమిస్తుండగా రాజ్యసభ ముగిసే సమయం (మధ్యాహ్నం ఒంటిగంట) అయింది. దాంతో ఆయన్ని ఉపాధ్యక్షుడు హరివంశ్‌ ఆగాల్సిందిగా చెప్పి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మాట్లాడే అవకాశమిచ్చారు. బిల్లు ఆమోదం పొందేవరకు సభా సమయాన్ని పొడిగించాలని జోషి కోరారు. సభను కొనసాగించడానికి డిప్యూటీ ఛైర్మన్‌ ఉపక్రమించారు. ఏకాభిప్రాయం లేకుండా అలా చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపడం మొదలుపెట్టాయి. వాటితో సంబంధం లేకుండా తోమర్‌ తన సమాధానాన్ని కొనసాగించారు. ప్రతిపక్షాలు మరింత ఆవేశానికి లోనై తమ ఆందోళనను ఉద్ధృతం చేశాయి. ‘రైతుల పాలిట మరణ శాసనాలుగా నిలిచే ఈ బిల్లులపై సంతకం చేసేది లేదు’ అని తేల్చిచెప్పాయి.

వెల్‌లోకి వచ్చి నినాదాలు
ఆ సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేష్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, మరికొందరు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగారు. టీఎంసీ సభాపక్ష నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ లేచి డిప్యూటీ ఛైర్మన్‌కు నిబంధనల పుస్తకం చూపుతూ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా తోమర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభా సమయాన్ని పొడిగించాలంటే సంఖ్యాబలం ఆధారంగా కాకుండా ఏకాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోందని, సభలోని చాలా పార్టీలు చర్చను సోమవారానికి వాయిదా వేయాలని కోరుతున్నందున దాన్ని గౌరవించాలని ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌ సూచించారు. సభ కొనసాగించడానికే డిప్యూటీ ఛైర్మన్‌ మొగ్గు చూపడంతో విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చారు. కరోనా సమయంలో వెల్‌లోకి రావొద్దన్న హరివంశ్‌ సూచనలను పట్టించుకోకుండా ఆందోళన కొనసాగించారు. ఒకవైపు మంత్రి సమాధానం, మరోవైపు ప్రతిపక్షాల నినాదాలు సమాంతరంగా సాగి, సభలో గందరగోళ తీవ్రత పెరిగింది. ఒకదశలో ప్రత్యక్ష ప్రసార ఆడియోను డిప్యూటీ ఛైర్మన్‌నిలుపుచేయాల్సి వచ్చింది. పావుగంట సభను వాయిదావేసినా పరిస్థితి సద్దుమణగలేదు. ఓటింగుకు సభ్యులు పట్టుపట్టినా సభలో నెలకొన్న వాతావరణంలో అది అసాధ్యమని, అందరూ కూర్చుంటేనే వీలవుతుందని హరివంశ్‌ తేల్చిచెప్పారు.

సవరణ ప్రతిపాదనలకు తిరస్కారం
బిల్లులను వ్యతిరేకిస్తూ టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్‌, సీసీఎం సభ్యులు చేసిన సవరణలను, సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న డిమాండ్లను సభ తిరస్కరిస్తున్నట్లు హరివంశ్‌ ప్రకటించారు. ఓబ్రియెన్‌ ప్రతిపాదించిన సవరణలను సభ ముందుంచి మూజువాణి ఓటింగ్‌ ద్వారా వాటినీ తిరస్కరించినట్లు ప్రకటించారు. సభాధ్యక్ష స్థానం వద్దకు ఓబ్రియెన్‌ దూసుకెళ్లి ‘మీరు అలా చేయడానికి వీల్లేదు’ అని అన్నారు. సభా నిబంధనల పుస్తకాన్ని చూపుతూ దాన్ని అనుసరించాలని ఆవేశంగా గద్దించారు. ఆయన హరివంశ్‌తో ఘర్షణకు దిగారన్న వాతావరణం కనిపించి, పరిస్థితులు ఒక్కసారి తీవ్ర ఉద్రిక్త రూపును సంతరించుకున్నాయి. మూజువాణి ఓటు ద్వారా సభాభిప్రాయాన్ని కోరేందుకు డిప్యూటీ ఛైర్మన్‌ ప్రయత్నించారు.

హరివంశ్‌పైకి దూసుకుపోయే యత్నం
ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌, తృణమూల్‌, ఆప్‌, ఎస్పీ ఎంపీలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ తదుపరి రూలింగ్‌ ఇవ్వకుండా ఆయన మైక్‌లను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగితాలు చింపి గాల్లోకి ఎగరేశారు. మీరేం చేస్తున్నారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ను ఓబ్రియెన్‌ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్‌ మీదికి దూసుకుపోవడానికి, అక్కడ ఆసీనులైన అధికారుల బల్లలపైకి చేరుకునేందుకు ప్రయత్నించిన కొందరు సభ్యులను రాజ్యసభ సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతలో ప్రహ్లాద్‌ జోషి వచ్చి డిప్యూటీ ఛైర్మన్‌ చెవిలో ఏదో చెప్పారు. ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష సభ్యులు ఉపాధ్యక్షుడి టేబుల్‌ మీదున్న మైకులు లాగేందుకు ప్రయత్నించగా, రాజ్యసభ సిబ్బంది అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతసేపు సభా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. హరివంశ్‌ కొద్దిసేపు నిశ్చేష్టంగా కూర్చుండిపోయారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిల్చొని తమ ఆందోళనను యథాతథంగా కొనసాగించారు. ఈ సమయంలో ప్రహ్లాద్‌జోషి మరోసారి డిప్యూటీ ఛైర్మన్‌ స్థానం వద్దకు వచ్చి ఏదో మాట్లాడారు. మంత్రి ముక్తార్‌అబ్బాస్‌ నఖ్వి వచ్చి ఏదో కాగితం అందించారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మంత్రి  తోమర్‌తో మాట్లాడారు. అప్పటికీ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతుండడంతో మధ్యాహ్నం 1.26 గంటల సమయంలో సభను కొంతసేపు వాయిదావేశారు. పునఃప్రారంభమయ్యే సమయానికి విపక్షాలను అడ్డుకోవడానికి మార్షల్స్‌ని మోహరించారు.


..ఆ 18 నిమిషాలు యుద్ధ వాతావరణం

మధ్యాహ్నం 1.42 నుంచి 2 గంటల వరకు 18 నిమిషాలపాటు సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. మార్షల్స్‌, ఎంపీల మధ్య తోపులాట, నినాదాల్లాంటి ఉద్రిక్తకర వాతావరణం మధ్యే హరివంశ్‌.. వ్యవసాయ బిల్లులపై మూజువాణి ఓటును కోరారు. సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించి, బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లోనే సభ సోమవారానికి వాయిదా పడింది. ఆ తర్వాతా కొందరు విపక్ష సభ్యులు సభలోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాజ్యసభ ప్రాంగణంలో కూర్చోవాల్సి వచ్చిన లోక్‌సభ సభ్యులు ఎగు వసభలో అడుగుపెట్టలేకపోవడంతో దిగువసభను గంటసేపు వాయిదా వేశారు.


కూర్చుంటేనే ఓటింగ్‌ సాధ్యం

సభ పునఃప్రారంభమైన వెంటనే డిప్యూటీ ఛైర్మన్‌ మాట్లాడుతూ ఓటింగ్‌ కోరే వాళ్లు సీట్లలో కూర్చోవాలని, అప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వం ఎలాగైనా బిల్లులు ఆమోదించుకునే ధోరణితో వెళ్తోందని భావించిన సీపీఎం, కాంగ్రెస్‌, తృణమూల్‌, ఆప్‌ సభ్యులు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోడియం దగ్గరకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్షల్స్‌ వారిని ముందుకు సాగనీయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. భౌతిక దూరం పాటించాల్సి ఉన్నప్పటికీ వెల్‌లో అలాంటిది కనిపించలేదు. మార్షల్స్‌ అంతా మూకుమ్మడిగా మోహరించగా, ఎంపీలూ వారిని తప్పించుకొని డిప్యూటీ ఛైర్మన్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట, తోపులాట జరిగింది. కొందరు సభ్యులు సెక్రటరీ జనరల్‌ టేబుల్‌ మీదున్న స్టేషనరీని విసిరికొట్టారు. మరికొందరు దస్త్రాలను చెల్లాచెదురు చేశారు. ఆప్‌ సభ్యుడు సంజయ్‌సింగ్‌ రాజ్యసభ సచివాలయ సిబ్బంది కూర్చొనే టేబుల్‌మీదికెక్కి నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. మార్షల్స్‌ ఆయన్ను ఒడిసిపట్టుకొని బలవంతంగా బయటికి మోసుకెళ్లే ప్రయత్నం చేయగా దిగ్విజయ్‌సింగ్‌, మరికొందరు కాంగ్రెస్‌ ఎంపీలు అడ్డుకొన్నారు. కేరళ ఎంపీ కేకే రాగేష్‌ పోడియం దగ్గరకు దూసుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు వెనుక నుంచి మార్షల్‌ ఆయన్ను లాగేశారు. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

అవిశ్వాసంపై విపక్షాల తీర్మానం
రాజ్యసభలో బిల్లులకు ఎన్డీయే పక్షాలతో పాటు జేడీ(యు), వైకాపా మద్దతు తెలిపాయి. ఉభయసభల ఆమోదం లభించడంతో బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తాయి. డిప్యూటీ ఛైర్మన్‌పై పలు విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. సభను వాయిదా వేయకుండా బిల్లుల్ని ఆమోదించిన తీరును అవి తప్పుపట్టాయి. నోటీసులు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, తెరాస, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, డీఎంకే, ఆప్‌ ఉన్నాయి.


బిల్లుల ఆమోదం చరిత్రాత్మకం
- ప్రధాని నరేంద్ర మోదీ

రెండు ప్రధాన బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం మనదేశ వ్యవసాయ రంగ చరిత్రలో చరిత్రాత్మకం. ఇవి ఈ రంగంలో సమూల మార్పులను తీసుకువస్తాయి. దళారుల బెడద సహా రైతులు కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేకానేక అవస్థల నుంచి వారికి విముక్తి కలుగుతుంది. రైతులకు సాధికారత లభిస్తుంది. రైతులకు ప్రభుత్వపరంగా ఇప్పుడు లభిస్తున్న మద్దతు ఇకపైనా కొనసాగుతుంది. కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణ ఇకపైనా ఉంటాయి. రైతుకు సేవ చేయడానికే మేం ఉన్నాం. భవిష్యత్తు తరాల రైతులకూ సాధ్యమైనంత దన్నుగా నిలిచి, వారి జీవితాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలన్నీ మేం చేపడతాం. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సాంకేతికత కొరత ఉంది. ఇప్పుడు అది తీరుతుంది. దిగుబడి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ధర రైతులకు లభిస్తుంది.


పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీసిన ప్రతిపక్షాలు: రాజ్‌నాథ్‌

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును ఎన్డీయే ప్రభుత్వ సీనియర్‌ మంత్రులు తీవ్రంగా ఖండించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు థావర్‌చంద్‌ గహ్లోత్‌, ప్రహ్లాద్‌జోషి, ప్రకాశ్‌ జావ్‌డేకర్‌, పీయూష్‌ గోయెల్‌, ముక్తార్‌అబ్బాస్‌ నక్వీలు ఆదివారం రాత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి ఒక అంశంపై ఇంతమంది సీనియర్‌ మంత్రులు ఒకేసారి విలేకర్ల సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం.

సూర్యుడు ఉన్నంతవరకు ఎంఎస్‌పీ ఉంటుంది

సూర్యుడున్నంత వరకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉంటాయని, అవి ముగిసిపోయే ప్రసక్తేలేదని రాజ్‌నాథ్‌ తేల్చిచెప్పారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.